మెట్రోలో హాయ్‌.. హాయ్‌ - Hyderabad - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

మెట్రోలో హాయ్‌.. హాయ్‌

ఆశ్చర్యపరుస్తోన్న ప్రముఖులు
ప్రయాణానికి తారలు, నేతల ఆసక్తి
ఈనాడు, హైదరాబాద్‌

* గత ఏడాది ఆగస్టు నాటికి నిత్యం మెట్రో ప్రయాణికులు లక్ష వరకు ఉండేవారు. ఇటు ఎల్‌బీనగర్‌, అటు హైటెక్‌సిటీ వరకు అందుబాటులోకి రావడం.. రెండు కారిడార్లు పూర్తి కావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
* ప్రస్తుతం రోజూ వెళ్లేవారి సంఖ్య 3 లక్షలకు చేరింది.
* రాయదుర్గం స్టేషన్‌, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ వరకు మార్గం ఈ ఏడాది ఆఖరుకు పూర్తయితే ప్రయాణికుల సంఖ్య 4 లక్షల మార్కును చేరుకునే అవకాశం ఉంది.

మీరు మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓ స్టేషన్‌లో మీరు ఉన్న కోచ్‌లోకి ప్రముఖ సినీ నటుడు ఎక్కొచ్చు. ఏ అసెంబ్లీ వద్దనో శాసనసభ్యులు ఎక్కి కొంత దూరం తామూ రావొచ్చు. ఓ ఎంపీ లేదా ఉన్నతాధికారి ప్రయాణికుల్లో కలిసి కనిపించొచ్చు. అవును.. ఇప్పుడు అనేకమంది ప్రముఖులు సైతం అడపాదడపా ఈ రైలును ఎంచుకుంటున్నారు. మహానగరంలో ట్రాఫిక్‌ రద్దీ నుంచి తప్పించుకుని త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి ఉన్న మార్గం మెట్రో అన్న సంగతి తెలిసిందే. నగరవాసులు క్రమంగా సొంత వాహనాలను వదిలి దీనిలో ప్రయాణానికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు తోడవుతున్నారు.

కొద్దిరోజుల క్రితం భారీ వర్షం కురిసి ఐటీ కారిడార్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. కార్లను రోడ్డు పక్కన నిలిపి కొందరు మెట్రోలో వెళ్లిపోయారు. ట్రాఫిక్‌జాం బారిన పడినవారిలో హీరో నితిన్‌ ఉన్నారు. తన కారు ఎంతకూ ముందుకు కదలకపోవడంతో పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌కు వెళ్లి రైలు ఎక్కి ఆయన గమ్యస్థానం చేరుకున్నారు. ఇటీవల నారా బ్రాహ్మణి తన కుమారుడితో కలిసి జూబ్లీహిల్స్‌ మెట్రో స్టేషన్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు. హీరోయిన్‌ రష్మిక ఈనెల 14న ప్రయాణించినవారిలో ఉన్నారు. ఇక సినిమాల చిత్రీకరణలు మెట్రోలో సాధారణమయ్యాయి. హీరో హీరోయిన్ల ప్రయాణ, ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం..
ట్రాఫిక్‌ రద్దీ నుంచి తప్పించుకునేందుకు కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రయాణించారు. ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌ తాను హాజరయ్యే కార్యక్రమం ఉన్న ప్రాంతానికి మెట్రో సదుపాయం ఉంటే అందులోనే వెళ్తుంటారు.

మూడింతలు పెరిగారు..
మెట్రోరైలు ప్రయాణం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఒకటే. ఎవరైనా మూడు కోచ్‌లలో వెళ్లాల్సిందే. సీటు ఉంటే కూర్చోవడం లేదంటే నిలబడడం. ఏ స్టేషన్‌ నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా 5 నిమిషాల్లోనే మెట్రో వస్తుంది. ఎదురుచూపులు చాలా వరకు తగ్గాయి. ఏడాది వ్యవధిలో ప్రయాణికుల సంఖ్య మూడురెట్లు పెరిగింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.