ఎన్నాళ్లకెన్నాళ్లకు - Jagtial - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

ఎన్నాళ్లకెన్నాళ్లకు

రూ. 80 లక్షలతో టౌన్‌హాలు ఆధునికీకరణ
ఈసారైనా కళాకారులకు ప్రయోజనం చేకూరేనా..?
జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే

కళలు, కళాకారులకు వన్నె తేవాల్సిన ప్రాంగణం ఇన్నాళ్లూ పాలకుల నిర్లక్ష్యానికి కళావిహీనమైంది. రెండున్నర దశాబ్దాలుగా నిరుపయోగమైన అధునాతన భవనానికి ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. మంత్రి చేతుల మీదుగా పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతి ఎన్నికల్లోనూ నెరవేరని హామీగానే మిగిలిన కళానిలయానికి పుర అధికారులు కొత్తరూపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారైనా భవనం అందుబాటులోకి రావాలని కళాకారులు ఆకాంక్షిస్తున్నారు. టౌన్‌హాలు ఆధునికీకరణ పనులపై ‘న్యూస్‌టుడే’ కథనం.

పట్టణ నడిబొడ్డున రెండున్నర దశాబ్దాల క్రితం ఐడీఎస్‌ఎంటీ నిధులు రూ.1.50 కోట్లతో నిర్మించిన టౌన్‌హాలు సాంకేతిక వైఫల్యంతో నిరుపయోగంగా మారింది. చారిత్రాత్మకమైన పట్టణంలో కళలకు అత్యంత ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో కళాకారుల ప్రయోజనార్థం అప్పట్లో ఈ భవనాన్ని అధునాతనంగా నిర్మించారు. కింద సెల్లార్‌, మూడు వైపులా ఖాళీ స్థలం, లోపల ఆడిటోరియం ఏర్పాటు చేసినా ప్రతిధ్వని కారణంగా భవనం వినియోగానికి దూరమైంది. తరచూ చిన్నచిన్న మరమ్మతులు, వాస్తుదోషాలు సవరించినా తాత్కాలిక వ్యాపారాలకు భవనం కేంద్రంగా మారింది. పట్టణ ప్రధాన  సమస్యల్లో ఒకటిగా నిలిచిన టౌన్‌హాలు ప్రగతిపై పాలకులు దృష్టి సారించలేకపోయారు. తాజాగా కేటీఆర్‌ ప్రకటించిన రూ. 50 కోట్ల నిధుల్లో రూ.80 లక్షలు టౌన్‌హాలు ఆధునికీకరణకు కేటాయించారు. టెండరు ప్రక్రియ తరువాత ఇటీవల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ భవనానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈ మేరకు గుత్తేదారులు పనులు ప్రారంభించారు.

చేపడుతున్న పనులివీ..
ప్రతిధ్వనికి కారణమైన పైకప్పును జిప్సంతో మూసివేస్తున్నారు. గోడలకు పైకప్పునకు వాల్‌పుట్టితోపాటు విద్యుద్దీపాలు అమర్చుతున్నారు. హాలుమొత్తం ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. భవనానికి నీటి సరఫరా పునరుద్ధరిస్తున్నారు. హాలులో కిందాపైనా 16 మూత్రశాలల్లో టైల్స్‌ వేస్తున్నారు. ఎక్కడా మురుగు నిలువకుండా పాడైపోయిన పైపులైను తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. దక్షిణం వైపు ఖాళీ స్థలంలో పచ్చదనాన్ని పెంచనున్నారు. భవనానికి రక్షణగా చుట్టూ ప్రహరీ ఎత్తును పెంచి ఆవరణలో మొక్కలు నాటనున్నారు. కళావేదికను కూడా కొద్దిగా మార్పులు చేసి కార్యక్రమాలకు అనువుగా తీర్చిదిద్దనున్నారు. టౌన్‌హాలులో కొనసాగుతున్న నిరాశ్రయుల కేంద్రాన్ని వేరే చోటకి తరలించే సన్నాహాలు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తికావడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

సరిపోని నిధులు..
ఆధునికీకరణకు రూ.80 లక్షల నిధులు ఏమాత్రం సరిపోవని ఇంజినీర్ల అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం పైకప్పు, ఇతర పనులకే ఈ నిధులు ఖర్చయిపోతాయి. ఇక భవనం లోపల కుర్చీలు, సెల్లార్‌ ఆధునికీకరణకు ఇతరత్రా పనులకు నిధులు అవసరం ఉంటాయి. భవనం ఎంత ఆధునికీకరించినా వెనుక కూర్చున్నవారికి వేదిక స్పష్టంగా కనిపించే అవకాశం లేదు. ఇందుకోసం భవనం లోపల మరిన్ని మార్పులు చేపట్టక తప్పదు. ఇదివరకే రూ. 5 లక్షలతో దక్షిణంవైపున వాస్తుకోసం రూ. 5 లక్షలతో ఓ గదిని నిర్మించారు. దీన్ని ఏ విధంగా వినియోగంలోకి తేవాలనేది స్పష్టత కొరవడింది.

కళలకు నిలయంగా మారేనా..?
ఎన్నో ఏళ్లుగా కళాకారులకు, కళలకు పట్టణంలో ప్రధాన వేదిక కొరవడింది. టౌన్‌హాలు ఆవరణలోని ఖాళీస్థలం, అంగడిబజార్‌ మైదానంలోనే కళా ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా టౌన్‌హాలు ఆధునికీకరణతో కళాకారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు, కళా ప్రదర్శనలకు టౌన్‌హాలు వేదికగా మార్చాలని కళాకారులు కోరుతున్నారు. పట్టణ నడిబొడ్డున విభిన్న మైన కళా ప్రదర్శనలు ప్రదర్శించేందుకు భవనం అనువుగా ఉంటుంది.

అంచనా వ్యయం పెంచి నిధులు కోరుతాం
అయూబ్‌ఖాన్‌, ఏఈ పురపాలక సంఘం
టౌన్‌హాలుకు మంజూరైన రూ. 80 లక్షల నిధులతో అత్యవసరమైన పనులు చేపడతాం. మిగిలిన పనులకు అంచనా వ్యయాన్ని పెంచి నిధులు కోరనున్నాం. పైకప్పు, ఇతర సాంకేతికమైన మార్పులతో ప్రతిధ్వని సమస్య పరిష్కారం కానుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.