పాలమూరుకు జరమొచ్చింది! - Jogulamba - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

పాలమూరుకు జరమొచ్చింది!

ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసుల నమోదు

వైద్యానికి భారీగా ఖర్చు చేస్తున్న ప్రజలు

పారిశుద్ధ్య నిర్వహణ, అవగాహన కల్పించడంలో శాఖలు విఫలం

న్యూస్‌టుడే, వీరన్నపేట (మహబూబ్‌నగర్‌)

ఉమ్మడి జిల్లాను జ్వరాలు చుట్టుముట్టాయి.. ఏ ఇంట్లో చూసినా జ్వరం.. దగ్గు.. జలుబు బాధితులు కనిపిస్తున్నారు.. ఏ ఆస్పత్రి చూసినా జ్వరం బాధితులతో కిటకిటలాడుతోంది.. గ్రామాలు.. పట్టణాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది.. ఫలితంగా దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.. డెంగీ కేసుల నమోదు కూడా ఇటీవల పెరుగుతోంది.. దీనికి వైద్యం చేయించుకునేందుకు అధికంగా డబ్బులు అవసరం ఉండటంతో ప్రజలు అప్పు చేసి మరీ వైద్యం చేయించుకుంటున్నారు.. చాలా సంవత్సరాల తరవాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మెదడువాపు కేసు ఇటీవల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.. సమన్వయంతో పనిచేయాల్సిన వైద్య ఆరోగ్య.. పురపాలిక.. పంచాయతీరాజ్‌ శాఖలు ఎవరికెవరు పట్టనట్లుగా వ్యవహరించడం వల్లనే అనారోగ్యం బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరగడానికి కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..

మహబూబ్‌నగర్‌ : జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

ఈ ఏడాది డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రతిరోజు కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 206 డెంగీ కేసులతో పాటు తొమ్మిది మలేరియా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే చికున్‌గన్యా కేసుల నమోదు సంఖ్య కూడా పెరిగింది. నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ కేసులు నమోదు కాలేదు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో వివిధ రకాల జ్వరాల బాధితులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మోతీనగర్‌, షాసాబ్‌గుట్ట, వీరన్నపేట, బాయమ్మతోట, న్యూ గంజ్‌ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు వస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో సైతం అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతమైన నాగర్‌కర్నూల్‌ జిల్లా అప్పాపూర్‌లో మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్ధరణ అయినవి మాత్రమే. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దీనికి రెట్టింపు బాధితులు వస్తున్నారు.

జనరల్‌ ఆస్పత్రిలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

జ్వరం వస్తే వణుకు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సాధారణ జ్వరాలు, జలుబు, వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య వందల్లో ఉంది. జ్వరం వస్తే డెంగీ అని జంకుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వెంటనే ఆస్పత్రులకు వెళ్లి నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంతోపాటు ప్రధాన పట్టణలోని ముఖ్య ఆస్పత్రులు అన్నీ కూడా జ్వరం వచ్చిన బాధితులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో ప్రతి నెలా 4 వేల మంది జ్వరం బారిన పడితే ప్రస్తుతం 7 నుంచి 8 వేల మంది జ్వరాల బారిన పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా డెంగీతోపాటు సాధారణ జ్వరాల బాధితులు సైతం పెరుగుతున్నారు.

మహబూబ్‌నగర్‌ : రాంనగర్‌ పాఠశాల ముందు భాగంలో చెత్తాచెదారం

జేబులకు చిల్లు : జిల్లావ్యాప్తంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతుండటంతో పెద్ద సంఖ్యలో ఆస్పత్రులు.. ప్రయోగశాలలకు లాభాలు వస్తున్న పరిస్థితి ఉంది. ఆస్పత్రుల్లో ఫీజులు పెంచడంతోపాటు ప్రయోగశాలలకు అధిక మొత్తంలో పరీక్షల కోసం నమూనాలు వస్తున్నాయి. ప్రస్తుతం జ్వరం వచ్చిందని ఆస్పత్రికి పోతే మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి పరీక్షలు తప్పనిసరి చేయిస్తున్నారు. వీటితోపాటు ఎక్స్‌రే, ఈసీజీ తదితర పరీక్షలు సైతం రాస్తున్నారు. సాధారణ పరీక్షలు, మందులకు రూ.600 నుంచి రూ.3వేల ఖర్చవుతోంది. ఇక ఆస్పత్రిలో చేరితే రూ.6 వేల నుంచి రూ.30 వేల వరకు ఆస్పత్రి ఫీజు, ఇక ప్లేట్‌లెట్లు తగ్గితే వాటికి రూ.16 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. ఫలితంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు డెంగీ వైద్యం చేయించుకోవాలంటే కనీసం రూ.50 నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సమన్వయలోపం : పారిశుద్ధ్య లోపంతో ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పురపాలిక, పంచాయతీరాజ్‌, వైద్య, ఆరోగ్యశాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంది. సీజన్‌ కంటే ముందు సమన్వయ సమావేశాలు పెట్టి దిశానిర్దేశం చేసుకొని తరవాత వదిలేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది అసలు పట్టించుకోవడం లేదు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు పరిశీలించేందుకు వెళితే పరిసరాల్లో దోమలు, నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమ లార్వాలను గుర్తిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రై డే క్షేత్రస్థాయిలో పూర్తిగా చేయడం లేదు. మరో నెల రోజులు పరిస్థితులు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు మేలుకొని సమన్వయంతో పని చేయకుంటే బాధితుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. మురుగు కాలువలు శుభ్రం చేయడంతోపాటు అక్కడ బ్లీచింగ్‌ పౌడరు చల్లాల్సిన అవసరం ఉంది. దోమలు పెరగకుండా ఫాగింగ్‌, ఆయిల్‌ బాల్స్‌ వంటి వాటిని కాల్వలు, నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో వేయాలి. ఫలితంగా దోమలు పెరిగేందుకు అసలు అవకాశం ఉండదు. ప్రజలు సైతం ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వకుంటే జ్వరాల బారిన పడాల్సి ఉంటుంది.

వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం

గద్వాల పట్టణం : వరదల ప్రభావంతో ప్రజలు అనేక రోగాల బారినపడే ప్రమాదం ఉంది. వాటి నివారణ కోసం అయిదు బృందాలను నియమించి పర్యవేక్షిస్తున్నాం. సీజనల్‌ వ్యాధులపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. క్షయ, రోటా వైరస్‌, కుష్ఠు వ్యాధులపై ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలతో సర్వే చేయిస్తున్నాం.

- డా.రాజేంద్రకుమార్‌, జిల్లా వైద్యాధికారి, జోగులాంబ గద్వాల

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.