విసిరేద్దాం.. విత్తన బంతులు - Hyderabad - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

విసిరేద్దాం.. విత్తన బంతులు

నగరం చుట్టూ పచ్చదనం పెంచేద్దాం
విద్యార్థులు, సంస్థల్లో పర్యావరణ స్ఫూర్తి

అటవీశాఖ గణాంకాల మేరకు..
నగర విస్తీర్ణంలో ఉండాల్సిన పచ్చదనం 16శాతం
ప్రస్తుతం ఉన్నది 5శాతం
మొక్కలు నాటడంలో ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ లక్ష్యం 3కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌

నగరం చుట్టూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. వాలంటీర్లతో వినూత్న రీతిలో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్నాయి. వాటిలో అందర్నీ ఆలోచింపచేస్తున్నది విత్తన బంతులు. మాతా అమృతానందమయి భక్తులు అర లక్ష విత్తన బంతులను నగర శివార్లలో విసిరారు. ఐక్యరాజ్యసమితి లక్ష కోట్ల వృక్షాలను నాటాలనే ప్రచారంలో భాగంగా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటేందుకు  శ్రీకారం చుట్టింది. వీరి స్ఫూర్తిని అందుకుని మిగతావారు విత్తన బంతులను మన నగరం అంతటా వెదజల్లవచ్చు అంటున్నారు పర్యావరణవేత్తలు.

నగరంలో అభివృద్ధి పేరుతో ఏటా పెద్ద సంఖ్యలో చెట్లు కనుమరుగు అవుతున్నాయి. ఆటవీ శాఖ గణాంకాలు, యూఎన్‌ సంస్థల నివేదికలు పచ్చదనం విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా హరితహారం చేపట్టింది. నగరపాలక సంస్థతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటుతున్నాయి. విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేయించి వారితోనే ఖాళీ ప్రదేశాల్లో విసిరేయించారు. వర్షాలతో విత్తనాలు మొలకెత్తి.. మొక్కలుగా మారి వృక్షాలవుతాయి. ఫలితంగా నగరంలో కాలుష్యం స్థాయి తగ్గేందుకు దోహదం చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో విస్తారంగా వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరగడంతో పాటు విపరీత వాతావరణ పరిస్థితుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని మాతా అమృతానందమయి మఠం భక్తులు నమ్ముతున్నారు.

చేతులు కలిపి.. సిద్ధం చేసి..
నగరం చుట్టుపక్కల రక్షిత అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా పచ్చదనాన్ని నింపాలనే లక్ష్యంతో విత్తన బంతులను కొన్నిరోజుల పాటు శ్రమించి తయారు చేయించారు. మఠానికి ‘ఆయుధ్‌’ పేరిట ఇంటర్నేషనల్‌ యూత్‌ మూవ్‌మెంట్‌ విభాగం ఉంది. ఇందులో భాగంగా సీఎంఆర్‌ సంస్థలు, ఆరోరా కళాశాల, అమృత విద్యాలయానికి చెందిన విద్యార్థులు విత్తన బంతులను చేయడంలో చేతులు కలిపారు. సారవంతమైన మట్టితో సేంద్రియ ఎరువును, ఆరోగ్యవంతమైన విత్తనాలను కలిపి బంతుల మాదిరి తయారు చేశారు. గత ఆదివారం 200 మందికి పైగా విద్యార్థులు, భక్తులు ఇబ్రహీంపట్నం సమీపంలోని రక్షిత అటవీ ప్రాంతంలో వీటిని ఉత్సాహంగా వెదజల్లారు.

మీ పిల్లలతోనూ చేయించవచ్చు
ః ఇంట్లో అందరూ ప్రతిరోజూ పలురకాల పండ్లు తింటుంటారు. కొన్ని ఫలాల్లో గింజలు ఉంటాయి. తిన్నాక గింజలు పడేయకుండా భద్రపర్చి పిల్లలతో విత్తన బంతులు తయారు చేయించాలి. వారాంతాల్లో శివారు ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లి పిల్లలతో బస్సులోంచి, కారులోంచి రహదారి పక్కకు విసరమని చెప్పాలి. వీటిలో కొన్నైనా మొక్కలుగా మొలుస్తాయి.
ః నగరంలో ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నా అక్కడ వీటిని విసరవచ్చు.

ఇది అనుకూల సమయం
-బి.ఆర్‌.రఘునాథ్‌, సమన్వయకర్త, మాతా అమృతానందమయి మఠం
రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న ప్రస్తుత సమయంలో విత్తన బంతులు మొక్కలుగా మొలకెత్తడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా పచ్చదనం పరుచుకుంటుంది. పెరిగిన వృక్షాలతో నీటిని, మట్టిని సంరక్షించుకుని వన్యప్రాణుల మనుగడకు తోడ్పడవచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.