నీటిని ఇంకిద్దాం.. భరోసాగా జీవిద్దాం - Hyderabad - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

నీటిని ఇంకిద్దాం.. భరోసాగా జీవిద్దాం

నగర పరిస్థితులకు ఇంజెక్షన్‌వెల్స్‌ శ్రేయస్కరం
నిర్మాణానికి వానాకాలమే సరైన సమయం
ఇంకుడుగుంతలతో పోల్చితే ఎంతో ప్రయోజనం
ఈనాడు, హైదరాబాద్‌

ఏటా నగరంలో నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. పెద్దఎత్తున భూగర్భజలాలు తోడేస్తున్నా.. అందుకు తగ్గట్టుగా ఇంకించడం లేదు. వేసవి వస్తే బోర్లు ఎండిపోయి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. వానాకాలంలో జలసంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి వాననీటిని ఇంకించే చర్యలు చేపడితే కొన్నేళ్లపాటు ఇబ్బందుల్లేకుండా జీవించవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ఇంజెక్షన్‌ వెల్స్‌ నిర్మాణం ద్వారా అపార్టుమెంట్లు, ఇళ్లలో నీటి ఇక్కట్లు రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. నగరంలో పరిస్థితుల దృష్ట్యా నీటిని ఇంకించేందుకు ఇంకుడుగుంతల కంటే ఇంజెక్షన్‌ వెల్స్‌ ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకుడుగుంతలు ఉన్నప్పటికీ చాలా ఇళ్లలో బోర్లు ఎండిపోతున్నాయి. వాటితో నీరు పూర్తిస్థాయిలో ఇంకకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అదీగాక హైదరాబాద్‌ దక్కన్‌ పీఠభూమి ప్రాంతం. రాతినేలలు ఎక్కువగా ఉన్నాయి. కాంక్రీట్‌ జంగిల్‌గా మారడంతో స్థలాల కొరత తీవ్రంగా ఉంది. ఈ దృష్ట్యా ఇంకుడుగుంతల్లో నీరు ఇంకితే తక్కువగా పరిమాణంలో ఉంటుంది. అందులో నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకుడుగుంతలకు బదులుగా ఇంజెక్షన్‌వెల్స్‌ను తవ్వించుకుంటేనే ఎంతో ప్రయోజనం ఉంటుందని జేఎన్‌టీయూ వాటర్‌ రిసోర్సెస్‌ హెడ్‌ ఎం.వి.ఎస్‌.ఎస్‌.గిరిధర్‌ వివరించారు. ఇంజెక్షన్‌వెల్‌ నిర్మాణానికి కొంత ఖర్చు అయినప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటి కొనుగోలు అవసరం ఉండదు. ఇంజెక్షన్‌వెల్‌ నిర్మాణం ఎలా.. ఇంకుడుగుంతలతో పోల్చితే ప్రయోజనం ఏంటి.. తదితర వివరాలపై ఆయన ‘ఈనాడు’కు వివరించారు.

