అతివలకు ఆపన్నహస్తం - Jogulamba - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

అతివలకు ఆపన్నహస్తం

బాధితులకు అండగా నిలిచే సఖి కేంద్రం

నాలుగు జిల్లాల్లోనూ సేవలు ప్రారంభం

మహిళలపై వేధింపుల నివారణే లక్ష్యం
న్యూస్‌టుడే, గద్వాల న్యూటౌన్‌

హెల్ప్‌లైన్‌ 181 మహిళలు, బాలికలకు వేధింపులు, సమస్యలు ఎదురైనప్పుడు బాధితురాలు, ఆమె బంధువులు, స్నేహితుల్లో ఎవరో ఒకరు మహిళల హెల్ప్‌లైన్‌ - 181కు ఫోన్‌ చేసి తెలపాలి. లేదంటే జిల్లా సంక్షేమాధికారిణి(ఐసీడీఎస్‌ జిల్లా అధికారిణి)ని, దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌ని ఆశ్రయించి ఫిర్యాదు చేయాలి.

 

మహిళ సృష్టికి మూలం. ప్రత్యక్ష దైవమైన అమ్మకు ప్రతిరూపం. తల్లి, చెల్లి, చెలి, కూతురు ఇలా పేరేదైనా పంచేది ప్రేమే. ఆమె మాత్రం లింగ వివక్ష, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు, గృహహింస తదితర రూపాల్లో సమాజంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తోంది. ఇంటా, బయటా, పనిప్రదేశంలో, ప్రయాణాల్లో.. ఎక్కడా సురక్షితమైన వాతావారణం లేదు. బయటకు వెళ్లిన నుంచి ఇంటికి వచ్చేవరకు భయమే. కొందరికి ఇంటిలోనూ దినదిన గండమే. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకే ప్రభుత్వం సఖి కేంద్రాలను ప్రారంభించింది. అవి అందిస్తున్న సేవలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

సఖి కేంద్రం గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న జోగులాంబ జిల్లా కలెక్టర్‌

శశాంక, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం

మానవాళి చంద్రుడిపై నివాసానికి సిద్ధమవుతున్నా మహిళలను గౌరవించటం ఇంకా నేర్చుకోలేదు. మహిళలపై గృహహింస, పని ప్రదేశంలో, విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు, అక్రమ రవాణా, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్‌ దాడుల వార్తలు లేని రోజు ఉండటం లేదు. ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్న మహిళలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే షీటీమ్స్‌ని ప్రారంభించిన ప్రభుత్వం బాధితులకు అవసరమయ్యే అన్ని రకాల సేవలు ఒకేచోట అందించేందుకు సఖి కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రాల్లో ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మహిళా శిశు, సంక్షేమశాఖ(ఐసీడీఎస్‌), ఇందిరా ప్రియదర్శిని మహిళా సంక్షేమ సంఘం తదితర సపోర్ట్‌ సంస్థల ఆధ్వర్యంలో ఈ సఖి కేంద్రాలు పనిచేస్తున్నాయి. బాధితులు కట్టుబట్టలతో వచ్చినా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లా సఖి కేంద్రం సిబ్బంది

అందించే సేవలివే..

సఖి కేంద్రం బాధితులకు అన్నిరకాలుగా అండగా నిలుస్తుంది. సమస్యను మేజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకెళ్తుంది. చట్టపరంగా పోరాటం చేసే ప్రక్రియ చేపడుతుంది. బాధితురాలి పిల్లల సంరక్షణ చర్యలు కూడా చేపడుతుంది. బాధితురాలు కోరితే ఆమె నివసిస్తున్న ఇంటిలోనే ఉండే హక్కును కల్పిస్తుంది.

కౌన్సెలింగ్‌ : బాధిత మహిళలకు ధైర్యం చెప్పేందుకు, వారిలో ఒత్తిడిని దూరం చేసేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

న్యాయ సహాయం : కేసు నమోదు చేయించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదిని ఏర్పాటుచేస్తారు.

తాత్కాలిక వసతి : సఖి కేంద్రంలో బాధితురాలికి ప్రాథమిక సదుపాయాలతో అయిదు రోజులపాటు తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ : బాధితురాలు బంధువులు, శ్రేయోభిలాషులతో మాట్లాడటానికి వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పిస్తారు. ● వైద్యసేవలు : అంబులెన్స్‌ ఉంటుంది. ప్రభుత్వ వైద్యులు, నర్సులతో బాధితులకు అవసరమైన చికిత్సలు చేయిస్తారు.

వేధింపులు లేని సమాజమే లక్ష్యం

మహిళల మీద దాడులు, అత్యాచారాలు, గృహహింస, వరకట్న వేధింపుల నిర్మూలించేలా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం. సఖి కేంద్రానికి వచ్చే పరిస్థితి లేని సమాజమే లక్ష్యం. మమ్మల్ని ఆశ్రయించిన మహిళల బాధలు తొలగిస్తాం. వాళ్లకు అయిదు రకాల సేవలు అందిస్తాం. వారిలోని భయం పూర్తిగా పోగొడతాం. వారికి అండగా ఉన్నామన్న భరోసా కల్పిస్తాం.

- గోవర్ధిని, ఈడీ, ఇందిరా ప్రియదర్శిని మహిళా సంక్షేమ సంఘం

అన్నిరకాలుగా అండగా నిలుస్తాం

హింసకు గురయిన మహిళలకు సఖి కేంద్రం అన్నిరకాలుగా అండగా నిలుస్తుంది. అయిదు రోజుల పాటు సఖి కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తాం. కౌన్సెలింగ్‌తో మానసిక స్థైర్యాన్ని నింపుతాం. సఖి కేంద్రం సేవలను ప్రజలల్లోకి తీసుకెళ్లేందుకు రద్దీ ప్రదేశాలతోపాటు కళాశాలలు, పాఠశాలలు, రైల్వేస్టేషన్‌, బస్టాండుల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నాం.

- సుజాతా రాజ్‌, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటర్‌, గద్వాల సఖి కేంద్రం

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.