భరించలేని కడుపు కోత - Kurnool - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

భరించలేని కడుపు కోత

కుట్ల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న బాలింతలు ●

● ఇదీ నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని పరిస్థితి


నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు

గర్భిణికి ప్రసవ సమయంలో నొప్పులు సర్వసాధారణం. అయితే బిడ్డ అడ్డం తిరిగినప్పుడు వైద్యులు పరీక్షించి తప్పని పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేసి ప్రసవం చేస్తారు. శస్త్రచికిత్స అనంతరం బాలింతలకు ‘కుట్లు’ వేస్తారు. ఈ కుట్లు నయం కావడానికి ఒక వారం రోజుల సమయం పడుతుంది. కానీ నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మాత్రం 10 నుంచి 15 రోజులు గడుస్తున్నప్పటికీ నయం కాకపోవడంతో బాలింతలకు అవస్థలు తప్పడం లేదు. దాంతో ఆ బాలింతలకు మళ్లీ కుట్లు వేస్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం వేసిన కుట్లు పగిలిపోయి ఇన్ఫెక్షన్‌ వచ్చి బాలింతలు ఆసుపత్రిలోనే ఉంటున్నారు.

- న్యూస్‌టుడే, నంద్యాల పాతపట్టణం

నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చి బిడ్డతో ఇంటికి వెళ్లాలంటే కొన్నాళ్లు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. శస్త్రచికిత్స తర్వాత బాలింతలకు వేసే కుట్లు సరిగా వేయకపోవడమా.. పరిశుభ్రత పాటించకపోవడమా.. కారణమేదైనా బాలింతలకు ఇన్ఫెక్షన్‌ సోకుతోంది. ఏదేమైనా బాలింతలకు వారంలో నయం కావాల్సిన కుట్లు పగిలిపోవడంతో 15 రోజులకుపైగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో నెలకు 350 నుంచి 400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. అందులో 170 నుంచి 200 వరకు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. వారిలో ప్రస్తుతం గత 15 రోజుల నుంచి 15 మందికిపైగా బాలింతలు వైద్యులు వేసిన కుట్లు పగిలి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. బిడ్డ పుట్టిందనే సంతోషం కంటే కుట్లు పగిలిన బాధే ఎక్కువగా ఉందని బాధితులు వాపోతున్నారు.

 

ఇన్ఫెక్షన్‌ సోకడానికి  కారణాలు

* కుట్లు సరిగా వేయకపోవడం

* వైద్యులు శస్త్రచికిత్స చేయడానికి వాడే దుస్తులు ఎక్కువగా లేకపోవడంతో వాడిన దుస్తులతోనే ఎక్కువ శస్త్రచికిత్సలు చేయాలి ●

* కత్తెరలు సరిగా వేడి చేయకపోవడం ●

* పడకలపై ఉండే దుప్పట్లు మార్చకపోవడం, శుభ్రంగా లేకపోవడం ●

* రోగులను చూడటానికి ఎక్కువ మంది రావడంతో వారి నుంచి బాలింతలకు బ్యాక్టీరియా సోకి ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉండటం

ఈమె పేరు రసూల్‌ బీ. 15 రోజుల క్రితం ప్రసవం కోసం వస్తే శస్త్రచికిత్స చేశారు. కుట్లు మానకపోవడంతో ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో ఆసుపత్రిలోనే ఉంటున్నారు. మళ్లీ కుట్లు వేస్తామని వైద్యులు చెప్పారు. ఆ కుట్లు ఎప్పుడు మానుతాయో, ఎప్పుడు ఇంటికెళ్తామోనని అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

13 రోజుల నుంచి ఆసుపత్రిలోనే ఉన్నాం

- మద్దమ్మ, కటివాయనకుంట

మా కూతురుకు శస్త్రచికిత్స చేశారు. కుట్లు మానలేదని ఇక్కడే ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో గత 13 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రిలోనే ఉంటున్నాం. గతంలో వారం రోజుల్లోనే ఇంటికి పంపించారు. ఇప్పుడు కుట్లు పగిలాయని చెబుతున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఉండాలో అర్థం కావడం లేదు.

 

కొంత మందికి సమస్య - డా.శిరీష, ఆర్‌ఎంవో

శస్త్రచికిత్స చేయించుకున్న వారికి 8 రోజుల్లో కుట్లు తొలగిస్తాం. కానీ కొందరికి ఇన్ఫెక్షన్‌ సోకడం వల్ల వారికి మరికొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని సూచిస్తాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే బాలింతలకు ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది ఉంటుందని, కుట్లు నయమయ్యేంత వరకు ఆసుపత్రిలోనే ఉంచుతున్నాం. ఎక్కువ మంది బాలింతల సహాయకులు రావడం వల్ల కూడా ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

 

రక్తహీనతతో వస్తున్నారు

- అనురాధ, హెచ్‌వోడీ, గైనకాలజీ

గర్భిణులు చాలా మంది రక్తహీనతతో వస్తున్నారు. వారికి శస్త్రచికిత్స చేసే సమయంలో రక్తం తక్కువ కావడంతో కుట్లు నయం కావడం లేదు. దీనికితోడు వారు సరైన ఆహారం తీసుకోకపోవడంతో రక్తం ఉత్పత్తి కాక కుట్లు మానడం లేదు. దీంతో రెండు, మూడు రోజలు మా పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.