ఎప్పటికైనా ధర్మానిదే విజయం
యజ్ఞ కార్యంలో పాల్గొన్న అతిథులు, సభ్యులు
వికారాబాద్ మున్సిపాలిటీ, న్యూస్టుడే: కలియుగంలో భగవన్నామ స్మరణ ద్వారా మోక్షప్రాప్తిని సాధించడానికి సులభమైన మార్గాన్ని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అందించారని సాహితీవేత్త బ్రహ్మశ్రీ వల్లూరి శ్రీ రామచంద్రమూర్తి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శ్రీ సత్యసాయి జ్ఞాన కేంద్రంలో 17వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భక్తి, జ్ఞాన యోగ మార్గాల ద్వారా భగవంతుడిని, ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించే ఏకైక మార్గం నామ సంకీర్తన అని ఆయన తెలిపారు. అధర్మమున్నంత కాలం ధర్మం జీవించే ఉంటుందని ధర్మం ఎల్లప్పుడు సత్యం వైపే మొగ్గు చూపుతుందని తెలిపారు. భగవద్గీత జ్ఞాన, మోక్ష ప్రాప్తికి నిరదర్శనమన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమల ద్వారా బాబా ప్రపంచ శాంతికి గట్టి పునాదులు వేశారని చెప్పారు. ప్రతి మానవుడు ఆధ్యాత్మిక చింతన ద్వారా మానవ సేవకు అంకితమవ్వాలని సూచించారు. జ్ఞాన కేంద్రం 17 సంవత్సరాల పాటు సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో సేవలందించటం గొప్ప విషయం అని తెలిపారు. జ్ఞాన కేంద్రం అధ్యక్షుడు హరతి ద్వారక్నాథ్ మాట్లాడుతూ వికారాబాద్ సేవా సమితి విద్య, వైజ్ఞానిక, సాహిత్యం, సామాజిక సేవలందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ప్రాంతీయ సమన్వయకర్త బీసీ రామన్న, జిల్లా అధ్యక్షుడు జగదీశ్సింగ్ ఠాకూర్, ప్రాంతీయ ఆధ్యాత్మిక సమన్వయకర్త పీీవీ పున్నయ్య, కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, కార్యదర్శి పాపయ్య, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త బందెప్పగౌడ్, డాక్టర్ భక్తవత్సలం, సభ్యులు విశ్వనాథం, నాగయ్య, బస్వరాజ్, లక్ష్మణ్, కె. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.