లక్ష్యం ఉన్నతం... అమలే కీలకం! - Vikarabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

లక్ష్యం ఉన్నతం... అమలే కీలకం!

పాఠశాలల్లో స్వచ్ఛతా పక్షోత్సవాలు

 సెప్టెంబరు ఒకటినుంచి అమలు

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట

నం పరిశుభ్రంగా ఉంటూ పరిసరాలను సైతం శుభ్రంగా ఉండేట్లు చూసుకుంటే ఊరంతా బాగుంటుంది. దీనిని అందరూ పాటిస్తే అంతటా స్వచ్ఛ భారత్‌ కనిపిస్తూ ఆరోగ్యవంతమైన జీవితం సాకారమవుతుంది. ఇలాంటి వాస్తవాలపై బాల్యంలోనే బీజం వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్చ్‌ భారత్‌ అభియాన్‌’ లో భాగంగా పాఠశాల విద్యా శాఖ, సర్వశిక్ష అభియాన్‌తో కలిసి సెప్టెంబరు ఒకటి నుంచి 16 వరకు ‘స్వచ్ఛతా పక్షోత్సవాలు’ నిర్వహించటానికి సన్నద్ధ మవుతోంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి న్యూస్‌టుడే అందిస్తున్న కథనం.

2017 నుంచి శ్రీకారం

పాఠశాలలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనేది ఎప్పటినుంచే ఉన్న కార్యక్రమం. దీనికోసం రకరకాల పథకాలను అమలు చేస్తున్నారు. దీనివల్ల నిర్వహణ సక్రమంగా ఉండటంలేదు. పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నిజాన్ని గమనించిన కేంద్రం అన్ని రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలను ఒక చోటకు చేర్చి పక్కాగా అమలు చేయాలనే సంకల్పంతో స్వచ్ఛ భారత్‌ అభియాన్‌కు శ్రీకారం చుట్టింది. 2017నుంచి దీన్ని అన్ని రాష్ట్రాల్లో పటిష్ఠంగా అమలుచేస్తున్నారు.ఈ సంవత్సరానికి సంబంధించి కూడా అమలుచేయనున్నారు.

● జిల్లాలోని 18 మండలాల్లో 738 ప్రాథమిక పాఠశాలలు ఉండగా అందులో 35,314 మంది, 112 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10,237 మంది, 161 ఉన్నత పాఠశాలల్లో 37,256 మంది విద్యార్థులు చదువుతున్నారు. పథం అమలులో భాగంగా స్వచ్ఛతపై పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించటానికి శ్రీకారం చుట్టనున్నారు. కొందరు ఉపాధ్యాయులు ఆసక్తితో అమలు చేస్తున్నారు. పరిశుభ్రతకు సంబంధించిన అంశాలు ఉండటంతో చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరుతున్నారు.

నాగిరెడ్డిపల్లి పాఠశాల ఆదర్శం

బొంరాస్‌పేట మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల పరిశుభ్రత, శౌచాలయాల వినియోగంలో ఆదర్శంగా ఉంది. సుమారు 20 ఏళ్ల కిందటనే ఇక్కడి విద్యార్థులకు శౌచాలయాలు నిర్మించారు. గ్రామంలో అప్పట్లోనే ప్రజలందరూ వందశాతం ఇంటింటికీ శౌచాలయాలు నిర్మించుకోవటంతో 2010లో రాష్ట్ర ప్రభుత్వం ‘శుభ్రం’ అవార్డు ప్రకటించగా గ్రామాభివృద్ధికోసం పారితోషకంగా ఇచ్చిన రూ.30వేలతో పాఠశాలలోని బాల బాలికలకు శౌచాలయాలు నిర్మించారు. 2012లో మరోసారి అవార్డు ఇస్తూ రూ.50వేలు గ్రామాభివృద్ధికోసం ఇచ్చిన నిధులతో పాఠశాలలో తాగునీటి ట్యాంకు నిర్మించారు.

