ధర జిగేల్‌ గుండె దఢేల్‌ - Kurnool - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

ధర జిగేల్‌ గుండె దఢేల్‌

సామాన్యులకు అందనంత ఎత్తులో బంగారం.. వెండిదీ అదేబాట

● వెలవెలబోతున్న పసిడి దుకాణాలు

● అన్‌సీజన్‌ అయినా కొండెక్కిన ధరలు

ఆభరణాలు కొనుగోలు చేస్తున్న మహిళలు

పసిడి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి, పెద కుటుంబాలు బంగారాన్ని కొనలేని స్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. అన్‌సీజన్‌ అయినా కనకం ధర కొండెక్కడంతో దుకాణాలు వెలవెలబోతున్నాయి. ధర అమాంతంగా పెరిగిపోవడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. గత రెండు రోజుల్లోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.వెయ్యి పెరిగింది. వెండి సుమారు రూ.1400 వరకు పెరిగింది. త్వరలోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.40 వేలు దాటిపోయే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

- న్యూస్‌టుడే, కర్నూలు బుధవారపేట, ఆదోని మార్కెట్‌

 

జిల్లాలోని కర్నూలు నగరంతోపాటు నంద్యాల, ఆదోని పట్టణాల్లో రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయి. శ్రావణ మాసం, అక్షయ తృతీయ సందర్భాల్లో సుమారు రూ.20 కోట్ల వరకు లావాదేవీలు జరిగేవని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్‌సీజన్‌ అయినా బంగారం ధర పెరిగిపోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.40 వేల దగ్గరకు చేరింది. ఈ క్రమంలో వ్యాపారులు, ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఎక్కువగా కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటారు. ఒక్క నెలలో పుత్తడి వ్యాపారం సజావుగా సాగితే సుమారు రూ.300 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం.

 

* ప్రస్తుతం ఉన్న ధర రోజురోజుకు మార్పు చెందుతుండటంతో వ్యాపారులకు ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. వీరితోపాటు మహిళలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు శ్రద్ధ చూపుతున్నారు. కొద్ది మంది మాత్రం నమ్మకమైన పెట్టుబడిగా భావించి మదుపులో 10 శాతం పసిడి కొనుగోళ్లకే కేటాయిస్తున్నారు.

 

కర్నూలులో 200, నంద్యాలలో 150, ఆదోనిలో 100 దుకాణాలు ఉన్నాయి. దుకాణాల యజమానులు ప్రొద్దుటూరు మార్కెట్‌కు అనుగుణంగా వ్యాపారాలు సాగిస్తుంటారు. నంద్యాల, కర్నూలుకు ప్రొద్దుటూరు దగ్గర కావడంతో అక్కడి నుంచే లావాదేవీలు చేస్తుంటారు. ఒక్క ఆదోనిలోనే రోజుకు అన్‌సీజన్‌లో సుమారు రూ.5 కోట్ల వరకు వ్యాపారం సాగేది.

 

నీ వెంటే నేను

బంగారంతోపాటు వెండి కూడా పోటీ పడుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి రూ.46 వేలు నడుస్తోంది. గతంలో వ్యాపారుల వద్ద ఉన్న వెండిని ప్రస్తుతం ధర ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు.

 

కొనలేని స్థితిలో సామాన్యుడు: పది గ్రాముల మేలిమి బంగారం రూ.39,760 ఉంది. పదిరోజుల క్రితం బంగారం రూ.34 వేలు మార్కెట్‌లో పలికింది. రోజురోజుకు ధర పైపైకి ఎగబాకటంతో సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ముస్లింల వివాహాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిలో కనీస నగలు పెట్టేందుకు ధర ఎక్కువగా ఉన్నా.. కొనుగోలు చేయడం తప్పడం లేదు.

 

జూన్‌లో 20 శాతం వ్యత్యాసం

- కె.అసద్‌ రహీం,ఏపీ బులియన్‌ అసోసియేషన్‌ సభ్యుడు, ఆదోని

రోజురోజుకు బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్‌కు ఎక్కువ విలువ ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. రూపాయికి బలం వచ్చినప్పుడు కొంత మేర ధరలు తగ్గే అవకాశం ఉంది. ఒక్క జూన్‌లోనే 20 శాతం వ్యత్యాసం కన్పించింది. ధరలు అధికంగా ఉండటంతో వ్యాపారులు, ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.