ప్రతిభ చూపు... ఉపకారం పొందు! - Vikarabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

ప్రతిభ చూపు... ఉపకారం పొందు!

పాఠాలు వింటున్న విద్యార్థులు

ఈ నెల 29 దరఖాస్తుకు తుది గడువు

నవంబరు 3న అర్హత పరీక్ష

పేద విద్యార్థులకు వరం ఎన్‌ఎంఎంఎస్‌ పథకం

న్యూస్‌టుడే, వికారాబాద్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి విద్యార్థులను, ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పథకాన్ని 2008 నుంచి అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులు ఉన్నతంగా చదివేందుకు దీనికింద ప్రతి ఏటా ఉపకార వేతనాలను అందిస్తూ చేయూతనిస్తోంది. కొన్ని రోజుల కిందట మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యా శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏటా సెప్టెంబరులో విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అక్టోబరులో అర్హత పరీక్షను నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఉంది. నవంబరు 3న అన్ని జిల్లా కేంద్రాల్లోను అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ పథకం ఉద్దేశం, దీనికింద లభించే ప్రయోజనాలు తదితర అంశాలపై న్యూస్‌టుడే కథనం.

దరఖాస్తు విధానం...

జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు పత్రాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణ.జీవోవి.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా అంతర్జాలంలో అందుబాటులో ఉన్న దరఖాస్తు నమూనాను పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది. రూ.1.50 లక్షల లోపు ఆదాయం కలిగి ఉన్న ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ, గత 7వ తరగతిలో ఓసీ, బీసీలు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులను సాధించి ఉండాలి. తమ కులం, ఆదాయం, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌ పోర్టు సైజు ఫొటోలు దరఖాస్తు పత్రానికి జత చేసి సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి సమర్పించాలి. పత్రాలను ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి వాటిని జిల్లా అధికారులకు సమర్పిస్తారు.

● ఈ పరీక్షలో ఎంపికైన వారికి ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం మంజూరు చేస్తుంది. ఒక్కసారి విద్యార్థి పరీక్షలో అర్హత సాధిస్తే ఇంటర్మీడియట్‌ పూర్తి చేసే వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఉపకార వేతనం అందజేస్తుంది.

జిల్లాలో...: వికారాబాద్‌ జిల్లాలో పరిగి, తాండూరు, కొడంగల్‌, వికారాబాద్‌ నియోజకవర్గాలున్నాయి. జిల్లాలో ఒకటి నుంచి పది వరకు చదువుతున్న విద్యార్థులు దాదాపు లక్ష మంది ఉంటే వీరిలో8వ తరగతి విద్యార్థులు సగటున 25వేల మంది ఉంటారు. వికారాబాద్‌ నియోజకవర్గంలోని ధారూర్‌, బంట్వారం, కోట్‌పల్లి, మోమిన్‌పేట, మర్పల్లి, వికారాబాద్‌ మండలాల్లో 52 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 6 కస్తూర్బా విద్యాలయాలున్నాయి. వాటిలో 2,600లకు పైగా విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారు.

విద్యార్థులు ఉపయోగించుకోవాలి..

బాబూ సింగ్‌, మండల విద్యాధికారి, వికారాబాద్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాన్ని అందుకోవచ్ఛు అర్హత పరీక్షలో సఫలమైతే ఉన్నత విద్యకు ఉపకరిస్తుంది. 8వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అర్హత పరీక్షకు సన్నద్ధం కావాలి. ఆగస్టు 29 వరకు తుది గడువు ఉంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించి దరఖాస్తు చేయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.