నాణ్యతకు పాతర.. కాసుల జాతర - Kurnool - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

నాణ్యతకు పాతర.. కాసుల జాతర

వేసిన ఏడాదికే తేలిన కంకర ●

● గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రహదారుల పరిస్థితి దారుణం

గ్రామీణ ప్రాంతాల్లోని సీసీ రహదారుల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. గతంలో వేసిన వాటి పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాదిలోపే చాలా గ్రామాల్లో కంకర తేలి పగుళ్లిచ్చి దెబ్బతింటున్నాయి. నాలుగు కాలాలపాటు ఉండాల్సిన రహదారులు అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారుల కాసుల కక్కుర్తికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా జాతీయ ఉపాధి పథకం, పంచాయతీరాజ్‌, జడ్పీ నిధుల కింద వేసిన రహదారుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- న్యూస్‌టుడే, బేతంచర్ల, డోన్‌ గ్రామీణ ప్యాపిలి.

నిధుల వెచ్చింపు ఇలా..

డోన్‌ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండలంలో 2017-18లో డీఎంఎఫ్‌, ఎస్‌డీపీ, జడ్పీ, ఎంపీ, ఆర్థిక సంఘం నిధులతో రూ.24.12 కోట్లతో సీసీ రహదారుల పనులు చేయగా 2016-17లో ఎస్‌డీపీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, తదితర రూ.2.50 కోట్ల నిధులతో సీసీ రహదారుల అభివృద్ధి పనులు నిర్వహించారు. డోన్‌ మండలంలో 2015-16లో 14వ ఆర్థిక సంఘం, ఎస్‌డీఎఫ్‌ నిధులతో రూ.3.20 కోట్లతో, 2016-17లో ఎస్‌డీపీ, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.3.60 కోట్లతో, 2017-18లో డీఎంఎఫ్‌, ఎస్‌డీఎఫ్‌, ఎంపీ నిధులతో రూ.8.05కోట్లతో సీసీ రహదారుల పనులు చేపట్టారు. ప్యాపిలి మండలంలో గత మూడేళ్లలో రూ.3 కోట్ల వరకు నిధులతో గ్రామాల్లో సీసీ రహదారులు వేశారు. చాలా గ్రామాల్లో నాణ్యత పాటించకపోవటంతో అధ్వానంగా మారి నిధులు మట్టిపాలయ్యాయనే విమర్శలున్నాయి.

చిత్రంలో కనిపిస్తున్న సిమెంట్‌ రహదారి బేతంచెర్ల మండలం కొలుములపల్లెలో పంచాయతీ కార్యాలయానికి వెళ్లే రహదారి. ఏళ్లుగా గ్రామంలో సిమెంట్‌ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. పలు వీధుల్లో కాల్వలు, సిమెంట్‌ రహదారులను రూ.25 లక్షల ఉపాధి నిధులతో నిర్మించారు. ఏడాది గడవకముందే రహదారిపై కంకర తేలింది. గుత్తేదారు నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో రహదారి ఇలా తయారైందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

చిత్రంలో కనిపిస్తున్న సీసీరోడ్డు ప్యాపిలి పట్టణంలోనిది. శివాలయం నుంచి సినిమా థియేటర్‌కు వెళ్లే రహదారిని మూడు సంవత్సరాల కిందట సుమారు రూ.6 లక్షలతో వేశారు. రోడ్డు వేసిన ఏడాదికే కంకర తేలి అధ్వానంగా తయారైంది. పట్టణంలోని ప్రధాన వీధిలో ఈ ఏడాది జనవరిలో రూ.3 లక్షలతో వేసిన రోడ్డు నాణ్యత పాటించకపోవడంతో కంకర తేలి అధ్వానంగా తయారైంది.

డోన్‌ పట్టణం పిండిజిన్ను లైనులోని ఈ రహదారి సుమారు రూ.10 లక్షలతో వేశారు. కంకర తేలి నాణ్యతలేక ఏడాదికే దెబ్బతింది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో లక్షల నిధులు వృథాగా మారాయని కాలనీవాసులు పేర్కొంటున్నారు.

కొచ్చెర్వు గ్రామంలోని రామాలయం సమీపంలో రూ.5 లక్షలతో వేసిన సీసీరోడ్డు ఆరు నెలలకే కంకరతేలి పూర్తిగా అధ్వానంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో పగుళ్లు ఇచ్చాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇలాంటి రోడ్లు వేసినా లాభమేమిటని కేవలం గుత్తేదారుల జేబులు నింపేందుకేనని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రజాధనం దుర్వినియోగం

- ఈశ్వరయ్య, సీఐటీయూ

గ్రామాల్లో సీసీ రహదారులు వేసినా నాణ్యత లేకపోవటంతో రూ.కోట్లు దుర్వినియోగమయ్యాయి. చాలా గ్రామాల్లో కొన్నాళ్లకే కంకరతేలి అధ్వానంగా మారిపోయాయి. పదికాలాలపాటు ఉండాల్సిన సీసీ రహదారులు మరింత దారుణంగా తయారయ్యయి. అధికారులు గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలి.

 

విచారణ చేపట్టాలి

- రంగనాయుడు, సీపీఐ

సీసీ రహదారి పనులు విచ్చలవిడిగా నాసిరకంగా వేశారు. రూ.కోట్ల నిధులతో చేపట్టిన ఈ పనులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.

 

చర్యలు తీసుకుంటాం

- రామకృష్ణారెడ్డి, డీఈ

గతంలో వేసిన సీసీ రహదారులకు సంబంధించి నాణ్యత నియంత్రణ విభాగం అధికారులు పరిశీలించాకే బిల్లులు మంజూరు చేస్తాం. ఎక్కడైనా పూర్తిగా నాణ్యత లేకుండా ఉన్నట్లు మా దృష్టికి తీసుకువస్తే అలాంటి వాటిపై విచారించి చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.