ప్రపంచ క్రీడా పథాన.. స్వర్ణ సింధూరం - Hyderabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

ప్రపంచ క్రీడా పథాన.. స్వర్ణ సింధూరం

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్య నగరం పులకించింది.. నగరానికి చెందిన పీవీ.సింధు బ్యాడ్మింటన్‌ ఫైనల్‌ ఆడుతోందని తెలిసిన నగర ప్రజలు మధ్యాహ్నం నుంచి టీవీలకు అతుక్కుపోయారు. బెబ్బులిలా మైదానంలో విజృంభిస్తుంటే.. అంతే ఉత్కంఠగా తిలకించి.. సింధు విజయాన్ని ముద్దాడిన వేళ.. నగరం కేరింతలు కొట్టింది. బ్యాడ్మింటన్‌ క్రీడకు హైదరాబాద్‌ చిరునామా అంటూ మురిసింది. బ్యాడ్మింటన్‌లో భాగ్యనగరానికి తిరుగులేదని రుజువు చేసిన సింధును మనస్ఫూర్తిగా అభినందించింది. ఒలింపిక్స్‌లో రజతం గెల్చి నగర కీర్తి    పతకాన్ని ఎగురవేసిన పీవీ.సింధు మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సరి కొత్త చరిత్ర సృష్టించడంతో హైదరాబాద్‌ పేరు విశ్వవ్యాప్తమైంది. సింధు గెలుపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విజయం అనంతరం ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కోకాపేటలోని నివాసంలో ఉన్న సింధు తల్లి విజయ, అమ్మమ్మలు.. ఆమె మ్యాచ్‌ గెలవగానే ఒకరినొకరు అభినందించుకుంటూ మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింధు తల్లి మాజీ వాలీబాల్‌ క్రీడాకారిణి పి.విజయ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడుతూ.. సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.   చాలా అద్భుతంగా ఆడి టైటిల్‌ కైవసం చేసుకుందన్నారు. ఈ టోర్నీ కోసం ఆరు నెలలుగా ఎంతో సాధన చేసింది.. ఆ ఫలితమే విజయం. క్వార్టర్‌ఫైనల్‌లో గెలవడం టర్నింగ్‌ పాయింట్‌ అనుకుంటున్నా.. మొదటి సెట్‌లో సరిగ్గా ఆడకపోయినా పుంజుకుని మ్యాచ్‌ గెల్చుకుంది.. అని అన్నారు. మ్యాచ్‌ ముందు ప్రతిరోజూ తాను ఫోన్‌లో మాట్లాడుతున్నానని, పాయింట్లలో వెనుకబడినా ఆత్మవిశ్వాసంతో ఆడమని మాత్రమే సలహా ఇచ్చేదాన్ని అని తెలిపారు. సింధు అపురూపమైన విజయంతో వారి ఇంటి వద్ద, శిక్షణ పొందిన గచ్చిబౌలిలోని అకాడమీలో సందడి నెలకొంది.

శిక్షణ ఇక్కడే..  సింధు పుట్టి పెరిగింది నగరంలోనే. అమ్మానాన్నలిద్దరూ వాలీబాల్‌ క్రీడాకారులైనా ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ కప్‌ గెలిచిన పుల్లెల గోపీచంద్‌ విజయం అందించిన స్ఫూర్తితో బ్యాడ్మింటన్‌ ఆటను ఎంచుకుంది. ఎనిమిదేళ్ల నుంచే సాధన మొదలెట్టింది. గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందుతూ వరుస విజయాలతో తోటి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతోందీ క్రీడా ఆణిముత్యం. ఒకవైపు ఆటలో రాణిస్తూనే మెహిదీపట్నంలోని సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌లో కామర్స్‌లో బ్యాచులర్‌ డిగ్రీ పూర్తిచేసిన సింధు టోర్నీలు లేని సమయాల్లో తను చదివిన కళాశాలను సందర్శిస్తుంటారు.

బోనాలు..  ఆటతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను అంతే ప్రేమిస్తారు సింధు. నగరంలో జరిగే అమ్మవారి బోనాల్లో కచ్చితంగా పాల్గొని సికింద్రాబాద్‌ ఉజ్జయిన మహంకాళి, లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని బంగారు బోనం సమర్పిస్తుంటారు. ఈ ఏడాది అమ్మవారి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సు ఉంటే తానింకా బాగా ఆడతానని, గత నెలలో అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా ఆమె చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లో..  సామాన్య క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చి అసామాన్య విజయాలు అందుకుంటున్న పీవీ.సింధుపై నెటీజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.