చేపకు కొత్త వల - Kamareddy - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

చేపకు కొత్త వల

  పెన్‌కల్చర్‌తో చేపపిల్లల పెంపకం
పోచారం జలాశయంలో ఏర్పాటు
 రాష్ట్రంలో తొలిసారిగా అమలు
న్యూస్‌టుడే, నాగిరెడ్డిపేట

ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన చేప విత్తును వదిలి పెంచేవారు. వాతావరణ మార్పుల కారణంగా అందులో సగం వరకు చనిపోతున్న పరిస్థితి. ఇకపై దీన్ని నివారించేందుకు  సర్కారు అడుగులు వేస్తోంది. జీరోసైజ్‌ చేపపిల్లలను తీసుకొచ్చి పెన్‌కల్చర్‌ విధానంలో సంరక్షించి వంద శాతం బతికిలా చర్యలకు శ్రీకారం చుడుతోంది.
పెన్‌ కల్చర్‌ విధానంలో చేపపిల్లలు పెంచేందుకు రాష్ట్రంలోని అయిదు మధ్యతరహా జలాశయాలను ఎంపిక చేశారు. ఇందులో కామారెడ్డి జిల్లా పోచారం జలాశయాన్ని ఎంపిక చేశారు. ఒక్కోదాంట్లో 8-15 లక్షల చేప పిల్లలను (35మి.మీ. నుంచి 40మి.మీ.) వదులుతున్నారు. పోచారంలో 8 లక్షలకు ఇప్పటికే 6.5 లక్షల పిల్లలను వదిలారు.

40 రోజుల పాటు సంరక్షణ
ఈ విధానం ద్వారా పెంచే చేప పిల్లలకు మత్స్యశాఖ అధికారులు ప్రతిరోజు తవుడును అందిస్తున్నారు. వాటిని 40 రోజుల పాటు సంరక్షించిన తర్వాత ప్రాజెక్టులోకి నేరుగా వదులుతారు.

నష్టం తగ్గుతుంది
ప్రస్తుతం జలాశయాల్లో రూ.కోట్లు వెచ్చించి చేప విత్తు వేస్తున్నారు. వీటిని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తుండటంతో..రవాణా సమయంలో, ప్రాజెక్టుల్లో వదిలిన అనంతరం వాతావరణంలో మార్పుల కారణంగా భారీ ఎత్తున చనిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెన్‌ కల్చర్‌ విధానంతో ఈ నష్టాన్ని అరికట్టొచ్చని పేర్కొంటున్నారు.

ఖర్చు తగ్గుతుంది
చేప పిల్లలను కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తుండటంతో ఖర్చులు పెరుగుతున్నాయి. ఉత్పత్తిదారుల వద్ద పెద్ద చేప పిల్లలు లక్షకు రూ.1.18 లక్షలు, చిన్నవాటికి రూ.55 వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా ఇక్కడే పెంచితే కొనుగోలు, రవాణా భారం తగ్గనుంది.

తొలిసారిగా ఏర్పాటు
- శ్రీనివాస్‌, మత్స్యశాఖ ఏడీ, మెదక్‌
పైలెట్‌ ప్రాజెక్టు కింద పోచారం జలాశయంలో పెన్‌కల్చర్‌ విధానాన్ని ఏర్పాటు చేశాం. 35 మి.మీ. పరిమాణం ఉన్న చేప పిల్లలను తీసుకొచ్చి పెంచుతున్నాం. ఇది విజయవంతం అయితే..వచ్చే ఏడాది అన్ని జలాశయాలకు విస్తరిస్తాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.