close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

నగరానికి జ్వరమొచ్చింది!

సెలవు రోజుల్లోనూ ఓపీ ఆసుపత్రులు కిటకిట
వైరల్‌, డెంగీ లక్షణాలతో తీవ్ర అస్వస్థత
ఈనాడు, హైదరాబాద్‌

జ్వరం.. ఒళ్లు నొప్పులు.. తలనొప్పి లక్షణాలు కన్పిస్తే చాలామంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలో ఎక్కువ శాతం డెంగీ కేసులు నమోదు కావడంతో చాలామంది అదే అనుమానంతో జ్వరం వస్తే చాలు...వైద్యులను సంప్రదిస్తున్నారు. పరీక్షలు చేయించుకుంటున్నారు. గాంధీ, ఉస్మానియాలలో చెరో వేయి పడకలు వరకు ఉన్నాయి. ఈ రెండు ఆసుపత్రులలో కలిపి ప్రస్తుతం నిత్యం 4-5 వేల వరకు ఓపీ ఉంటోంది. ఓపీ చీటీ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్‌పేషెంట్‌ సేవలు ఉండవు. కేవలం అత్యవసర కేసులను మాత్రమే తీసుకుంటున్నారు. రోగుల తాకిడి  ఎక్కువ ఉండటంతో ఆదివారం కూడా ఓపీ సేవలు అందించడం గమనార్హం. ఫీవర్‌ ఆసుపత్రిలో 600, నిలోఫర్‌లో 285, ఉస్మానియా, గాంధీలో 100 మందికి చికిత్సలు చేశారు. ఇక నుంచి ప్రతి ఆదివారం కూడా ఓపీ సేవలు అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు నగరంలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 300 పడకల వరకు ఉన్నాయి. ఇవన్నీ నిండిపోవడంతో ఇతర శాఖలకు పంపుతున్నారు. సోమజిగూడలోని మరో ఆసుపత్రిదీ ఇదే పరిస్థితి. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వస్తున్న రోగులను పడకలు లేక తిప్పి పంపుతున్నారు. ఆసుపత్రిలో చేరాలంటే నిరీక్షించాలని సూచిస్తున్నారు. ఎక్కువ శాతం మందిలో జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఇతర లక్షణాలు కన్పిస్తున్నాయి.

డెంగీ బెంగ ఎక్కువ... గ్రేటర్‌వ్యాప్తంగా డెంగీ జ్వరాలతో చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దోమలు పెరగడంతో అన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియాలతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. తలనొప్పి, జ్వరం వస్తే చాలామంది డెంగీగా అనుమానపడుతున్నారు. వైరల్‌ జ్వరంలో కూడా ఇలాంటి లక్షణాలు కన్పిస్తాయి. అయినా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో డబ్బు ఖర్చు అయినా వెనక్కి తగ్గడం లేదు. డెంగీ నిర్ధారణకు ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ రాపిడ్‌ పరీక్ష చేస్తారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఈ పరీక్షకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ టెస్టుతోనే డెంగీ ఉన్నట్లు పూర్తిగా నిర్ధారించకుండా ఐజీఎం ఎలీసా పరీక్ష కూడా చేయాలి. అయితే ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌తోనే డెంగీగా నిర్ధారిస్తున్నారు. వైరల్‌ జ్వరాలు రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతున్నాయి. కొన్ని లక్షణాలు డెంగీ మాదిరిగా కన్పిస్తుంటాయి. అయినా రోగులు ఒత్తిడి ఇతర కారణాలతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ పరీక్షలు చేస్తూ రోగుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. డెంగీ నిర్ధారణ అయి.. నాలుగైదు రోజులపాటు చికిత్స పొందాలంటే రూ.40-50 వేలు వరకు వసూలు చేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు డెంగీ సోకితే కొంత క్లిష్టంగా మారుతోంది. కొందరిలో ప్లేట్‌లెట్సు పూర్తిగా పడిపోతాయి. ఇలాంటి వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలంటే ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. చికిత్స కోసం రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడ?.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని ఆసుపత్రులు వైద్య ఆరోగ్యశాఖ కిందకు రావడంతో అధికారుల మధ్య సమన్వయం లోపిస్తోంది. డెంగీ కేసులపై స్పష్టత ఉండటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు అవుతున్న రోగుల సంఖ్య మాత్రమే ఆయా వైద్య ఆరోగ్యశాఖల వద్ద సమాచారం ఉంటోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదు అవుతున్న కేసులపై అధికారులకు ఎలాంటి సమాచారం అందడం లేదు. డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్న రోగి నుంచి రెండో శాంపిల్‌ సేకరించి దానిని నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌(ఐపీఎం)కు పంపాలి. ఈ ప్రయత్నం జరగడం లేదు. ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖలు జీహెచ్‌ఎంసీతో సమన్వయం చేసుకుంటూ దోమల నివారణ, సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఇంట్లో ఒకరికి డెంగీ సోకితే మిగతా సభ్యులతోపాటు పరిసరాల్లో నివసించే వారందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలి. నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి పక్కాగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.