27 నుంచి జలసాధన పాదయాత్ర: మాజీ ఎంపీ - Vikarabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

27 నుంచి జలసాధన పాదయాత్ర: మాజీ ఎంపీ

సమావేశంలో మాట్లాడుతున్న విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్‌ తదితరులు

వికారాబాద్‌: సాగునీటి జలాల విషయంలో వికారాబాద్‌ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరని అన్యాయం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జలసాధన పాదయాత్ర నిర్వహిస్తున్నామని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగపురంలో మొదలయ్యే పాదయాత్ర పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి వరకు కొనసాగుతుందని చెప్పారు. ఆదివారం వికారాబాద్‌లోని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ నివాసగృహంలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు విషయాన్ని ముఖ్యమంత్రి విస్మరించారని, దీంతో జిల్లాకు సాగునీరు అందక పొలాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేసి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ ఎన్నికలప్పుడు కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించి పనులు చేపట్టాలన్న లక్ష్యంతోనే జలసాధన పాదయాత్ర తలపెట్టామన్నారు. ఈ యాత్రను ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ధారూర్‌ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శివారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షుడు కిషన్‌నాయక్‌, పార్టీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కుల్కచర్లలో పటాన్ని చూపుతున్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: టీఆర్‌ఆర్‌

కుల్కచర్ల: వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు సాగునీటి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పాదయాత్రను చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కుల్కచర్లలో మండల అధ్యక్షుడు శేరిరాంరెడ్డి, కార్యకర్తలతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శంకర్‌పల్లి ప్రాంతం నుంచి పరిగి మండలం వరకు జరుగుతుందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకంలో భాగంగా లక్ష్మిదేవిపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌ సామర్థ్యం ముందుగా 10 టీఎంసీీలు ఉండగా, ఇప్పుడు దాన్ని 2.5 టీఎంసీీకి ప్రభుత్వం తగ్గించిందని అన్నారు. దీని వల్ల పరిగి, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌ తదితర ప్రాంతాలకు సాగునీటి లభ్యత తగ్గిపోతుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా పాత డీపీీఆర్‌ ప్రకారం జరిగిన కేటాయింపుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకువస్తామన్నారు. డీసీఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు భీంరెడ్డి, జిల్లా ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌, నాయకులు రవినాయక్‌, మొగులయ్య, శంకర్‌ పాల్గొన్నారు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.