సేవల్లో లోపమా? పరిహారం చెల్లించాల్సిందే! - Hyderabad - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

సేవల్లో లోపమా? పరిహారం చెల్లించాల్సిందే!

పలు తీర్పులను వెలువరించిన నగర ఫోరంలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వినియోగదారుడికి అందించాల్సిన సేవల్లో జాప్యం కలిగించినా, అన్యాయమైన నిబంధనలతో ఇబ్బందులకు గురిచేసినా పరిహారం చెల్లించాల్సిందే అంటూ వినియోగదారుల ఫోరం-1, ఫోరం-3 పలు కేసుల్లో తీర్పుల ద్వారా స్పష్టం చేశాయి.

బిల్డర్‌కు రూ.50,000 జరిమానా
ఒప్పందం ప్రకారం ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయకుండా వినియోగదారును ఇబ్బంది పెట్టినందుకు నవీన్‌ అనే బిల్డర్‌కు నగర వినియోగదారుల ఫోరం-3 రూ.50,000 జరిమానా విధించింది. వారాసిగూడకు చెందిన ఫిర్యాదుదారు బి.జే.శోభ రైల్వే ఉద్యోగి. ప్రతివాది అయిన బిల్డర్‌ నవీన్‌ మాటలు నమ్మి సికింద్రాబాద్‌లోని మైలార్‌గడ్డలో అతను నిర్మించే ఫ్లాట్‌ను రూ.27,00,000 కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.14,00,000 చెల్లించింది. ఇందుకుగాను తాను నిర్మించే భవనంలో మూడో అంతస్తులోని 301 ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తానని నవీన్‌ హామీ ఇచ్చారు. దీంతో రుణం కోసం బ్యాంకును సంప్రదించగా జీప్లస్‌ టూ భవన నిర్మాణానికి మాత్రమే ఆ ప్రదేశంలో అనుమతి ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో ఖంగుతిన్న ఫిర్యాదుదారు తన డబ్బులు తిరిగి ఇవ్వాలనడంతో ప్రతివాది రూ.2,00,000 చెల్లించారు. అడ్వాన్స్‌ డబ్బులు తిరిగి ఇప్పించాలని, మానసిక వేధనకు గురిచేసినందుకు  పరిహారం ఇప్పించాలని ఫిర్యాదుదారు నగర వినియోగదారుల ఫోరం-3ను ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న వినియోగదారుల ఫోరం-3 అధ్యక్షులు నిమ్మనారాయణ, సభ్యులు మీనా రామనాథన్‌తో కూడిన బెంచ్‌ ప్రతివాదికి రూ.50,000 జరిమానా విధించింది. ఫిర్యాదుదారు చెల్లించిన రూ.14లక్షలు తిరిగి ఇవ్వడంతోపాటు ఖర్చులకు రూ.10,000 ముప్పై రోజుల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది.

సర్వీస్‌ టాక్స్‌ ఎలా వసూలు చేస్తారు?
న్యాయమైన సేవలు అందించని కారణంగా బాకారం ప్రాంతానికి చెందిన వైద్యురాలు జి.అవంతి, సిద్ధంశెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. బాకారంలోని జవహర్‌నగర్‌లో సిద్ధంశెట్టి హిమసాయి హైట్స్‌ పేరుతో సదరు కంపెనీ 160 నివాస గృహాలను నిర్మించింది. తనకు ఓ ఫ్లాట్‌ కావాలంటూ ఫిర్యాదుదారు కంపెనీని సంప్రదించి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న 17వ నివాసాన్ని రూ.39 లక్షలకు కొనుగోలు చేసేందుకు రూ.9లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో రూ.30లక్షలు ఇస్తానని  తెలిపారు. అయితే ఒక నెల తర్వాత సర్వీస్‌ టాక్స్‌ కింద రూ.1,20,510 చెల్లించాలని ప్రతినిధులు  డిమాండ్‌ చేశారు. సర్వీస్‌ టాక్స్‌ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పడంతో ఫిర్యాదుదారు ఆ డబ్బును చెల్లించారు. అనంతరం ఆర్‌టీఐ ద్వారా అర్జీ పెట్టుకోవడంతో ఆ ఫ్లాట్లకు సర్వీస్‌ టాక్స్‌ చెల్లించే నిబంధన   లేదని తెలిసింది. దీంతో సిద్ధంశెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదుదారు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన ఫోరం-1 అధ్యక్షులు పి.విజేందర్‌, సభ్యులు డి.నిర్మలతో కూడిన బెంచ్‌ వసూలు చేసిన రూ.1,20,510 తిరిగి ఫిర్యాదుదారుడికి చెల్లించడంతోపాటు పరిహారంగా రూ.50,000, ఇతర ఖర్చులకు రూ.10,000 ఇవ్వాలని ప్రతివాద కంపెనీని ఆదేశించింది.

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి జరిమానా
ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు నేషనల్‌ ఇన్సూరెన్స్‌ బీమా కంపెనీకి వినియోగదారుల ఫోరం-1 జరిమానా విధించింది. రామంతాపూర్‌కు చెందిన ఫిర్యాదుదారు టి.వీరేశం వివరాల ప్రకారం తనకు, తన భార్యకు వర్తించేలా రూ.2,00,000 క్లెయిమ్‌ పొందేలా ఆరోగ్య బీమా తీసుకున్నారు. ఏడు సంవత్సరాలపాటు ప్రీమియం చెల్లిస్తే నో క్లెయిమ్‌ బోనస్‌ తీసుకోవచ్చని నిబంధనల్లో ఉంది. పాలసీ తీసుకున్న ఏడేళ్ల తర్వాత ఫిర్యాదుదారు భార్య అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్సలకు రూ.2,68,991 ఖర్చు అయింది. అయితే ఇందులో రూ.రెండు లక్షలు బీమాలో భాగంగా కంపెనీ చెల్లించింది. బోనస్‌గా ఇవ్వాల్సిన రూ.50,000 చెల్లించకపోవడంతో ఫిర్యాదుదారుడు ఫోరాన్ని ఆశ్రయించారు. ఫిర్యాదుదారు ఆరోపణలను ఖండిస్తున్నట్లు ప్రతివాద కంపెనీ ఫోరంకు రాతపూర్వక వివరణ అందించింది. ఇరువురి వాదనలు విన్న ఫోరం-1 అధ్యక్షులు పి.విజేందర్‌, సభ్యులు డి.నిర్మలతో కూడిన బెంచ్‌ ఫిర్యాదుదారుడికి రూ.32,250 చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.15,000, రూ.5,000 ఖర్చులకు చెల్లించాలని నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని ఆదేశించింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.