పరుగుతో పదుగురికి ఆదర్శం - Hyderabad - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

పరుగుతో పదుగురికి ఆదర్శం

ఒకరు టీ క్రెడాయ్‌ అధ్యక్షుడు
ఇంకొకరు ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ ఇండియా ప్రతినిధి
ఈనాడు, హైదరాబాద్‌

హాఫ్‌ మారథాన్‌.. 21.097 కి.మీ. దూరం.. ఎంతో సాధన చేస్తే తప్ప ఈ పరుగు పూర్తిచేయడం కష్టం.. వృత్తి, వ్యాపారంలో తీరిక లేకున్నా.. విజయం సాధించాలంటే ఫిట్‌నెస్‌ ముఖ్యమని వారు గుర్తించారు. హాఫ్‌ మారథాన్‌ను సవాల్‌గా తీసుకుని పూర్తి చేశారు తెలంగాణ క్రెడాయ్‌ అధ్యక్షుడు జి.రాంరెడ్డి. కళ్లు కనిపించపోతే అడుగు కూడా ముందుకు పడదు.. అలాంటిది ఎవరి చేయిపట్టుకోకుండా ఏడాదిలో డజను సార్లు 10కె పరుగుల్లో పాల్గొన్నారు అంధుడైన మహ్మద్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌. కోల్‌కతాకు చెందిన ఈయన రియల్టర్ల జాతీయ సదస్సులో పాల్గొనడానికి నగరం వచ్చారు. వీరు తమ పరుగులతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ బాటలో వీరిద్దరి ప్రస్థానం.. సంబంధిత విశేషాలు వారి మాటల్లోనే..


అంధుడైనా ఆత్మ విశ్వాసమే తోడుగా..
ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌

కొన్నేళ్ల కిందట నా బరువు 108 కిలోలు. అధిక బరువుతో రక్తపోటు సమస్య వచ్చింది. ఆరోగ్య రీత్యా పరుగు మొదలెట్టాలనుకున్నాను. 16 ఏనే పూర్తిగా కళ్లు కనిపించకుండా పోయిన నేను ఎలా పరుగెత్తేది.. ఎవరైనా సాయం చేస్తారా? శిక్షణ ఇస్తారా..! అని సామాజిక మాధ్యమాల్లో అడిగినా పెద్దగా ఎవరూ స్పందించలేదు. చివరికి బిస్వజిత్‌ గుడియా, దేవేంద్రసింగ్‌లు నాకు ధైర్యాన్నిచ్చారు. ఎవరి సాయం లేకుండానే ఎలా పరుగెత్తవచ్చో చెప్పారు. మొదట 50 మీటర్లతో మొదలెట్టాను. క్రమంగా 100 మీటర్లకు.. తర్వాత కిలోమీటరు, ఐదు కిలోమీటర్లకు పెంచుకుంటూ పోయాను. ఈ ఏడాదిలో 12సార్లు 10కె పరుగులు పూర్తిచేశాను. హాఫ్‌ మారథాన్‌ ఎవరి చేయి పట్టుకోకుండా ఒక్కడినే పూర్తిచేయగలను. కోల్‌కతా 25కెలో పాల్గొన్నాను. పరుగెత్తడంలో నా సామర్థ్యం చూసి సచిన్‌ మెచ్చుకున్నారు. 40ఏళ్లున్న నేను ఫిట్‌గా ఉండేందుకు పరుగుతో ప్రయత్నిస్తున్నాను. నా స్నేహితుడు 32 ఏళ్ల వయసులో గుండె ఆగి చనిపోయారు. ఫిట్‌నెస్‌ గురించి పట్టించుకోకపోవడమే తన ప్రాణంమీదకు తెచ్చింది. ఈ ఘటన కూడా నేను ఆరోగ్యంపై దృష్టిపెట్టడానికి కారణమైంది. 108 కిలోల బరువు నుంచి 94 కిలోలకు తగ్గాను. 85 కిలోలకు తగ్గాలనేది నా లక్ష్యం. మారథాన్లలో నా పక్కన అటూ ఇటు ఒక్కొక్కరూ పరుగెత్తుతూ ముందు వచ్చేవాటి గురించి చెబుతుంటారు. వాటి ఆధారంగా పరుగును పూర్తిచేస్తుంటాను.


సవాల్‌గా తీసుకుని..
తెలంగాణ క్రెడాయ్‌ అధ్యక్షుడు జి.రాంరెడ్డి

త నవంబరు నుంచి పరుగుల్లో పాల్గొనడం మొదలయ్యింది. యోగా, ధ్యానం చేయడం అలవాటు. మా యోగా మాస్టారు 12.5కె పరుగులో పాల్గొంటారా అని అడిగినప్పుడు సరే అన్నాను. నిత్యం ఉదయం నడిచే అలవాటు ఉన్న నాకు పరుగు పెద్దగా కష్టం అనిపించలేదు. 12.5 కె పరుగు 1.15 గంటల్లో పూర్తిచేశాను.  తర్వాత 10కె పరుగులో పాల్గొన్నాను. 1.20 గంటలు పట్టింది. ఆదివారం జరిగిన హాఫ్‌ మారథాన్‌ సవాల్‌గా తీసుకుని బరిలో దిగాను. పరుగు కొద్దిరోజులు ముందు క్రెడాయ్‌ సదస్సు ఇజ్రాయెల్‌లో జరగడం, తెలంగాణ శాఖనే నిర్వహించడం, తర్వాత ఇతరత్ర కార్యక్రమాలతో తీరిక లేకుండా ముందు సాధన చేయలేకపోయాను. 21 కిలోమీటర్లు పూర్తిచేస్తానా లేదా అనే సందేహంతోనే బరిలోకి దిగాను. ఫుల్‌ మారథాన్‌లో అర్హత సాధించాలంటే హాఫ్‌ మారథాన్‌ను 3.15 గంటల్లో పూర్తిచేయాలి. నేను 3.07 గంటల్లోనే పూర్తిచేశాను. ఈ పరుగుతో విశ్వాసం పెరిగింది. వ్యాపారమైనా.. మరేదైనా విజయం సాధించాలంటే ఫిట్‌నెస్‌ ముఖ్యం. చాలా మంది తీరిక లేక వ్యాయామం చేయలేకపోతున్నాం.. అంటుంటారు. వారందరికి ఇలాంటి పరుగులు స్ఫూర్తినిస్తాయి. 56 ఏళ్ల వయసులో నేను హాఫ్‌ మారథాన్‌ పూర్తిచేయడం నా బంధువులు, స్నేహితులు, నా ఉద్యోగులు, ఇతరులకు ఎందరికో స్ఫూర్తి అవుతుంది. చాలా విధాలుగా నా జీవితంలో ఇది ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో మారథాన్లలో మా ఉద్యోగులు పాల్గొనేలా చేస్తాను.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.