రామలింగేశ్వరాలయంలో భక్తుల పూజలు
మోక్ష గుండంలో స్నానాలు చేస్తున్న భక్తులు
మోమిన్‌పేట, న్యూస్‌టుడే: రామలింగేశ్వస్వామి జాతర ప్రారంభ మహోత్సవంలో భాగంగా స్వామి వారికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించుకున్నారు. ఆదివారం జాతర ప్రారంభం కాగా పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మండలంలోని ఆయా గ్రామాల భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంణంలో రాత్రి వేళలో జరిగే భజన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇక్కడే బస చేస్తున్నారు. రాత్రి వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అర్చకులు మడపతి వీరేశం లింగం స్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ముగింపు రోజైన సోమవారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దేవాలయం పరిసరాల ప్రాంతాలలో ఉన్న చెట్ల కింద భక్తులు సేద తీరడానికి ముళ్ల పొదలు తొలగించి పరిశుభ్రతా చర్యలు తీసుకున్నారు. తాగు నీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ట్యాంకులలో తాగు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు