అమ్మ భాషకు పట్టం.. - Chittoor - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

అమ్మ భాషకు పట్టం..

బడిలో భాషోత్సవం

● నేటి నుంచి 29వరకు నిర్వహణ

● రంగం సిద్ధం చేసిన ఎస్‌ఎస్‌ఏ

తరగతి గదిలో బోధిస్తున్న ఉపాధ్యాయుడు

భాషకు తొలి గురువు అమ్మ.. ఆమె పొత్తిళ్ల నుంచే మనం భాష నేర్చుకుంటాం.. అందుకే దాన్ని మాతృభాష అంటాం.. ఈ భాష ఎంతో మధురమైంది.. జీవనోపాధి కోసమని మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా.. ఏ ప్రాంతానికి వెళ్లినా.. మాతృభాషను మరువరాదంటారు పెద్దలు.. మాతృభాష తియ్యదనాన్ని కవులు, మేధావులు, సాహితీవేత్తలు.. ఇలా ఎందరో కీర్తిస్తూనే ఉంటారు.. భాష ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చాటి చెబుతునే ఉన్నారు.. మాతృభాష మాధుర్యాన్ని చాటిచెప్పేందుకు ప్రభుత్వం భాషోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది.. ఈ మేరకు సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర పథక సంచాలకులు చినవీరభద్రుడి ఆదేశాల మేరకు రంగం సిద్ధమైంది.

న్యూస్‌టుడే, చిత్తూరు(విద్య)

విద్యార్థుల్లో వివిధ భాషలపై అభిరుచి, ఆసక్తి కల్గించడంతో పాటు భాషా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా పాఠశాల స్థాయిలో త్రిభాషా విధానం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26నుంచి 29వరకు భాషోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు ఇచ్చింది. రోజుకో భాషకు సంబంధించి వివిధ కృత్యాలను విద్యార్థులతో రూపొందించి ప్రదర్శించాలి. దీంతో వారిలో సృజనాత్మకత పెంపొందించడానికి దోహదపడుతుంది. ఈ సందర్భంగా పలు పోటీలను నిర్వహించనున్నారు. బోధనాభ్యాసన సామగ్రికి స్థానిక వనరుల ఉపయోగంతో విద్యార్థుల్లో ఆట, పాటలతో భాషాభివృద్ధికి బాటలు వేయనున్నారు. ఈ మేరకు ఎస్‌ఎస్‌ఏ ఉపక్రమించింది.

 

రోజువారీ భాషోత్సవాలు ఇలా..

జిల్లాలోని పాఠశాలల్లో భాషోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ నెల 26న ఆంగ్లభాష, 27న సంస్కృతం/హిందీ/ ఉర్దూ, 28న కన్నడ/తమిళం/ఒరియా/ గిరిజన బాష, 29న తెలుగు భాష కార్యక్రమాలు నిర్వహించాలి.

 

భాషా కృత్యాలు

ఆంగ్లం: ఆంగ్ల భాషా పరిజ్ఞానం కల్పించడానికి ఈ కృత్యాలు చేయాలి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వివిధ రకాల ప్రదర్శనలు, ఆటల నిర్వహణతో పాటు ఇంద్రియ జ్ఞానం పెంపొందించడానికి తోలుబొమ్మలాట, కథలు, పాటు, క్విజ్‌ నిర్వహించాలి. పఠన పోటీలు, చిన్న కథలు రాయడం, ఆంగ్లభాష ప్రాముఖ్యతపై చర్చించాలి. నాటకీకరణంగా కథలు చెప్పాలి. పద్యాలు, ఉక్తలేఖనం, బోధన అభ్యాసన సామగ్రి తయారుచేయించాలి.

 

హిందీ: జాతీయ భాష హిందీపై ఆసక్తి విద్యార్థుల్లో కల్పించాలి. ఇందుకు పద్యాలు, ఉక్తలేఖనం, పఠన పోటీలు, చిన్న చిన్న కథలు రాయించడం, జాతీయ భాష హిందీపై చర్చ నిర్వహించాలి. వివిధరకాల ప్రదర్శనలు, ఆటలు, పాటలు, రోల్‌ప్లే నిర్వహణతో పాటు నాటకీకరణ కథలు వినిపించాలి.

 

సంస్కృతం: ప్రాచీన భాష అయిన సంస్కృతంపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచనలు ఇవ్వాలి. పిల్లలకు పఠన పోటీలు, చిన్న కథలు రాయించడం, ఈ భాషపై చర్చ నిర్వహించాలి. అనంతరం బోధన అభ్యసన సామగ్రిని తయారుచేయాలి.

 

ఉర్దూ: ఈ భాషను మదరసాలు, ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ భాష గొప్పదనాన్ని వివరించాలి. ఉర్దూలో పొడపు కథలు, పద్యాలు, గజల్స్‌, చిన్నకథలు తెలియజేయాలి.

 

గిరిజన, సరిహద్దు భాషలు: జిల్లాలోని గిరిజన పాఠశాలల విద్యార్థులకు ఆ భాషలపై అవగాహన కల్పించాలి. వారి సంస్కృతీసంప్రదాయాలు, నృత్య ప్రదర్శన నిర్వహించాలి. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు తమిళం, కన్నడ భాషలపై అవగాహన కల్పించాలి. ఆయా భాషాభివృద్ధికి కృత్యాలు నిర్వహించాలి.

 

తెలుగు భాష: మధురమైన ప్రాచీన భాష తెలుగు భాషా విశిష్టత, ప్రాముఖ్యత, ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. తేటల తెలుగు భాషకు గౌరవం లభించేలా వక్తృత్వ, కథలు, రచనా ప్రాబల్యాన్ని వివరించాలి. పాటలు, చర్చ నిర్వహించాలి.

 

భాషోత్సవాల ప్రయోజనాలు..

అభ్యసన ప్రక్రియ కొనసాగించడానికి భాషాత్సోవం విద్యార్థులకు దోహదపడుతుంది. వినడం, మాట్లాడం, చదవడం, రాయడంతో భాషపై నైపుణ్యం సాధించవచ్ఛు విద్యార్థుల్లో పరస్పర సమాచార నైపుణ్యాల అభివృద్ధికి ప్రోత్సాహకారిణి. భాషపై ప్రయోగానికి భాషోత్సవం దోహదపడుతుంది.

 

భాషోత్సవ లక్ష్యాలు..

విద్యార్థుల మధ్య సహృద్భావన కల్పించుట, అవ్యవస్థీకృత సమస్యలను సాధించేందుకు, సముచిత నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుంది. ద్వితీయ భాషను సమర్థంగా ఉపయోగించుటకు విద్యార్థులను ప్రోత్సహించవచ్ఛు స్వతంత్రంగా నేర్చుకొనుట, కలిసి పనిచేయుట, సృజనాత్మకతను విస్తరింపజేసి సమాచారాన్ని వివిధ భాషల్లో అందించగలిగే నైపుణ్యాన్ని వృద్ధిపరచవచ్ఛు మన సంస్కృతిని ఆచరిస్తూ విజయాల సాధనకు ప్రభావితం చేస్తుంది. భాషోత్సవ ప్రాంగణానికి విద్యార్థులు, యువత, మహిళలు సమాజంలోని ఇతర సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.