అడుగుకో గుంత.. తీరదీ చింత - Bhadradri - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

అడుగుకో గుంత.. తీరదీ చింత

● ఉభయ జిల్లాల్లో అధ్వానంగా ప్రధాన రహదారులు

● మరమ్మతులు చేసినా మూణ్నాళ్ల ముచ్చటే

● ప్రజలకు తప్పని అవస్థలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి నుంచి తాళ్లపాయ వెళ్లే రోడ్డు దుస్థితి ఇదీ. ఈ రహదారిపై ప్రయాణం చేసే వాహన చోదకులు ఏ మాత్రం ఏమరుపాటు వహించినా ప్రమాదం ఖాయం. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణం. ఇలాంటి రోడ్లపై ప్రయాణం నిత్యం నరకప్రాయంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రోడ్లు జిల్లాలో కోకొల్లలు.



పేరు పనులు నిధులు

ఆర్‌అండ్‌బీ 37 రూ.566.36 కోట్లు

తీ.ప్ర.ప్రా.ని. 21 రూ.274.36 కోట్లు

(తీవ్రవాద ప్రభావిత ప్రాంత నిధులు)


ఖమ్మం జిల్లాలో.. రెండు వరసల రహదారులను నాలుగు వరసలుగా మార్చేందుకు రూ.55 కోట్లు మంజూరయ్యాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసే సింగిల్‌ లైన్‌ రహదారులను డబుల్‌లైను రహదారులుగా విస్తరింపజేసేందుకు రూ.26.50 కోట్లతో 18.22 కి.మీటర్ల పని చేశారు.

పేరు పనులు నిధులు

ఆర్‌.డి.ఎఫ్‌ 27 రూ.91.69 కోట్లు

నాబార్డు 05 రూ.26.05 కోట్లు

కొత్తగూడెం 60


సత్తుపల్లి బస్టాండ్‌ నుంచి కిష్టారం వైపు వెళ్లే రాష్ట్రీయ రహదారి దుస్థితి ఇదీ. ఖమ్మం నుంచి ఆశ్వారావుపేట వరకు నిత్యం వందలాది సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఏ మాత్రం ఆదమరిచినా ప్రమాదంలో పడినట్లే. ఏటా వర్షాకాలంలో సమస్య తీవ్రంగా ఉంటోంది. నామమాత్రంగా మరమ్మతులు చేపడుతుండడంతో వాహనదారులకు, ప్రయాణికులకు అవస్థలు తప్పడంలేదు.


ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా మరమ్మతులు చేస్తున్నా.. మూణ్నాళ్ల ముచ్చటే అవుతోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రోడ్లు వేసినట్లే బీటీ లేచిపోతుంది. గతేడాది ఖమ్మం నుంచి తల్లాడ వరకు, తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు, ఖమ్మం నుంచి తిరుమలాయపాలెం మీదుగా రోడ్డు వేశారు. ఆ రోడ్లు ఆరు నెలలు కూడా తిరక్కుండానే పలుచోట్ల గుంతలమయంగా మారాయి. ఖమ్మం-తిరుమలాయపాలెం రహదారి పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. దానిని తాత్కాలిక మరమ్మతులు చేయాల్సిందిపోయి.. ఏకంగా రోడ్డును పూర్తి స్థాయిలో పెకిలించి వేశారు. ఇల్లెందు నుంచి టేకులపల్లి మీదుగా పాల్వంచ వరకు కూడా ఏడాదిన్నర కిందట రహదారి నిర్మించారు. ప్రస్తుతం ఆ దారి గుంతలమయంగా మారడంతో రాకపోకలకు అవస్థలు తప్పడంలేదు. ఎక్కడ ఏ గుంత వచ్చి బతుకును తలకిందులు చేస్తుందోనని వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఖమ్మం నుంచి ఇల్లెందు వరకు రహదారిని కూడా సుమారు ఏడాది కిందట నిర్మించగా అనతికాలంలో అధ్వానంగా మారింది. ఈ దారిని కూడా పూర్తి స్థాయిలో పెకిలించి మళ్లీ కొత్త రహదారిని వేశారు. ప్రస్తుతం వేసిన రహదారిపై కూడా గుంతలు దర్శనమిస్తున్నాయి.

సమన్వయలోపం.. రోడ్లకు శాపం..

శాఖల మధ్య సమన్వయలోపం కూడా రహదారులు అధ్వానంగా తయారవ్వడానికి కారణమవుతోంది. పరిమితికి మించిన బరువుతో వాహనాలు రహదారులపై పరుగులు పెడుతుండడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా గ్రానైట్‌ రాయి కారణంగా ఈ దుస్థితి దాపురించింది. రోజుకు సుమారు 500కు పైగా లారీలు కరీంనగర్‌, వరంగల్‌ వయా ఖమ్మం మీదుగా రాజమండ్రికి తరలివెళ్తున్నాయి. భారీ వాహనాలు మోతాదుకు మించి రాయిని రవాణా చేస్తున్నప్పటికీ రవాణాశాఖ అధికారులు స్పందించరు. ఈ చూసీచూడని ధోరణిలో ఆంతర్యం అంతుపట్టదు. డీటీవో కార్యాలయానికి కేవలం 50 మీటర్ల దూరం నుంచే నిత్యం బాహ్యవలయ రహదారి నుంచి సామర్థ్యానికి మించి లారీల్లో గ్రానైట్‌ లారీలు వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. దీనికితోడు నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడం కూడా రోడ్లు అధ్వానంగా మారడానికి కారణమవుతున్నాయి.


ప్రతిపాదనలు పంపించాం

రాజేశ్వరరెడ్డి, ఈఈ ఆర్‌అండ్‌బీ

ఇల్లెందు నుంచి హైదరాబాద్‌ వరకు జాతీయ రహదారి మంజూరైంది. ఈ మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం లేదు. భద్రాచలం నుంచి కొత్తగూడెం వరకు ఇప్పటికే జాతీయ రహదారి నిర్మాణం పూర్తయ్యింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసే రహదారుల్లో కొన్నిచోట్ల గుంతలు పడి ఉన్నాయి. వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే వర్షాలు తగ్గిన తర్వాత రహదారి పనులు చేపడతాం.


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.