మనం.. మనం పంచేసుకుందాం! - Hyderabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

మనం.. మనం పంచేసుకుందాం!

వెలుగులోకి చందనవళ్లి ‘పెద్దల’ లీలలు
పరిహారం పంపిణీలో అక్రమాలు నిజమే
15 మందికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నోటీసులు
ఈనాడు, హైదరాబాద్‌

ఒక్కో ఎకరాకు రూ.9 లక్షల పరిహారం.. 1182 ఎకరాలు.. ఊరిలో మన మాటకు ఎదురు చెప్పేవారెవరున్నారు... తలా కొంత స్వాహా చేసేద్దామంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవళ్లికి చెందిన కొందరు పెద్దలు రంగంలోకి దిగారు.. స్థానిక రెవెన్యూ అధికారులు తోడయ్యారు. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసినట్లుగా రికార్డుల్లో మార్పులు చేసేశారు. భూములెక్కడున్నాయో తెలియకుండానే  అనుభవదారులకు దక్కాల్సిన పరిహారాన్ని గద్దల్లా తన్నుకుపోయారు. గ్రామస్థుల ఫిర్యాదుతో జిల్లా యంత్రాంగం  విచారించి అక్రమాలు జరిగినట్లు తేల్చింది. ఈ నెల 27న కలెక్టర్‌ ముందు హాజరు కావాలంటూ 15 మందికి నోటీసులు జారీ చేశారు.

గ్రీన్‌ ఫార్మా సిటీ హైదరాబాద్‌.. షాబాద్‌ మండలం చందనవళ్లి, హైతాబాద్‌, మాచన్‌పల్లి పరిధిలోని అసైన్డ్‌ భూముల్లో ‘గ్రీన్‌ ఫార్మా సిటీ హైదరాబాద్‌’ పేరిట పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని 2014లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం  2,060 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. చందనవళ్లి పరిధిలోనిసర్వే నం.190లో 1182 ఎకరాలను సేకరించేందుకు అధికారులు ముసాయిదా ప్రకటన జారీ చేశారు. ఒక్కో ఎకరాకు రూ.9 లక్షల పరిహారాన్ని అందించాలని నిర్ణయించారు. అసైన్డ్‌ వెరిఫికేషన్‌, ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించి 688.39 ఎకరాలకుగానూ 170 మంది రైతులకు రూ.60,20,77,500 పరిహారాన్ని చెల్లించారు.

రికార్డుల్లో మార్చేశారు: చందనవళ్లిలో కొందరు పెద్దలు ముఠాగా ఏర్పడి పేదలకు దక్కాల్సిన లబ్ధిని సొంతం చేసుకున్నారు. ఆ సర్వే నంబర్‌లో అసలు అనుభవదారులకు తక్కువ భూమి ఉన్నట్లు చూపించారు. మిగులు భూమిని వారి నుంచి కొనుగోలు చేసినట్లు మ్యాన్యువల్‌ రికార్డులో మార్పు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు భూములు ఎక్కడున్నాయో తెలియకుండానే కొందరు పరిహారం పొందారు. అదే గ్రామానికి చెందిన చేవెళ్ల స్వామి, ఎన్‌.రాంరెడ్డి తదితరులు ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎంజాయ్‌మెంట్‌ సర్వే, ఫామ్‌-సీ, ఫామ్‌-ఎఫ్‌, పరిహారం పంపిణీ తదితరాల వివరాలను సమగ్రంగా పరిశీలించడంతో పలుఅక్రమాలు వెలుగుచూశాయి. ఆన్‌లైన్‌ రికార్డుకు.. మ్యాన్యువల్‌ రికార్డుకు పొంతన లేదని గుర్తించారు.

మరో 10 మంది కూడా..
అసైన్డ్‌ భూములను అమ్మడం.. కొనడం  నేరం. అయినా సదరు అక్రమార్కులు కొనుగోలు చేసినట్లు చూపి పరిహారం దక్కించుకోవడం గమనార్హం. ఎంజాయ్‌మెంట్‌ సర్వేను పక్కాగా చేస్తే ఆ పెద్దల లీలలు బయటపడేవి. అసలు అనుభవదారులెవరో తేలేది. పరిహారం దక్కించుకున్న వాళ్లల్లో చాలా మందికి ఆ భూములు ఎక్కడున్నాయో తెలియదంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీఆర్వో, తహశీల్దార్‌, ఆర్డీవో తదితర రెవెన్యూ అధికారులు కుమ్మక్కై గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడిపించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ 15 మంది కాకుండా మరో 10 మంది కూడా అక్రమంగా లబ్ధి పొందినట్లు చెబుతున్నారు. గ్రామస్థులు ఫిర్యాదు చేసే వరకు అక్రమాలు జరిగినట్లు రెవెన్యూ యంత్రాంగం గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంకెన్ని చోటు చేసుకునేవో?
చందన్‌వళ్లిలో 1182 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా.. 688.39 ఎకరాలను సేకరిస్తేనే ఇన్ని అక్రమాలు చోటు చేసుకుంటే.. అదే మొత్తం ప్రక్రియ పూర్తయితే ఇంకెన్ని జరిగేవోనంటూ సాక్షాత్తూ జిల్లా ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ గ్రామంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కానీ ఆ ప్రక్రియను గ్రామస్థులు అడ్డుకున్నారు. పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలను సరిదిద్దిన తర్వాతే మిగిలిన భూమిని సేకరించాలంటూ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.