close

బుధవారం, జనవరి 22, 2020

ప్రధానాంశాలు

చేయి తడిపితేనే పనయ్యేది

మత్స్యశాఖలో అవినీతి తంతు
వివిధ పథకాల్లో చేతివాటం

జగిత్యాలలోని మత్స్యశాఖ జిల్లా కార్యాలయంపై ఈ నెల 22న అనిశా జరిపిన దాడిలో ఆ శాఖ జిల్లా అధికారి, కార్యాలయ సీనియర్‌ సహాయకుడు పట్టుబడటం సంచలనం కలిగించింది. జగ్గాసాగర్‌ సంఘంలో నూతనంగా 50 మంది సభ్యులను తీసుకునేందుకు రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అనిశాకు చిక్కటంతో మత్స్యశాఖలో జరుగుతున్న అవినీతి తంతుపై అందరిదృష్టీ కేంద్రీకృతమైంది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా జిల్లాలో రూ. 24.87 కోట్లతో వివిధ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో అవినీతి తంతును అవలోకిస్తే...

జగిత్యాల ధరూర్‌క్యాంపు, న్యూస్‌టుడే

జగిత్యాల జిల్లాలో 188 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలుండగా ఇందులో 8,428 మంది సభ్యులున్నారు. ఇందులో 162 సంఘాల్లో 7,730 మంది, 26 మహిళా సంఘాల్లో 698 మంది సభ్యులున్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2017-18, 2018-19 సంవత్సరాలకుగాను జిల్లాకు రూ. 24.87 కోట్ల నిధులు మంజూరుకాగా ఈ పథకంద్వారా 1,771 మంది లబ్దిదారులకు టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాలు, 93 మందికి లగేజీ ఆటోలు, 464 మందికి ప్లాస్టిక్‌ ఫిష్‌క్రేట్స్‌, 34 మందికి మొబైల్‌ మార్కెట్ పరికరాలు, 114 మందికి వలలు, లైఫ్‌జాకెట్ల పంపిణీ చేశారు. మరికొందరికి పథకాలను వాహనాలు, సామగ్రిని అందించాల్సిఉంది. వీటితోపాటుగా 2016లో 168 చెరువుల్లో 49 లక్షల చేపపిల్లలను ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరఫరా చేయగా 2017లో 499 చెరువుల్లో 92.06 లక్షల చేపపిల్లలను వదిలారు. 2018లో 610 చెరువుల్లో 1.35 కోట్లవరకు చేపపిల్లలను వదలగా ఈ సంవత్సరం 621 చెరువులు, కుంటల్లో 1.88 కోట్ల చేపపిల్లలను వదలటం లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా కేంద్రంద్వారానూ అదనంగా నిధులు వస్తుండగా వివిధ రకాలైన పథకాలను మత్స్యకారుల నిమిత్తం అమలు చేస్తున్నారు.
* మత్స్యపారిశ్రామిక సహకార సంఘంలో సభ్యుడైతేనే ప్రభుత్వ రాయితీలు వర్తింపచేయాలి. ఈ క్రమంలో ఆయా చెరువులు, కుంటల విస్తీర్ణాన్ని బట్టి సభ్యుల సంఖ్య ఉండనుండగా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నూతన సభ్యులను తీసుకోవచ్చు. చనిపోయినవారు, వృద్ధుల స్థానంలో యువకులకు అవకాశం కల్పించవచ్చు. ఐతే సభ్యులుగా చేర్చడానికి గతంలో ఒక్కొక్కరి వద్దనుంచి రూ. 200 నుంచి 300 వరకు తీసుకుంటుండగా ప్రస్తుతం రూ.వెయ్యి నుంచి రూ. 1,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగినవారికి సభ్యత్వాన్ని నిరాకరిస్తుండటంతో చేసేదేమిలేక మత్స్యకారులు అడిగినంత ఇస్తున్నారు. ఇలాగే జగ్గాసాగర్‌కు చెందిన 50 మంది వ్యక్తులు మూకుమ్మడిగా లంచం ఇస్తూ ఇద్దరు అధికారులను అనిశాకు పట్టిచ్చారు.

