కమలాకర్షణ! - Vikarabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

కమలాకర్షణ!

త్వరలో కీలక నేతల చేరికలు

మారనున్న జిల్లా రాజకీయ సమీకరణాలు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వికారాబాద్‌ జిల్లానూ ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అన్నిచోట్లా నాయకులు పార్టీలు మారుతున్న వ్యవహారం ఇక్కడా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల తెదేపా, కాంగ్రెస్‌, తెరాసల నుంచి రాష్ట్రస్థాయి నేతలు భాజపాలో చేరుతున్న విషయం తెలిసిందే. ఇదేక్రమంలో వికారాబాద్‌కు చెందిన పేరెన్నికైన నాయకులను సైతం కమల దళంలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిపై ఆయా పార్టీల కార్యకర్తల్లోనూ చర్చ జరుగుతోంది. ఇవీ వివరాలు...

శాసనసభ ఎన్నికల సమయంలో వికారాబాద్‌ జిల్లాలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల కోసం భాజపా వెతుకులాడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. అగ్రనేతలను తీసుకొచ్చి ప్రచారం చేయించినా.... నాలుగు నియోజకవర్గాల్లోనూ కనీసం డిపాజిట్లు రాలేదు. ఆరు నెలల వ్యవధిలో వచ్చిన లోక్‌సభ ఎన్నికల నాటికి లెక్కలన్నీ తలకిందులయ్యాయి. చేవెళ్ల లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి జనార్దన్‌రెడ్డి ఏకంగా రెండు లక్షలకుపైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ పరిణామం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇదే అదనుగా నాయకులంతా కలిసి తమ పార్టీ దివంగత నేత బద్దం బాల్‌రెడ్డి కాలం నాటి పూర్వ వైభవానికి కృషి చేస్తున్నారు. రానున్న పురపాలిక ఎన్నికల్లో కనీసం రెండుచోట్ల కాషాయ జెండా ఎగురవేస్తామంటూ ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం పంచాయతీ సర్పంచి నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు జిల్లాలో తెరాస బలంగా ఉంది. తెరాసలో చేరలేక, సొంత పార్టీలో ఉండలేక కొందరు నేతలు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో భాజపా సైతం బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల్లోని రెండు పార్టీల ముఖ్య నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు కీలక నేతలు సైతం కాషాయ కండువా వేసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రంలో ఓ నేత కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కండువా వేసుకుంటే, సమీకరణాలు సహకరిస్తే తప్పనిసరిగా పురపాలిక చేజిక్కుతుందనే ఆశతో ఉన్నారు. అటు తాండూరులోనూ ఓ ప్రధాన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అక్కడి అసంతృప్త నేతలను గుర్తించి కాషాయ కండువా వేసుకోవాలని కోరుతున్నారు. ఏ పార్టీ నుంచి నాయకులు చేరినా స్వాగతిస్తామనే విధానంతో ముందుకెళుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన గట్టి నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. అయితే... భాజపా జిల్లా నేతల మధ్య సమన్వయం సరిగ్గా లేదని కొందరు సీనియర్‌ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల శ్రేణులు ఒక నాయకుడి వెంట ఉంటుండగా, ఒక నియోజకవర్గం కార్యకర్తలు మరో నాయకుడి వెంట నడుస్తున్నారని వారు చెబుతున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య కూడా పోసగడం లేదని అంటున్నారు. వీటికి విరుద్ధంగా మరో నియోజకవర్గాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అయితే... ఈ పరిస్థితులు ఎంతో కాలం ఉండవని, భాజపాలో కొత్త నాయకుల చేరికల తర్వాత శ్రేణుల బలం పెరుగుతుందని, అప్పుడు చిన్నచిన్న సమస్యలన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.