లింగన్‌పల్లిలో తల్లిదండ్రుల సమావేశం

పాఠశాల నిర్వహణ నిధులను పెంచాలి

-అబ్దుల్‌హక్‌, ఉపాధ్యాయుడు, జీసీపీఎస్‌ కొడంగల్‌

పాఠశాలల్లో కార్యక్రమాల నిర్వహణకు నిధుల కొరత ఇబ్బందిగా మారుతోంది. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, తరగతి గదులను ఆధారం చేసుకుంటూ నిధులు మంజూరు చేయాలి.

సరిపడా ఉపాధ్యాయులు అవసరం

-స్రవంతి, ప్రధానోపాధ్యాయురాలు, ప్రాథమికోన్నత పాఠశాల, బురాన్‌పూర్‌ (బొంరాస్‌పేట)

విద్యార్థుల సంఖ్యకు సరిపడు ఉపాధ్యాయులు/ వలంటీర్లు ఉండాలి. పాఠశాలలో ఏడు తరగతులకు ఒకరిద్దరు ఉపాధ్యాయులు పని చేస్తుంటే ఇలాంటి కార్యక్రమాల అమలుకు ఇబ్బందిగా ఉంటోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వలంటీర్లను నియమించాలి.

సక్రమంగా అమలు చేస్తేనే ప్రయోజనం

-రవికుమార్‌, విద్యా శాఖ సెక్టోరియల్‌ అధికారి, వికారాబాద్‌

పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు శుభ్రత, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. వాటిని నిత్య జీవితంలో పాటిస్తే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి. పాఠశాలల్లో చదువులతో పాటుగా ఉపాధ్యాయులు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

కార్యక్రమాలు అమలు తీరు ఇది..

● మొదటి మూడు రోజులు ‘స్వచ్ఛతా శపథం నిర్వహణ దినోత్సవం’ పేరుతో పాఠశాల విద్యార్థులకు పథకం ఉద్దేశాలు వివరిస్తూ అవగావహన కల్పించాలి. ప్రార్థన సమయంలో ప్రతిజ్ఞ చేయించాలి.

● 4న స్వచ్ఛతా అవగాహన దినోత్సవం కింద తల్లిదండ్రులు, విద్యాకమిటీలతో పాఠశాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ప్రతిభా పోటీలను నిర్వహించాలి.

● 5న సమాజానికి చేరువ కావటం కింద పాఠశాల ఉపాధ్యాయులు సమీపంలోని గ్రామాలను సందర్శించాలి. గ్రామాల్లో మూత్రశాలల వినియోగం, వ్యర్థ్యాల నిర్వహణ గురించి తెలియజేయాలి.

● 6న హరిత దినోత్సవం కింద ఎకో క్లబ్‌ చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ అవగాహన కల్పించాలి. పాఠశాలల్లో చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలి.

● 7న స్వచ్చతా పోటీల దినోత్సవంలో భాగంగా స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా వివిధ రకాల పోటీలను నిర్వహించాలి.

● 9న చేతుల శుభ్రత దినోత్సవం కింద భోజనానికి ముందు, తర్వాత వ్యక్తిగత చేతులు శుభ్రం చేసుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

● 11న వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత- ఆరోగ్యంపై ప్రభావం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

● 12న స్వచ్ఛ నీటి దినోత్సవం కింద నీటి విలువను తెలియజేస్తూ పంపిణీ తీరును చూపాలి.

● 13న లేఖల రచన దినోత్సవం కింద పక్షోత్సవాల్లో విద్యార్థులు నేర్చుకున్న అంశాలు వివరిస్తూ తల్లిదండ్రులు కూడా పాటించాలనే సందేశంతో ఉత్తరాలు రాయించాలి.

● 16న బహుమతుల దినోత్సవ కార్యక్రమం ఉంటుంది. దీనికింద విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా ఎంపిక చేసిన వారికి బహుమతులు అందించాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.