close

ఆదివారం, జనవరి 19, 2020

ప్రధానాంశాలు

సంపాదకీయం

ఊహల్లో దొ(ధ)నకొండ!

పెట్టుబడిదారుల పరుగులు

పేదల భూములకు బేరసారాలు

వారం వ్యవధిలో ధరలకు రెక్కలు

దొనకొండలో ఇటీవల వెలిసిన స్థిరాస్తి వెంచర్‌

అవన్నీ బీడు భూములు... కరవు బారిన పడిన రాతి నేలలు... సమీపంలో నీటి నీడ కూడా లేదు. వారం రోజులుగా ఈ భూములపై పలువురి కన్ను పడింది. ఏవో నిక్షేపాలున్నట్టుగా పెట్టుబడిదారులు కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ.... భూముల విషయాలు ఆరా తీస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో దొనకొండ ధనకొండగా మారిపోయింది...దొనకొండ చుట్టూ ఉన్న పల్లెల్లో ఎకరం ధర వారం కిందట రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలు ఉండగా.., ప్రస్తుతం రూ. 25 లక్షలకు చేరింది... ప్రధాన దారుల పక్కన వారం కిందట ఎకరం రూ. 15 లక్షల నుంచి రూ. 18 లక్షలు ఉండగా..., ప్రస్తుతం రూ. 40 లక్షల నుంచి రూ. 55 లక్షలు పలుకుతోంది... ప్రభుత్వం రాజధానిని దొనకొండకు మారుస్తుందన్న ఊహాగానాలు, వదంతులే ఈ పరిస్థితికి కారణం.

- ఈనాడు డిజిటల్‌, ఒంగోలు; న్యూస్‌టుడే, దొనకొండ

దొనకొండలో ప్రస్తుతం స్థిరాస్తి వెంచర్లు బాగా పెరుగుతున్నాయి. ఆరేడేళ్ల కిందట కూడా ఇక్కడ రాజధాని వస్తుందన్న అంచనాతో వెంచర్లు విపరీతంగా వేశారు. కానీ 2015 నుంచి పరిస్థితులు మారుతూ స్థిరాస్తి వ్యాపారం పెద్దగా సాగలేదు. వేసిన వెంచర్లు అలాగే ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గత అయిదేళ్లలో దొనకొండ మండలంలో 500 ఎకరాల వరకు కొనుగోలు చేశారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిస్థితి మారింది. వ్యాపారానికి ఊపొచ్చింది. గత రెండు నెలల్లో 200 ఎకరాల భూములను ప్లాట్లుగా మార్చారు. ఇండ్ల చెరువులో 100 ఎకరాల మేర వెంచరు వేశారు. ప్రస్తుతం వీటికి బేరసారాలు గట్టిగా నడుస్తున్నాయి. మండలంలో ఎటు చూసినా వెంచర్లే కనిపిస్తున్నాయి. సాధారణంగా రెండున్నర సెంట్ల స్థలం గతంలో రూ. 3 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ. 5 లక్షలకు చేరింది. వారం రోజులుగా వీటిని పరిశీలించే వారు పెరిగారు. ప్రస్తుతం మరో 300 ఎకరాల్లో కొత్తగా వెంచర్లు వేసేందుకు పెట్టుబడి దారులు సిద్ధమవుతున్నారు.

 

ప్రముఖుల ఆరా

దొనకొండ సమీపంలో భూముల కొనుగోలుకు ప్రముఖులు సైతం ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. జిల్లాలోనే ఓ అధికారి బంధువు ఈ సమీపంలో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో అధికారి ఇప్పటికే నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. రాజకీయంగానూ నంద్యాల, కడప ప్రాంతాలకు చెందిన కొందరు ముఖ్య నాయకులు భూములు కొనేందుకు ఈ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు. రూ. 10 లక్షలు కూడా వస్తుందో లేదో అనుకున్న కొందరు పేద రైతులకు అధిక ధరలు ఆశ చూపి... భూములను బేరమాడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ ప్రాంతంలో కొనేందుకు వారి అనుచరుల ద్వారా క్షేత్ర పరిశీలన చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

 

గత ప్రభుత్వ హయాంలో...

దొనకొండ మండలంలో 80 వేల ఎకరాల భూమి ఉంది. అందులో 2016 సంవత్సరంలో 21 గ్రామాల్లో పరిశ్రమలు పెట్టేందుకు 25,100 ఎకరాలు కేటాయించారు. బ్రిటిష్‌ కాలం నుంచే ఎంతో పేరున్న ఈ ప్రాంతంలో పరిశ్రమలకు అనుకూలమని గత ప్రభుత్వ హయాంలోనే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పారిశ్రామిక వాడ కోసం పాతిక వేల ఎకరాలు కేటాయించారు. పురాతన విమానాశ్రయం, రైల్వే స్టేషను, వెలుగొండ ప్రాజెక్టుకు 50 కి.మీ. దూరంలో గ్రామాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు మధ్యలో ఉన్న ఇక్కడకు నీటి వసతి చాలదన్న అంచనాతో పరిశ్రమల స్థాపకులు ముందుకు రావడంలేదు. గతంలో పలు స్వదేశీ, విదేశీ పరిశ్రమల ప్రతినిధులు ఇక్కడికి వచ్చి భూములు పరిశీలించి వెళ్లడం తప్ప, కార్యాచరణ ముందుకు సాగలేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.