ఓ కంట కన్నీరు మున్నీరు  - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

ఓ కంట కన్నీరు మున్నీరు 

● జిల్లాలో భిన్న పరిస్థితి

● పశ్చిమ ప్రాంతంలో కరవు ఛాయలు

● తడారుతున్న గొంతులు, ఎండుతున్న పంటలు

● నంద్యాల వైపు పొంగుతున్న వాగులు

● కుందూ పరివాహక ప్రాంతాల్లో పొలాల్లోకి వరద నీరు

కోసిగి మండలం పల్లెపాడులో వర్షాలు లేక ఎండిపోతున్న వరి పైరు

జిల్లాలో వింత పరిస్థితి నెలకొంది. ఓవైపు నీళ్లు లేక సాగు, తాగుకు అల్లాడుతుంటే... మరోవైపు వాగులు, వంకలు పొంగి పంట పొలాలు మునిగి పోతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో అన్నదాతలు పంటలు కాపాడుకోలేక అప్పుల పాలవుతుంటే.. నంద్యాల డివిజన్‌లో వరద నీరు పొలాల పైకి పోటెత్తి నష్టం మిగుల్చుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వచ్చి చేరుతున్న వరదకు, జిల్లాలో కురుస్తున్న వర్షాలు తోడై అతివృష్టి-అనావృష్టి వంటి భిన్న వాతావరణం నెలకొంది.

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి శ్రీశైలం వెనుక జలాలను ఎస్సార్బీసీ, తెలుగు గంగ, నిప్పుల వాగుకు నీళ్లు వదులుతున్నారు. ఈ సమయంలో నిప్పుల వాగు నుంచి వచ్చే నీళ్లు కుందూలో కలుస్తున్నాయి. ఈ నీరు కుందూ ద్వారా నెల్లూరుకు వెళతాయి. కట్టల సామర్థ్యం సరిగా లేకున్నా పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో నీళ్లు వదలడంతో సమస్య తలెత్తుతోంది. శ్రీశైలం వెనుక జలాలను తొలుత 28 వేల క్యూసెక్కులు వదిలిన అధికారులు ఒక్కోసారి పది గేట్ల ద్వారా పూర్తి సామర్థ్యం మేర 44 వేల క్యూసెక్కులు వదిలారు. ఈ వరద నీటికి, ప్రస్తుతం కురుస్తున్న వాన నీరు తోడై వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎస్సార్బీసీ పరిధిలో ఇంకా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది 12 వేల క్యూసెక్కుల నీటిని వదలగా, ఈ ఏడాది 18 వేల క్యూసెక్కుల వరకు వదులుతున్నట్లు సమాచారం. 14 కి.మీ. వద్ద కేసీ కెనాల్‌ సూపర్‌ ప్యాసేజీ మీద నీళ్లు పారుతున్నాయి. కేసీలో నీళ్లు పొంగి గడివేముల పరిధిలో పెసరవాయి వద్ద గండ్లు పడ్డాయి. ఫలితంగా వంద ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. ఇలా రెండు సార్లు గండ్లు పడటం గమనార్హం.

