close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

బాధితులకు రికవర్రీ

జిల్లాలో వరుస దొంగతనాలు, దోపిడీలు

ఆందోళన చెందుతున్న జనం

పాత నేరగాళ్లపై కానరాని నిఘా


నగరంలోని ఓ ఇంట్లో చోరీ జరగడంతో పరిశీలిస్తున్న సీఐ (పాత చిత్రం)

జిల్లాలో దొంగలు పెట్రేగిపోతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట దోపిడీ.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. వేసవికాలంలో నేరాలకు పాల్పడే దొంగలు సీజన్‌ మర్చి వర్షాకాలంలోనూ తమ పని కానిచ్చేస్తున్నారు. ఇటీవల బదిలీ ప్రక్రియ జరగడం.. స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది కొత్తవారు కావడంతో దొంగలను పట్టుకోవటం సవాలుగా మారింది. తాళం వేసిన ఇళ్లపైనే దృష్టి సారించే దొంగలు ప్రస్తుతం హత్యలు.. మారణాయుధాలతో దాడి చేసి ప్రజలను దోచుకుని భయాందోళనకు గురిచేస్తున్నారు. దాచుకున్న కష్టార్జితమంతా దొంగలపాలవుతుండటంతో బాధితుల బాధ వర్ణనాతీతం. - న్యూస్‌టుడే-కర్నూలు నేరవిభాగం

జిల్లాలో తరచూ జరుగుతున్న దొంగతనాలతో జనం భయాందోళన చెందుతున్నారు. అంతర్రాష్ట్ర దొంగలు సైతం నేరాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్‌, మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాలు వాహనాల్లో వచ్చి జిల్లాలో అనుకూలమైన ప్రాంతాల్లో దోపిడీకి పాల్పడుతున్నాయి. సంబంధిత నేరగాళ్లను పట్టుకోవటం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. జిల్లాలో ప్రతి నెలా దాదాపు రూ.50 లక్షల వరకు సొత్తు దొంగలపాలవుతోంది. ఈ ఏడాది జూన్‌ వరకు పరిశీలిస్తే రూ.3 కోట్ల విలువైన సొత్తును దొంగలు అపహరించారు. సొత్తు రికవరీ విషయాన్ని పరిశీలిస్తే 2017లో 35 శాతం, 2018లో 49 శాతం రికవరీ ఉండగా.. ఈ ఏడాది జూన్‌ వరకు 30 శాతం మాత్రమే రికవరీ ఉంది.

ఇలాగైతే దొరికేదేలా..

జిల్లాలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నేరం జరిగిన సందర్భంలో వేలి ముద్రల ఆధారంగా నిందితుడు ఎవరనేది తేలితేనే పట్టుకుంటున్నారు. లేకుంటే కేసును పట్టించుకోవడం లేదు. నేరగాళ్లపై అవగాహన.. నేర పరిశోధనపై పట్టున్న పోలీసు సిబ్బందికి తగిన ప్రోత్సాహం, సౌకర్యాలు లేకపోవడంతో చాలామంది చురుగ్గా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిరంతరం పాత నేరగాళ్లపై నిఘా ఉంచే కర్నూలు సీసీఎస్‌ ఆ స్థాయిలో పనిచేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు

జులై 4న తుగ్గలి మండలం సూర్యతండాకు చెందిన మేకల కాపరి రాములనాయక్‌ను చంపి దుండగులు 25 మేకలను అపహరించుకుపోయారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులైన ప్యాపిలికి చెందిన కృష్ణకాంత్‌, పోదొడ్డి చెన్నులుగా గుర్తించి అరెస్టు చేశారు. ● జులై 5న కర్నూలు శివారులోని సంతోష్‌ నగర్‌లో ఉంటున్న విశ్రాంత అబ్కారీశాఖ ఎస్సై షేక్‌ అలీబాషా ఇంట్లో 14 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణకు గురైంది. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకొని సొత్తు రికవరీ చేశారు. ● జులై 16వ తేదీ తెల్లవారుజామున 8 మంది దొంగల ముఠా కర్నూలు శివారు పార్థసారథి నగర్‌లోని రెండిళ్లలో నిద్రిస్తున్నవారిపై దాడి చేసి గాయపరిచి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు దోచుకెళ్లింది. బాధితుడు.. ఆర్మీ ఉద్యోగి మోహన్‌ కిషోర్‌ దొంగల ముఠాపై తిరగబడడంతో వారు పారిపోయారు. ● జులై 19న కల్లూరు మండలం పెద్దటేకూరులో బి.ఫకృద్దీన్‌కు చెందిన ఏడు గొర్రెలు, బంగారు హారం, రూ.35 వేల నగదును దొంగలు అపహరించారు. ● జులై 21న ప్యాపిలిలో మైనింగ్‌ వ్యాపారి షేక్షావలి ఇంట్లో రూ.8.39 లక్షలు, 15 తులాల బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. ● జులై 21న నంద్యాలలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న వెంగళ్‌రెడ్డి ఇంట్లో దొంగలు పడి నాలుగు తులాల బంగారు ఆభరణాలను దొంగతనం చేశారు.

పొరుగు రాష్ట్రాల దొంగల ముఠాలపై అవగాహన పెంచుకుని వారి కదలికలపై నిఘా ఉంచే ప్రత్యేక బృందం లేకపోవటంతో జిల్లాలో దోపిడీ దొంగతనాల కేసుల్లో పురోగతి కరవైంది.

పాత నేరగాళ్లపై దృష్టేదీ?

జైలు నుంచి బయటకు వచ్చే నేరగాళ్లపై నిఘా ఉంచాల్సి ఉండగా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారి నడవడికపై నిరంతరం దృష్టి సారించాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు కొందరు పోలీసులు రికవరీ కోసం దొంగలను బెయిల్‌పై బయటకు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సదరు దొంగలు కొత్త నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం.

లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌తో ఉపయోగం

లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవడం లేదు. దీనిని ఏర్పాటుచేసుకోవాలంటూ పోలీసు అధికారులు అన్ని ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. పండగలు, ఇతర సమయాల్లో ఊర్లకు వెళ్లినప్పుడు తమకు సమాచారం అందించడం ద్వారా పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని, గస్తీ నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని వివరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

 

దొంగల చేతిలో గాయపడిన సైనికోద్యోగి (పాత చిత్రం)

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.