మట్టి విగ్రహాలపై ప్రచారం అవసరం - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

మట్టి విగ్రహాలపై ప్రచారం అవసరం

● అందరి సహకారంతో గణేశ్‌ ఉత్సవాలను నిర్వహిద్దాం

● కలెక్టర్‌ వీరపాండియన్‌


పోస్టర్లను విడుదల చేస్తున్న కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పర్యావరణ హిత వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని, ప్లాస్టిక్‌, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ వాడకాన్ని గణనీయంగా తగ్గించి మట్టి వినాయక విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేయించేందుకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. కర్నూలు నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా వచ్చేనెల 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గణేశ్‌ మహోత్సవ కమిటీ సమన్వయ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఆయనతోపాటు ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, ట్రైనీ కలెక్టర్‌ విధే ఖరే, డీఆర్వో వెంకటేశం, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మునిప్రసాద్‌, ఆర్డీవోలు బి.కె.వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, బాల గణేశయ్య, రహదారులు, భవనాలశాఖ అధికారి జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను భక్తిభావంతో విజయవంతంగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, నగరపాలక, నీటిపారుదల శాఖ, గణేశ్‌ మహోత్సవ కమిటీ సమన్వయంతో జాయింట్‌ కంట్రోల్‌ రూంను కర్నూలులో ఏర్పాటుచేసి వినాయక విగ్రహాల మండపాలకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని ఆర్డీవోలు, డీఎస్పీలు, ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జన సమయంలో, మండపాల్లో డీజీ మ్యూజిక్‌, క్లబ్‌ డ్యాన్సులు లేకుండా భక్తిభావంతో జరిపేలా సహకరించాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల 10న కేసీ కెనాల్‌లోని వినాయక ఘాట్‌ వద్ద నిర్వహించనున్న నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఇబ్బందులు లేకుండా చూడాలని నీటిపారుదలశాఖ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తికి సూచించారు. అగ్నిమాపకశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని వినాయక మండపాలకు నిబంధనల ప్రకారం ఎన్‌వోసీలు ఇవ్వాలని ఆ శాఖ అధికారి శ్రీనివాసులరెడ్డికి సూచించారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా అందించాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మునిప్రసాద్‌ను ఆదేశించారు. ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేలా ఉత్సవ సమితి సభ్యులు, అధికారులు కృషి చేయాలన్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలన్నారు. సమావేశం అనంతరం కాలుష్య నియంత్రణ మండలి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్‌, ఎస్పీ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ ఏడాది కాలుష్య నియంత్రణ మండలి ద్వారా 6 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు ఈఈ మునిప్రసాద్‌ కలెక్టర్‌కు వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.