ప్రయాణ, బీమా కంపెనీలకు జరిమానా - Hyderabad - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ప్రయాణ, బీమా కంపెనీలకు జరిమానా

వినియోగదారుల ఫోరం-1  తీర్పులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వినియోగదారుడికి చుక్కలు చూపిస్తున్న కంపెనీలపై ఫోరం-1 మొట్టికాయలు వేసింది. అపరాధ రుసుము వేసి వినియోగదారుడికి న్యాయం చేసింది. అఖిల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు రూ.50,000 యూబీ ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.10,000 జరిమానా విధించి వినియోగదారుడికి సాంత్వన కలిగించింది.

అఖిల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు...
సేవల్లో లోపం కలిగించడంతో పాటు రద్దు చేసుకున్న టిక్కెట్టు ధరను తిరిగి వినియోగదారుడికి చెల్లించనందుకు అఖిల్‌ ఇంటర్నేషనల్‌ (ఇండియా) సంస్థకు రూ.50,000 జరిమానా విధిస్తూ హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం-1 తీర్పును వెలువరించింది. ఫిర్యాదుదారు జాషువా సింగపూర్‌ ప్రయాణానికి టిక్కెట్లు బుక్‌ చేసేందుకు అఖిల్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. ఇందుకోసం 7489.66 డాలర్లు (సుమారు రూ.5,01,617) క్రెడిట్‌కార్డు ద్వారా చెల్లించారు. అయితే డూప్లికేట్‌ బుక్కింగ్‌ వల్ల టిక్కెట్లు రద్దు చేస్తున్నటు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి ఫిర్యాదుదారుకు సందేశం వచ్చింది. దీంతో తాను చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఫిర్యాదుదారు అఖిల్‌ ఇంటర్నేషన్‌ సంస్థను కోరారు. రెండు నుంచి నాలుగు వారాల్లో పూర్తి సొమ్ము తిరిగి చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అయితే కొద్దిరోజుల తర్వాత 650 యూఎస్‌ డాలర్లు మాత్రమే రీఫండ్‌ అయ్యాయి. మిగిలిన డబ్బుల కోసం ఫిర్యాదుదారు ప్రతివాద కంపెనీని సంప్రదిస్తే పెద్దగా స్పందించలేదు. దీంతో ఫిర్యాదుదారు, వినియోగదారుడు హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం-1ను ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న ఫోరం ఫిర్యాదుదారుడికి సానుకూలంగా తీర్పును వెలువరించింది. టిక్కెట్టు ధరకు సమానమైన డబ్బు రూ.5,00,000 12శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.50,000 ఇతర ఖర్చులకు రూ.5,000 చెల్లించాలని ఫోరం అధ్యక్షులు పి.విజేందర్‌, సభ్యులు డి.నిర్మలతో కూడిన బెంచ్‌ ప్రతివాదులను ఆదేశించింది.

యూబీ ఇన్సూరెన్స్‌ కంపెనీకి...
సేవల్లో లోపం కలిగించడంతో పాటు రావాల్సిన క్లెయిమ్‌ను చెల్లించడంలో ఇబ్బందులకు గురిచేసినందుకు యూబీ ఇన్సూరెన్స్‌ కంపెనీకి వినియోగదారుల ఫోరం-1 రూ.10,000 జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే... ఫిర్యాదుదారుడు ఎం.కృష్ణమోహన్‌రావు రూ.62,500 చెల్లించి మూడో ప్రతివాది అయిన బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో యాపిల్‌ 6ఎస్‌ చరవాణిని 2015లో కొనుగోలు చేశారు. అదే సమయంలో మొదటి ప్రతివాది యూబీ ఇన్సూరెన్స్‌ కంపెనీలో చరవాణికి బీమా చేయించారు. పది రోజుల తర్వాత ప్రమాదవశాత్తు చరవాణి రోడ్డుపై పడి మరమ్మతులకు గురైంది. దీంతో ఫిర్యాదుదారు తనకు కొత్త చరవాణి కావాలంటూ బీమా కంపెనీ చుట్టూ తిరిగారు. సంబంధించిన పత్రాలను వారికి అందజేశారు. ‘టోటల్‌ లాస్‌, హాండ్‌సెట్‌ రిప్లేస్‌మెంట్‌ బేసిస్‌’తో రూ.18,939 చెల్లించనున్నట్టు బీమా కంపెనీ కృష్ణమోహన్‌రావుకు తెలిపింది. అయితే డబ్బులు చెల్లించకపోవడంతో పాటు దానికి సంబంధించిన ప్రక్రియ గురించి తెలపకపోవడంతో ఫిర్యాదుదారుడు పలుమార్లు బీమా కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా పెద్దగా స్పందించలేదు. దీంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదుదారు వాదనలను ఖండించిన ప్రతివాద కంపెనీ అందుకు గల కారణాలను వివరిస్తూ రాత పూర్వకంగా లేఖను ఫోరానికి సమర్పించింది. ఇరువురి వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం-1 వినియోగదారుడికి చెల్లించాల్సిన రూ.18,939తో పాటు సేవల్లో లోపానికి పరిహారంగా రూ.10,000 ఖర్చులకు రూ.3,000 చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.