అడిగినంత ఇవ్వకపోతే అంతే..
* జిల్లాలో 1,771 మందికి టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాలు ఇవ్వగా కొందరికి నేరుగా సరఫరా చేయగా మరికొన్ని సంఘాల పరిధిలో ప్రతి వాహనంనకు ఇంతచొప్పున తీసుకున్నారు. 93 మందికి లగేజీ ఆటోలను ఇవ్వగా వీరిలోనూ కొందరినుంచి ఆటోకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై వాహనాలు, సామగ్రిని ఇస్తుండటంతో పోటీ తీవ్రంకాగా ఇదే తరుణంలో అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించి లబ్ధిదారులనుంచి భారీగా వసూలు చేశారు. అడిగినంత ఇచ్చుకోని సంఘాలు, సభ్యులకు పథకాలను వర్తింపచేయకపోవటం లేదా ఆలస్యంగా ఇవ్వటం తదితరాలు చోటుచేసుకున్నట్లు మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గంగపుత్రులకు, ముదిరాజ్‌లకు జిల్లాలోని పలు చెరువుల్లో చేపలు పట్టుకునే హక్కుల విషయంలో గొడవలు తలెత్తటం, మత్స్యకారులకు, ముదిరాజ్‌లకు సభ్యత్వాలను ఇచ్చే విషయంలోనూ నిబంధనలకు నీళ్లొదిలి అధికారులు ఇష్టారీతిన వ్యవహరించి గొడవలకు దారితీసారనే విమర్శలున్నాయి.

చేప పిల్లల పంపిణీలోనూ.
ప్రభుత్వం ద్వారా కోట్ల సంఖ్యలో చేపపిల్లలను కొనుగోలు చేసి ఉచితంగా చెరువుల్లో వదులుతున్నారు. ఇదే తరుణంలో నిర్దేశిత పరిమాణం ఉన్నవి, తగిన సంఖ్యలోనే చెరువుల్లో వదలాలి. కానీ తక్కువ పరిమాణం ఉన్నవి, సంఖ్య తక్కువగా వదలటంతో మత్స్యకారులకు ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. సైజు చిన్నగా ఉన్నవాటిని కప్పలు, పెద్దచేపలు తినటం, వైరస్‌ వ్యాప్తితో చనిపోవడంతో నష్టం ఎక్కువగా ఉంటోంది. మరోవైపు సీజన్‌లో చేపపిల్లలను వదిలితేనే చక్కగా పెరుగుతాయి కానీ ఆలస్యంగా విడవటంవల్ల పెరుగుదల లేకపోగా చేపపిల్లల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. చేపపిల్లల సరఫరా, నాణ్యత, సంఖ్యను నిర్దేశించే అధికారులను గుత్తేదార్లు మచ్చిక చేసుకుని తమ పని కానిస్తుండటంతో మత్స్యకారులకు లబ్ధి పరిమితమవుతోంది. ఎదిగిన చేపలు కూడా చాలా సందర్భాల్లో పెద్దఎత్తున చనిపోతున్నా మత్స్యకారులను ఆదుకునే చర్యలుండటంలేదు, చేపలు చనిపోకుండా తీసుకునే జాగ్రత్తలను తెలపటంలోనూ ఉదాసీనత నెలకొంటోంది.

ఎక్కువగా ఎగుమతి
జిల్లాలో ఇసుక భూములు, ఎర్ర నేలలు, ఒండ్రు, నల్లనేలలు, గోదావరి నీటితో నిండే చెరువులు కుంటలుండటంతో వీటిల్లో పెరిగే చేపలు అత్యంత రుచికరంగా ఉండి పశ్చిమ బెంగాల్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. జిల్లాలో సాలీనా 4 వేల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతుండగా ప్రతి సీజన్‌లో వందలాది లారీల చేపలను మత్స్యకారులు ఎగుమతి చేస్తారు. ఐతే చేపల ఎగుమతికి మత్స్యకారులకు తగినంతగా ప్రోత్సాకం ఇవ్వకపోవటం, స్థానికంగా పూర్తిస్థాయి మార్కెట్ల సదుపాయం లేకపోవటంతో ఆర్థికంగా మిగులుబాటు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో చేపల పెంపక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దిల్లీకి చెందిన జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా జగిత్యాల జిల్లాకు నిరుడు రూ. 28 కోట్లవరకు ప్రత్యేక నిధులను కూడా మంజూరిచ్చినా ఈ పథకం అమల్లోనూ పదనిసలు చోటుచేసుకుంటున్నాయి. మత్స్యకారులకు బీమాను అమలు చేయటం, ప్రమాదాల్లో గాయపడినవారు, మరణించినవారికి పరిహారం రావటం తదితరాల్లో వెనకంజతో కుటుంబాలకు ఆర్థిక ఆసరా కొరవడుతోంది. ఈ నేపథ్యంలో సాక్షాత్తు జిల్లా అధికారి సహా కార్యాలయ సీనియర్‌ సహాయకుడు అనిశాకు పట్టుబడటం మత్స్యశాఖలోని అవినీతి తంతుకు పరాకాష్టగా నిలుస్తుండగా ఇకముందయినా మత్స్యకారులకు మేలు కలిగించే చర్యలను చేపట్టాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.