బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం - Kurnool - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం

ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహకాలు

మరో వంద ఉల్లి గోదాముల నిర్మాణమే లక్ష్యం


ఏపీఎంఐపీ పీడీ, ఉద్యాన శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ సీహెచ్‌ పుల్లారెడ్డి

కర్నూలు పాతనగరం, న్యూస్‌టుడే : బిందు సేద్యంతో నాణ్యమైన దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్ఛు ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, బీసీ, ఓసీలకు 90 శాతం రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందిస్తాం. ఈ ఏడాది 27,500 హెక్టార్లకు బిందు సేద్యం పరికరాలు ఇవ్వాలని లక్ష్యం ఉండగా ఇప్పటివరకు 2,900 హెక్టార్లకుపైగా పరికరాలు మంజూరు చేశాం. మిగిలినవి గడువులో పూర్తి చేస్తాం. ఉద్యానశాఖ ద్వారా పంటలను సాగు చేసిన రైతులకు హెక్టారుకు రూ.3 వేలను ప్రోత్సాహకంగా అందిస్తామని ఏపీఎంఐపీ పీడీ, ఉద్యాన శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ సీహెచ్‌ పుల్లారెడ్డి అన్నారు. ఉల్లి విత్తనాలు, విత్తనాలు నాటే యంత్రాలు తదితరాలు రాయితీపై అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఉల్లి గోదాములు, షేర్‌ నెట్‌ నిర్మాణాలకు రాయితీ వర్తింపజేస్తామని వివరించారు. సూక్ష్మబిందు సేద్యం, ఉద్యానశాఖల ద్వారా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, ఇస్తున్న రాయితీల వివరాలను ఆయన ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

ప్రశ్న : సూక్ష్మ బిందు సేద్యం, ఉద్యాన శాఖల్లో ఎలాంటి రాయితీలు ఉన్నాయి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

జవాబు : చిన్న, సన్నకారు ఎస్సీ, ఎస్టీ రైతులకు రెండు హెక్టార్లకు రూ.2 లక్షల వరకు వంద శాతం రాయితీ, బీసీ, ఓసీ రైతులకు 90 శాతం రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 5 ఎకరాలకు పైబడి భూమి ఉన్న అన్నివర్గాల రైతులకు రూ.4 లక్షల వరకు 50 శాతం రాయితీ ఇస్తాం. ఆధార్‌ కార్డు, పొలం పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, బియ్యం కార్డు జిరాక్సు పత్రాలతో నీటి సౌకర్యం ఉన్నట్లు రుజువు పత్రాన్ని జత చేసి మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్ఛు లేదా మా క్షేత్రస్థాయి అధికారులకు పత్రాలు ఇస్తే వారు అక్కడే రైతుల వేలిముద్రలు తీసుకుని దరఖాస్తు చేస్తారు. పరిశీలించి వారం రోజుల్లోనే మంజూరు చేస్తాం.

ఉద్యానశాఖ ద్వారా ఉద్యాన పంటలు సాగు చేసేందుకుగాను అనుమతించిన విత్తన దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆ బిల్లులతోపాటు పొలం పాసు పుస్తకం జిరాక్సు, సాగైన పంట చిత్రాన్ని జత చేసి దరఖాస్తు చేసుకుంటే హెక్టారుకు రూ.3 వేలను అర్హులైన రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. దీంతోపాటు టార్పాలిన్‌ పట్టాలు, తైవాన్‌ స్ప్రేయర్లు, చిన్న ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు 50 శాతం రాయితీపై అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్న :: పండ్ల తోటలు, షేర్‌నెట్‌లలో పూల సాగు ఎలా ఉంది?

జవాబు : మామిడి, టిష్‌ అరటి, దానిమ్మ తదితర పండ్ల తోటలు దాదాపు వెయ్యి హెక్టార్లలో సాగులో ఉన్నాయి. ఈ తోటల పెంపకానికి రాయితీలు ఇస్తాం. మొదట రైతులే పెట్టుబడి పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్యాంకు ఖాతాల్లో రాయితీ సొమ్మును జమ చేస్తాం. ఈ ఏడాది కొందరు రైతులు డ్రాగన్‌, ఫిగ్‌, సీతాఫలం తోటలను సాగు చేస్తామని అడిగారు. ఈ విషయాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం. అనుమతులు వస్తే రాయితీలు అందిస్తాం. పండ్ల తోటలకు రెండు వరుసల్లో లాటరీలు అమర్చుకునేందుకు బిందు సేద్యం పరికరాలు రాయితీపై ఇస్తాం. షేర్‌నెట్‌ నిర్మాణాలకు చదరపు మీటరుకు రూ.300 నుంచి రూ.400 చొప్పున ఒక్కో రైతుకు 4 వేల చదరపు మీటర్ల వరకు రాయితీ ఇస్తాం.

ప్రశ్న : : రైతు ఉత్పత్తిదారుల సంఘాలపై ఏమైనా దృష్టి పెట్టారా?

జవాబు : రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకున్నాం. ఈ ఏడాది 8 సంఘాలు ఏర్పాటుచేసి జడ్‌టీ సంస్థకు అనుసంధానం చేస్తాం. ప్రస్తుతం గూడూరు మండలం ఖానాపురం రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యులైన రైతులు పండించిన కూరగాయలు, ఆకు కూరలు శ్రీశైలం దేవస్థానానికి సరఫరా అవుతున్నాయి. దీంతోపాటు పొదుపు మహిళలు తయారుచేసిన పచ్చళ్లు వెళ్తున్నాయి. ఈ సంఘాలకు 75 శాతం రాయితీపై ట్రాక్టర్లు, రవాణాకు వాహనాలు, వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్న : : రాయితీపై పొందిన యంత్రాలు, పరికరాలు కొన్ని పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

జవాబు : లాభసాటి వ్యవసాయం కోసమే రాయితీలు ఇస్తున్నాం. ఏ పథకానికీ వంద శాతం రాయితీ ఉండదు. కేవలం బిందు సేద్యంలో మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో సూక్ష్మబిందు సేద్యానికి రూ.120 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.21 కోట్లు కేటాయించింది. రాయితీ పథకాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న : : ఉల్లి సాగు చేసే రైతులకు రాయితీలు ఇస్తున్నారా?

జవాబు : రాష్ట్రంలోనే మన జిల్లాలో ఉల్లి సాగు అధికం. ఉల్లి సాగులో వినూత్న మార్పులు వచ్చాయి. బెట్ట, తెగుళ్లు తట్టుకునే రకం విత్తనాలను శాస్త్రవేతలు రూపొందించారు. బిందు సేద్యంతో ఉల్లి సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. రెడ్‌ 3, ఎల్‌ 888 అనే రకాలను రాయితీపై ఇస్తున్నాం. విత్తనాలు వేసే యంత్రం నుంచి పంట నూర్పిడి, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేసే వరకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైనవారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం. ఉల్లి గోదాముల నిర్మాణానికి రాయితీ సైతం ఇస్తాం. ఇప్పటివరకు జిల్లాలో వంద మందికిపైగా రైతులు గోదాములను నిర్మించుకున్నారు. ఈ ఏడాది మరో వంద గోదాములు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.