కార్మిక క్షేత్రం.. యువతకు ఛత్రం - Jagtial - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

కార్మిక క్షేత్రం.. యువతకు ఛత్రం

సైన్యంలో ఉద్యోగాల సాధనకు సింగరేణి బాసట
రెండు నెలల పాటు వసతితో కూడిన శిక్షణ
న్యూస్‌టుడే, యైటింక్లయిన్‌కాలనీ

బొగ్గు ఉత్పత్తి.. పర్యావరణ పరిరక్షణ.. సామాజిక సేవ.. ఈ మూడు అంశాల్లో తనకు తానే సాటి అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది సింగరేణ. కోల్‌బెల్ట్‌ ప్రాంత యువకులు ఎక్కువ సంఖ్యలో భారత సైన్యంలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సంస్థ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరం నిరుద్యోగులకు వరంగా మారింది. ముందెన్నడూ లేని విధంగా రెసిడెన్షియల్‌ శిక్షణను సమర్థవంతంగా నడిపిస్తూ యువతకు కఠోర శిక్షణ ఇస్తున్నారు. సంస్థలోని ఆర్జీ-1, 2, 3 డివిజన్లతో పాటు భూపాలపల్లి ఏరియాకు చెందిన మొత్తం 152 మంది యువతకు యైటింక్లయిన్‌కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాలులో ఈ నెల 13 నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

కవాతుతో ప్రారంభం
కాలనీలోని డాక్టర్‌ అబ్దుల్‌కలాం క్రీడా మైదానం ఆవరణలో ప్రతి రోజూ తెల్లవారుజామున 5 గంటలకు కవాతుతో శిక్షణ ప్రారంభమవుతుంది. ప్రతి రోజు పరుగు, పులప్స్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌ఫుట్‌తో పాటు యోగా, ధ్యానం వంటి అంశాల్లో తరగతులు తరగతులు నిర్వహిస్తున్నారు.

అభ్యర్థులకు పౌష్టికాహారం
ప్రతి రోజూ ఉదయం పాలు, గుడ్డు, రొట్టె, ఏదైనా ఒక పండు, మధ్యాహ్నం కూరగాయలతో కూడిన భోజనం, సాయంత్రం అల్పాహారంగా పాలు, రాత్రి భోజనంలో వారంలో ఒకరోజు మాంసాహారం ఇస్తున్నారు. భోజన, వసతి సదుపాయాలను రెండు రోజులకు ఒకసారి ఆర్జీ-2 జీఎం నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రభావిత గ్రామాలకే ప్రాధాన్యం
సింగరేణితో పాటు ప్రభావిత గ్రామాల నుంచి యువకులను యాజమాన్యం ఎంపిక చేసింది. వీరికి దుప్పట్లు, శిక్షణ సామగ్రి, ఒక పడక కేటాయించారు. సింగరేణి ఉపాధ్యాయులు, ఆర్మీ శిక్షకులచే రాత పరీక్షకు సన్నద్ధం చేయిస్తున్నారు.

అందుబాటులో వైద్యం
శిక్షణ కేంద్రంలో ఉన్న వారందరికీ అందుబాటులో వైద్య సేవలు కల్పించారు. ఏ ఒక్కరూ అనారోగ్యానికి గురి కాకుండా శిక్షణ వల్ల వచ్చే నొప్పులు నయం చేయించుకోవడానికి ప్రత్యేకంగా మెడికల్‌ సూపరింటెండెంట్‌ రమేష్‌బాబు శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు.

రెండు నెలలు
ఉచిత ఆర్మీ వసతి శిక్షణకు కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాలును వేదికగా ఎంపిక చేశారు. రెండు నెలల పాటు ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నందున కేంద్రంలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించారు. భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఆర్మీ శిక్షకులచే ప్రతి రోజూ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

150 మంది ఉద్యోగాలు సాధించడమే లక్ష్యం: కె.నారాయణ, జీఎం
సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వారంతా ఆర్మీలో ఉద్యోగాలు సాధించాలన్నదే లక్ష్యం. ఇందుకు అనుగుణంగా అన్ని విధాలుగా తర్ఫీదు ఇస్తున్నాం. శిబిరం ప్రారంభానికి ముందే అభ్యర్థులకు అన్ని పరీక్షలు నిర్వహించాం. ఆర్మీ శిక్షణ మాదిరిగా ఉండటంతో దాదాపు కఠోరంగానే ఉంటుంది. యువత ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా సమతులాహారం, శుద్ధ జలం అందిస్తున్నాం. ఉదయం, సాయంత్రం క్రీడా మైదానంలో, మధ్యాహ్నం వేళ తరగతులు నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం ఒక గంట మాత్రం విశ్రాంతికి అవకాశం ఇచ్చాం. శిక్షణ పొందుతున్న వారిలో 150 మంది ఉద్యోగాలు సాధించడమే లక్ష్యం.

అంశం: ఉచిత ఆర్మీ శిక్షణ
అభ్యర్థులు: 152 మంది
ఒక్కో అభ్యర్థికి రోజువారీ ఖర్చు: రూ.180
కేటాయించిన మొత్తం నిధులు:  రూ.12 లక్షలు
శిక్షణ పరిధి:  ఆర్జీ-1, 2, 3, భూపాలపల్లి డివిజన్లు
అభ్యర్థులకు అందిస్తున్న ఆహారం: పాలు, గుడ్డు, పండ్లు, భోజనం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.