పురపాలక సంఘంగా కుప్పం! - Chittoor - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

పురపాలక సంఘంగా కుప్పం!

8 పంచాయతీలతో కలిపి ఏర్పాటుకు ప్రతిపాదనలు

 

రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న నియోజకవర్గ కేంద్రమైన కుప్పం.. పురపాలక సంఘంగా మారనుంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి పంపాలంటూ గతనెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది గ్రామ పంచాయతీలతో కుప్పంను మున్సిపాలిటీగా చేయాలంటూ ప్రతిపాదనలు తయారు చేసిన అధికారులు.. వారం రోజుల క్రితం ప్రభుత్వానికి పంపారు.

న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చేందుకు మూడేళ్ల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం రూర్బన్‌ పథకాన్ని తీసుకురాగా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పథకంలో కుప్పాన్ని ఎంపిక చేసింది. కుప్పంతో పాటు చుట్టుపక్కల ఏడు గ్రామ పంచాయతీలను రూర్బన్‌లో కలిపింది. రూ.100 కోట్ల రూర్బన్‌ పథక నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినా అందులో కొన్ని ముందుకు సాగక ప్రారంభంలోనే నిలిచిపోయాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో రూర్బన్‌ నిధులు వెనక్కి వెళ్లాయి. అటు మున్సిపాలిటీగా మారకపోగా.. రూర్బన్‌ పథకంలో భాగంగా కుప్పంలో అభివృద్ధి జరగలేదు.

 

‘రూర్బన్‌’ పంచాయతీలతో పురపాలక సంఘం

తెదేపా ప్రభుత్వ కాలంలో మూడేళ్ల క్రితం కుప్పం మేజర్‌ గ్రామ పంచాయతీతో పాటు సమీపంలోని మరో పది గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. మున్సిపాలిటీ కాకపోవడంతో గుడుపల్లె పరిధిలోని గుండ్లసాగరం, శెట్టిపల్లె, బెగ్గిలిపల్లె పంచాయతీలను తొలగించి మిగిలిన పంచాయతీలతో కలిపి కుప్పానికి రూర్బన్‌ పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతనెల నూతన ప్రభుత్వం మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరింది. అధికారులు రూర్బన్‌ పథకంలోని గ్రామాలను విలీనం చేస్తూ ప్రతిపాదనలు పంపించారు. కుప్పం మేజర్‌ గ్రామ పంచాయతీతో పాటు పట్టణానికి సమీపంలోని చీలేపల్లె, దళవాయికొత్తపల్లె, సామగుట్టపల్లె, చీమనాయనపల్లె, తంబిగానిపల్లె, కమతమూరు, అనిమిగానిపల్లెలను కలిపి ఎనిమిది గ్రామ పంచాయతీలతో కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చేలా ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మున్సిపాలిటీ ప్రతిపాదిత గ్రామ పంచాయతీల్లో దాదాపు 48,537 జనాభా ఉన్నారు. ప్రతిపాదనలు ఆమోదం పొంది కుప్పం మున్సిపాలిటీగా మారితే పురపాలక నిధులతో అభివృద్ధి వేగవంతం అవుతుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.