దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు - Kurnool - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు

మెరిట్‌ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక

నిమిషం ఆలస్యమైనా అనుమతించం

కలెక్టర్‌ వీరపాండియన్‌


మాట్లాడుతున్న కలెక్టర్‌ వీరపాండియన్‌, పక్కన ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు కార్యదర్శి పోస్టులు ఇప్పిస్తామంటూ మధ్యవర్తులు, దళారులు అభ్యర్థులను మభ్యపెడుతూ డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటివి ఎవరూ నమ్మొద్దని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయని చెప్పారు. ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, ట్రైనీ కలెక్టర్‌ విధే ఖరే, డీఆర్వో వెంకటేశంలతో కలిసి గురువారం మాట్లాడారు. జిల్లాలో కొత్తగా 881 గ్రామ సచివాలయాలు, 300 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. మొత్తం 9,597 పోస్టులకు 2,01,886 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 1వ తేదీన జరిగే పరీక్షకు 1,44,478 మంది హాజరవుతున్నట్లు చెప్పారు.

25వ తేదీ అర్ధరాత్రి నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. హాల్‌ టికెట్లు రాకపోయినా, ఏవైనా సమస్యలు ఉన్నా, మధ్యవర్తులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నా ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా 08518-277305, 9059477167 నంబర్లకు, rtgskurnool@gmail.com కు ఫిర్యాదు చేయొచ్చన్నారు.

హాల్‌టికెట్లలో ఫోటో సరిగా కనిపించకుంటే తెల్లకాగితం మీద అభ్యర్థి వివరాలు రాసి 3 పాస్‌పోర్ట్‌ ఫొటోలతో గెజిటెడ్‌ అధికారి సంతకం చేయించి ఇన్విజిలేటర్లకు అందజేయాలన్నారు. సెప్టెంబరు 1న జరగనున్న పరీక్షకు 444 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా పరిషత్‌లోని డీపీఆర్‌సీ భవనంలో రెండు స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వివరించారు.

అర్ధగంట ముందే రావాలి

పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 9.30కే చేరుకోవాలని కలెక్టర్‌ సూచించారు. 9.45కు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2 గంటల లోపు రావాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించమని స్పష్టం చేశారు.

పోలీసు శాఖ నుంచి పరీక్షలకు మూడంచల భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప తెలిపారు. వచ్చేనెల 1 నుంచి 8వ తేదీ వరకు పోలీసు భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉంటాయన్నారు.

అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్‌ కేంద్రాలను మూసేయిస్తామని, 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే 100 నంబరుకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.