బతుకు చితికి..భవిత చీకటి - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

బతుకు చితికి..భవిత చీకటి

బాధిత కుటుంబాలకు అందని వైఎస్‌ఆర్‌ బీమా

ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు

1711 మందికి రూ.34.04 కోట్ల బకాయిలు

ఆదోని పురపాలకం, మద్దికెర, న్యూస్‌టుడే : జిల్లాలో వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద పరిహారం నగదు కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆసరాగా నిలిచిన పథకం ప్రస్తుతం నగదు విడుదల కాక, అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకటి.. రెండు కాదు ఏకంగా ఏడాది కాలం నుంచి 1711 మంది బాధిత కుటుంబాలకు నగదు అందాల్సి ఉంది. ● జిల్లాలో 14 నియోజకవర్గాల్లో బీమా సొమ్ము అందాల్సి ఉంది. మొత్తం 18,13,475 మంది పథకంలో నమోదై ఉన్నారు. 2016, అక్టోబరు 2న గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న బీమా పేరుతో పథకం ప్రారంభించారు. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్‌ఆర్‌ బీమా పథకంగా మార్పు చేశారు. అసంఘటిత రంగ కార్మికులు, 18 నుంచి 69 ఏళ్ల లోపు, నెలవారీ ఆదాయం రూ.15 వేల లోపు ఉండి, తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని నిర్ణయించారు. ఆరంభంలో లబ్ధిదారుని వాటా రూ.15లుగా నిర్ధారించి నమోదు చేశారు. అనంతర కాలంలో లబ్ధిదారుల వాటాను సైతం ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. ఒక్కసారి నమోదైతే చాలన్నట్లుగా పథకం నడిచింది.

అందని పరిహారం : జిల్లాలో పథకంలో నమోదై మృతి చెందిన వారికి బీమా మిత్ర లేదా కాల్‌ సెంటర్‌కు మృతుడి ఆధార్‌ సంఖ్య ద్వారా సమాచారం అందిస్తే, తక్షణ సాయంగా బీమా మిత్ర సభ్యులు రూ.5 వేలు అందిస్తారు. మిగిలిన సొమ్మును నామినీ బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ఇలా ఇప్పటివరకు మృతి చెంది, పరిహారం అందని మృతుల సంఖ్య 2018, జూన్‌ 1వ తేదీ నుంచి మే 31, 2019 నాటికి 1711 మంది ఉన్నారు. జూన్‌, జులై మధ్య కాలంలో ఎంతలేదన్నా మరో 100 మంది వరకు ఉంటారని అంచనా. కర్నూలులో 171, చివరి స్థానంలో కోడుమూరులో 88 మందికి అందాల్సి ఉంది. అనంతరం వచ్చిన ప్రభుత్వంలోనైనా డబ్బులు అందుతాయని బాధిత కుటుంబాలు భావించాయి. నేటికీ మృతుల బంధువులు బీమా మిత్రలకు సమాచారం అందించి పరిహారం కోసం నమోదు చేయిస్తున్నారు. ఎప్పటికైనా సొమ్ములు అందుతాయనే ఆశతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఈరమ్మ కుటుంబం. వీరు ఆదోని హవన్నపేటలో నివాసముంటున్నారు. ఈ ఏడాది మార్చి 4న ఈరమ్మ కన్నుమూశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ సాయంగా రూ.5 వేలు చెల్లించారు. బీమా పరిహారంగా ఇంకా రూ.1.95 లక్షలు అందాల్సి ఉంది. అంతకు ముందే భర్త మృతి చెందారు. వీరికి కుమారుడు(14) ఉన్నాడు. పరిహారం సొమ్ము విడుదలైతే అతని భవిష్యత్తుకు భరోసా దొరుకుతుంది.

●సంతపేటలో శ్రీధర్‌ అనే చిరు వ్యాపారి రెండు మాసాల క్రితం బెంగళూరులో రహదారి ప్రమాదంలో మృతి చెందారు.

హవన్నపేటకు చెందిన చిట్టి అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వీరు పరిహార సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ మహిళ పేరు మల్లమ్మ. ఆమె భర్త కోలి ఎల్లప్ప మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. పనికి పోతేకానీ పూట గడవని దయనీయ పరిస్థితి వారిది. ప్రభుత్వం ఇచ్చే బీమా సొమ్ము ఆదుకుంటుందని ఆశించిన ఆ బాధిత కుటుంబానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. మద్దికెరకు చెందిన ఈ కుటుంబం ప్రభుత్వం ఇచ్చే వైఎస్‌ఆర్‌ బీమా సొమ్ము కోసం ఎదురుచూస్తోంది. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 15 మంది బాధిత కుటుంబాలకు రూ.22 లక్షలకు పైగా సొమ్ము అందాల్సి ఉంది. కుటుంబ యజమాని చనిపోయిన రోజు అంత్యక్రియల కోసం ఇవ్వాల్సిన రూ.5 వేలు కూడా అందించడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బాధిత కుటుంబాలకు వైఎస్‌ఆర్‌ బీమా పథకం సొమ్ము అందించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సునీత(పాత చిత్రం)

ఆదోని పట్టణం క్రాంతి నగర్‌కు చెందిన సునీత తన భర్తతో కలిసి తోపుడు బండిపై మసాలా దినుసులు విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీివల అనారోగ్యంతో సునీత మృతి చెందారు. అసలే పేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. బీమా సొమ్ము అయినా మంజూరైతే ఈ కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.