ఇంజెక్షన్‌ వెల్‌ నిర్మాణం ఇలా..
ఇంజెక్షన్‌ వెల్స్‌ను రెండు రకాలుగా నిర్మించుకునే వీలుంది. విస్తీర్ణం ఆధారంగా ఇంటి ప్రాంగణంలో బోరు పక్కనే చిన్నపాటి స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు 200 చ.గజాల స్థలంలో ఇల్లు ఉన్న బోర్‌వెల్‌ చట్టూ రెండు అడుగుల దూరంలో ఇంజెక్షన్‌ వెల్‌ నిర్మించుకోవాలి. ఇందుకు ముందుగా రెండు అడుగుల చదరపు విస్తీర్ణంలో ఆరు అడుగుల లోతుకు గుంత తవ్వుకోవాలి. వంద అడుగుల లోతుకు బోర్‌వెల్‌ వేసుకోవాలి. తేలికపాటి నేల ఉన్నంత వరకు కేసింగ్‌ వేయించుకుంటే మంచిది. కేసింగ్‌ పైపునకు నీరు ఇంకేందుకు చిన్నపాటి రంధ్రాలు చేసుకోవాలి. బోర్‌వెల్‌ చుట్టూ ప్రత్యేకంగా సైడ్‌వాల్‌ నిర్మించుకోవాలి. గుంతను నాలుగు భాగాలుగా విభజించుకుని రంధ్రాలు చేసిన పైపు చుట్టూ రెండు పొర (లేయర్‌)లలో పెద్ద, చిన్న పరిమాణంలో ఉండే కంకరను వేసుకోవాలి. ఆపై రెండు అడుగులు ఎత్తుకు ఇసుకను వేయాలి. దానిపై దోమతెర(నెట్‌) కప్పాలి. భవనంపై పడే వర్షపు నీటిని గొట్టాల ద్వారా ఆ ఇంజెక్షన్‌ వెల్‌ గుంతలోకి చేరేలా చేసుకోవాలి. దీనివల్ల గుంతలోకి చేరిన నీరు నేరుగా కేసింగ్‌ పైపునకు ఉన్న రంధ్రాల ద్వారా వంద అడుగుల లోతులో ఇంకే వీలుంటుంది. అలాగే అధికంగా చేరిన నీరు వెళ్లేందుకు గుంతకు మరోవైపు మార్గం ఉంటే మంచిది. కొత్తగా బోర్‌ వేసుకునేవారు నేరుగా అదే బోర్‌వెల్‌ను ఇంజెక్షన్‌ వెల్‌ కింద నిర్మించుకోవచ్చు.
* అలాగే ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న వాణిజ్య సముదాయాలు, ఇతరత్రా భవనాలు ఉన్న ప్రాంతంలో 5×5×8 అడుగుల కొలతల ప్రకారం గుంత తవ్వుకుని ఇంజెక్షన్‌ వెల్‌ నిర్మించుకోవచ్చు. ఒకే ప్రాంతంలో రెండు లేదా మూడు ఇంజెక్షన్‌వెల్స్‌ను నిర్మించుకుంటే మొదటిది 100 అడుగులు, మరొకటి 150 అడుగులు, మూడోది 200 అడుగుల లోతులో వేయించుకోవాలి.

ప్రయోజనం ఎంత..?
వేసవి 3 నెలల్లో నెలకు 10 ట్యాంకర్లు కొనుగోలు చేస్తే దాదాపు రూ.30 వేలు ఖర్చయ్యే అవకాశం ఉంది. అదే ఇంజెక్షన్‌ వెల్‌ వేసుకుంటే అంతే ఖర్చు అవుతుంది. ఒక ఏడాదిలో ట్యాంకర్లకు పెట్టే ఖర్చు ఇంజెక్షన్‌ వెల్‌ నిర్మించుకోవడం జీవితాంతం నీటి ఇక్కట్లు లేకుండా జీవించొచ్చు.

నగదు ఆదా ఇలా..
హైదరాబాద్‌లో సగటున 890 మి.మీ. వర్షపాతం నమోదవుతుందని అంచనా. దీన్నిబట్టి ఏటా ఇంట్లో నిర్మించుకున్న ఇంజెక్షన్‌ వెల్‌ ద్వారా 1.78 లక్షల లీటర్ల నీటిని భూమిలోకి ఇంకించే అవకాశం ఉంది. దానివల్ల బోరు ఎప్పటికీ ఎండిపోదు. లీటరు నీటికి రూ.1 చొప్పున లెక్క కట్టినా ఏడాదికి రూ.1.78 లక్షలను పొదుపు చేసుకున్నట్లు అవుతుంది.

ఇంకుడుగుంతలతో పోల్చితే..
ఇంకుడుగుంతలతో పోల్చి చూసినప్పుడు ఇంజెక్షన్‌వెల్స్‌ ఎంతో ప్రయోజనకరం. ఇంకుడుగుంతల ద్వారా నీరు వెంటనే భూగర్భంలోకి ఇంకదు. భారీ వర్షం కురిసినప్పుడు నీరు నిలిచి నెమ్మదిగా ఇంకుతుంది. మధ్యలో రాతి నేల తగిలితే ఇంకడం కష్టం. ఏటా పూడిక పేరుకుపోయి దాన్ని తీయకపోతే నీరు ఇంకకుండా నిల్వ ఉంటుంది. అదే ఇంజెక్షన్‌వెల్‌లో ఈ తరహా ఇబ్బందులుండవు. నేరుగా భూగర్భంలో నీరు ఇంకేలా చేయడం ద్వారా నీటి నిల్వలు పెరుగుతాయి. ఏటా నిర్వహణ భారం కూడా పెద్దగా ఉండదు. వంద అడుగుల లోతులో నీరు ఇంకుతుంది కనుక బోరు వెంటనే రీఛార్జి అవ్వడమే కాక ఏడాదిపాటు నీటి లభ్యత ఉంటుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.