జలదిగ్బంధం

కుందూ నది వెంట బండిఆత్మకూరు, నంద్యాల, పాణ్యం, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతం ఇరువైపులా వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గ్రామాలకు సైతం రాకపోకలు స్తంభిస్తున్నాయి. పాణ్యం మండలం పరిధిలో అనుపూరు గ్రామానికి వెళ్లలేని దుస్థితి నెలకొంది. దళితవాడ నుంచి పీవీనగర్‌ వెళ్లే రహదారిలో వంతెన పైగా నీళ్లు పారుతున్నాయి. పురపాలక ట్రాక్టర్‌ సైతం నీట మునిగింది. బైటిపేట, దళితవాడలో కొన్ని ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. ఉయ్యాలవాడ పరిధిలో జలదిగ్బంధంలో ఒంటెద్దుపల్లె, కాకరవాడ, బోడెమ్మనూరు చిక్కుకున్నాయి. అల్లూరు, ఎస్‌.కొత్తపల్లి, మాయలూరు గ్రామాల్లో వరి పంట నీట మునగగా, ఆర్‌.జమ్మలదిన్నె, కాకరవాడ గ్రామాల్లో మినుము పంట నీట మునిగాయి. చాగలమర్రి పరిధిలో కుందూ ఉద్ధృతితో రాజోలి వద్ద పంటలు నీట మునగగా, తెలుగు గంగ నీరు, వర్షం నీరు కలిసి కేపీ తాండా, పెద్దవంగలి, చింతలచెరువు గ్రామాల్లో వంద ఎకరాలు పైగా నీట మునిగాయి. కలగుట్లపల్లె వక్కిలేరు వాగులో గురువారం సాయంత్రం సుధాకర్‌రెడ్డి అనే రైతు వాగులో ప్రమాదవశాత్తూ గల్లంతవ్వగా ఇంకా ఆచూకీ దొరకలేదు.

నీటి నిల్వకు అవకాశం లేకనే....

జిల్లాలో కోడుమూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాలకు చుక్కెదురవుతోంది. నీటి నిల్వపై ముందు చూపులేకనే పశ్చిమ ప్రాంత రైతులు, ప్రజలు ఏటేటా ఇబ్బందులు పడుతున్నారు. 20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా గుండ్రేవుల ప్రాజెక్టుకు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఎట్టకేలకు గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు రూ.2,983 కోట్లతో అనుమతి ఇచ్చింది. కొత్త ప్రభుత్వం దీనిని మళ్లీ రద్దు చేసింది. పశ్చిమ ప్రాంతం మొత్తం కేవలం తుంగభద్రపై ఆధారపడాల్సి వస్తోంది. ఎల్లెల్సీ కింద ఖరీఫ్‌, రబీ కలిపి 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర ప్రవాహాన్ని నీటి నిల్వ చేసుకునే అవకాశం జిల్లాకు లేక ఎట్టకేలకు సుంకేసులకు చేరుతున్న నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇక ఇటు కృష్ణా నీరు హంద్రీనీవాలోకి వెళుతున్నా నీటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. కృష్ణగిరి (0.5 టీఎంసీ), పందికోన(1.1 టీఎంసీ) మాత్రమే నింపుకొనేందుకు జలాశయాలు నిర్మించారు. పందికోనలో 0.75 టీఎంసీలు నింపితే జలాశయానికి ముప్పు పొంచి ఉంది. నీటినే నింపలేకపోతున్నారు. పందికోన కింద 65 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని డిజైన్‌లో ఉన్నా అందించిన పాపానే పోలేదు.

వర్షపాతం ఇలా....

జిల్లాలో గత నాలుగు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. విచిత్రమేమంటే పశ్చిమ ప్రాంతంలో లోటు వర్షపాతం నమోదవ్వగా, నంద్యాల డివిజన్‌లో అత్యధికంగా, కర్నూలు డివిజన్‌లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఆగస్టులో 135 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, ఈ నాలుగు రోజుల్లోనే కుండపోత వర్షం కురిసింది. మరోవైపు పశ్చిమ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదైంది. వెలుగోడులో బుధవారం ఏకంగా 12.9 సెంటీమీటర్ల వర్షం కురవగా, గురువారం అత్యధికంగా మళ్లీ 7.7 సెం.మీ. కురిసింది. గడివేములలో 5.9 సెం.మీ., ఆళ్లగడ్డలో 5 సెం.మీ. వర్షం కురిసింది. గురువారం జిల్లా సగటున 31.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాలన్నీ కుందూకు దగ్గరగా ఉండటంతో వరద నీటికి, వర్షం నీరు తోడై పొంగిపొర్లుతోంది.

బండిఆత్మకూరు మండలం ఈర్నపాడులో నీట మునిగిన పంట పొలాలు

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.