కట్టారు.. కూల్చేశారు! - Vikarabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

కట్టారు.. కూల్చేశారు!

నాసిరకంగా చెక్‌డ్యాం నిర్మాణం

నీరు లీకవడంతో తొలగింపు

పర్యవేక్షణ కొరవడిన ఫలితం

న్యూస్‌టుడే, తాండూరు

నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వ సంకల్పానికి క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. చెక్‌డ్యాం పనులను పర్యవేక్షించకపోవడంతో గుత్తేదారు నాసిరకంగా నిర్మించారు. దీంతో చిన్న ఆనకట్టకు పగుళ్లు వచ్చాయి. దీనిపై విమర్శలు వస్తాయని అధికారులు ఏకంగా కట్టకు ఒకవైపు కూల్చివేయించారు. ఫలితంగా అర మీటరు ఎత్తు, వంద అడుగుల వెడల్పు, కిలోమీటరు పొడవునా నిలువ ఉండాల్సిన జలమంతా దిగువకు వృథాగా పోయింది.

తాండూరు -సంగారెడ్డి రహదారి మార్గంలో గాజీపూరు, బుద్దారం గ్రామాల సమీపంలోని వాగులపై వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా వంతెనల నిర్మాణానికి 2016లో ప్రభుత్వం రూ.8.90 కోట్లను మంజూరు చేసింది. అదే ఏడాది టెండరు పొందిన గుత్తేదారు పనులను ప్రారంభించారు. వంతెనలతోపాటు వాగుల్లో ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని ఆపేలా రూ. 9లక్షలతో చెక్‌డ్యాం(ఆనకట్ట)ల నిర్మాణం చేపట్టారు. బుద్దారం వాగుపై వంతెనతోపాటు ఆనకట్ట పనులు పూర్తయ్యాయి. గాజీపూరు సమీపంలోని వాగుపై వంతెన పూర్తయింది. దాని స్తంభాలను ఆధారం చేసుకుని వంద అడుగుల వెడల్పు, అర మీటరు ఎత్తులో ఆనకట్ట పనులు చేపట్టారు. అయితే ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజినీర్లు పర్యవేక్షణ కొరవడడంతో వంతెనకు సంబంధించిన ఒక స్తంభానికి ప్రారంభంలోనే పగుళ్లు వచ్చాయి. ఈ తీరుపై 2018 ఆగస్టు 21న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

భూగర్భ జలమట్టాల పెరుగుదలపై నిరాశ

ఈనెల మొదటి వారంలో ఎగువన కురిసిన వర్షాలకు దిగువన ఉన్న చెక్‌డ్యాంలోకి వరద భారీగా చేరింది. కిలోమీటరు పొడవునా జలం నిలువుంటే రెండు వందలకు పైగా వ్యవసాయ బోర్లలో నీటిమట్టాలు పెరుగుతాయని రైతులు ఆశించారు. అయితే చెక్‌డ్యాంలోకి నీరు చేరగానే లీకవడం మొదలైంది. దీంతో రైతుల నుంచి విమర్శలు వచ్చాయి. వరద మరింత ఉద్ధృతంగా వచ్చి చేరితే చెక్‌డ్యాం తెగిపోతుందేమోనంటూ భయపడిన ఇంజినీర్లు పగుళ్లు వచ్చిన కట్టను పూర్తిగా తొలగించాలని గుత్తేదారును ఆదేశించారు. ఈనెల 17వ తేదీ కంటే ముందుగానే కట్టను తొలగించారు. ఫలితంగా కిలోమీటరు పొడవునా నిలువ ఉన్న నీరంతా దిగువకు వృథాగా వెళ్లిపోయింది. అయిదు రోజులు గడిచేసరికి చెక్‌డ్యాం మొత్తం ఖాళీ అయింది. తమ బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయని భావించిన అన్నదాతలకు తాజా పరిణామం నిరాశకు గురిచేసింది.

గుత్తేదారు ప్రమాణాలు పాటించలేదు

శ్రీనివాస్‌, డీఈఈ, రహదారులు, భవనాల శాఖ, తాండూరు

ఇప్పటికే పూర్తయిన ఆనకట్టకు పగుళ్లు వచ్చిన ప్రదేశంలో కూల్చివేశాం. త్వరలోనే అక్కడ కొత్తగా పనులు ప్రారంభించి నాణ్యతగా చేసేలా చర్యలు తీసుకుంటాం. .ఎగువ నుంచి వచ్చే వరద వృథా పారకుండా పటిష్ఠం చేస్తాం. మేం సూచించిన ప్రమాణాలను గత గుత్తేదారు పాటించలేదు. పనులను ఆయన సొంత పరిజ్ఞానంతో చేపట్టడంతో ఇలా జరిగింది. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.