ఓటరుకేదీ ‘సేవ’! - Hyderabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

ఓటరుకేదీ ‘సేవ’!

గుర్తింపు కార్డుల జారీ నిలుపుదల
మీసేవా కేంద్రాలకు కార్డులివ్వని నిర్వహణ సంస్థ
అయోమయంలో నగర పౌరులు
ఈనాడు, హైదరాబాద్‌

‘మాకు ఎక్కువ లాభం వచ్చే సేవలే అందిస్తాం.. మిగతావి పక్కనపడేస్తాం’ అన్నట్లుగా ఉంది మీసేవా కేంద్రాల పరిస్థితి. రాజధాని నగరంలో వీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది. కమిషన్లు తీసుకుని అడ్డదారిలో రేషన్‌, ఆధార్‌ వంటి కార్డులు అందించే కొన్ని కేంద్రాలు ఇప్పుడు సరికొత్త దోపిడీకి తెరలేపాయి. ఓటరు కార్డు ముద్రణకు రూ.25కు బదులు ఏకంగా రూ.100కు పైగా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ మీసేవా కేంద్రాలే అందుకు ఊతమిస్తుండటం గమనార్హం. ‘మీసేవ’ నిర్వహణ బాధ్యతలు చూసుకునే ఏజెన్సీ.. ఓటరు కార్డులతో తక్కువ ఆదాయం వస్తున్నందున వాటిని నిలిపేసిందనే విమర్శలొస్తున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో నిత్యం ఓటరు కార్డుల తొలగింపు, కొత్తగా చేరికలు, చనిపోయినవారి పేర్లు తీసేయడం వంటి ప్రక్రియలు ఉంటాయి. 24 నియోజకవర్గాల పరిధిలో ప్రతి నెలా సగటున 10వేల మంది కొత్తగా గుర్తింపు పొందుతుంటారని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులను ఆమోదించడమే తమ పని అని, కార్డులు ముద్రించి ఇచ్చే ఏర్పాట్లు జీహెచ్‌ఎంసీలో లేవన్నారు. ఓటర్లు దగ్గర్లోని మీ సేవా కేంద్రాలను సంప్రదించి పొందవచ్చంటున్నారు. మెజార్టీ ప్రభుత్వ మీసేవా కేంద్రాలు వీటి జారీ నిలిపివేసినట్లు సమాధానం ఇస్తున్నాయి. ప్రింటర్లలో కార్డుల ముద్రణకు ఉపయోగించే రిబ్బన్లు, రంగులు సరఫరా కావట్లేదంటున్నారు.

లోపాయికారీ ఒప్పందంతో..
‘‘ప్రభుత్వ ధరల ప్రకారం రంగుల ఓటరు కార్డుకు రూ.25, నలుపు తెలుపు కార్డుకు రూ.10 తీసుకోవాలి. రంగుల కార్డును ముద్రిస్తే ఖర్చు పోగా నిర్వహణదారుకు రూ.12 మిగులుతుంది. ఆధార్‌కార్డు, ఇతర రకాల సేవలకు ఆదాయం మరింత ఎక్కువ. దాంతో ఓటరు కార్డు సేవలు ఆగాయి.’’ అని కూకట్‌పల్లిలోని ఓ కేంద్రం అధికారి ‘ఈనాడు’తో తెలిపారు. ప్రైవేటు మీసేవా కేంద్రాలతో ఉన్న లోపాయికారి ఒప్పందం సైతం అందుకు కారణమై ఉండొచ్చన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో సేవలు ఆగిపోతే.. ప్రైవేటుకు ఆదాయం పెరుగుతుందని, వాస్తవ రుసుముకు పదింతలు ఎక్కువ వసూలు చేస్తున్నారని వివరించారు.

రోజూ ఫిర్యాదులొస్తున్నాయన్న ఎన్నికల విభాగం
ఓటరు దరఖాస్తులు ఆమోదించిన మీరే కార్డులు ఇప్పించాలని, మీసేవా కేంద్రాల్లో ఇవ్వట్లేదని నిత్యం పదుల కొద్దీ ఫిర్యాదులు తమకు వస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం పేర్కొంది. ఎన్నికల సమయంలో మాత్రమే బల్దియా తరఫున నూతన ఓటర్లకు గుర్తింపుకార్డులు మంజూరు చేస్తామని, మిగతా సమయంలో మీసేవా కేంద్రాలను సంప్రదించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో ఓటరు కార్డులు ఇవ్వట్లేదని గుర్తుచేసింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.