close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

ప్రశ్నిస్తోందని.. ప్రాణమే తీశాడు

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే

ఆమె.. ప్రేమించానన్నావ్‌. పెళ్లి చేసుకున్నావ్‌. కుటుంబం, పిల్లలంటే బాధ్యత లేదు. ఎప్పుడూ మా పుట్టింటిపై ఆధారపడి బతకడానికి అలవాటుపడ్డావ్‌. దీనికి తోడు తాగుడొకటి. ఏదైనా పనిచేసి పిల్లల బాగోగులు చూసుకుందామన్న ధ్యాస లేదు. ఇలా ఎన్ని రోజులు ఒకరిపై ఆధారపడి కుటుంబాన్ని సాకుతావ్‌?’ అని ప్రశ్నించింది.
అతడు   ‘నాకే ఎదురు చెప్తావా..? నీ అంతు తేలుస్తా?’ అంటూ అందరూ నిద్రించే వేళ మృగరూపం దాల్చాడు.
సాక్ష్యం.. ‘రాత్రి మమ్మీని డాడీ తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమె లేవలేదు’.. అని నాలుగేళ్ల తనయుడు తన తండ్రి కిరాతకానికి సాక్ష్యంగా నిలిచాడు.

మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త
ప్రేమించి పెళ్లాడిన యువతిని దారుణంగా కడతేర్చాడో కిరాతకుడు. పాల్వంచలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. డీఎస్పీ మధుసూదన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన అంబాల రవి అదే వీధికి చెందిన కీర్తి(24)ని ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. కులాలు ఒకటే కావడంతో వారి పెళ్లికి పెద్దలు సైతం అడ్డు చెప్పలేదు. ఈ దంపతులకు లోకేశ్‌ వరుణ్‌ తేజ్‌(4), కాజల్‌(2) ఉన్నారు. పట్టణ పరిధిలోని ఓ కర్మాగారంలో కొంతకాలం కాపాలాదారుగా పనిచేసిన రవి.. కొన్నాళ్లకు పనిని వదిలేసి ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో ఏదో ఒకపని చేయాలని కీర్తి నచ్చజెప్పేయత్నం చేసేది. అలా చెప్పడం నచ్చని రవి తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఇదే విషయమై 10 రోజుల క్రితం కూడా ఘర్షణ జరిగింది. దీంతో కీర్తి తన ఇద్దరు పిల్లలతో సహా బూర్గంపాడులోని బంధువు ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టడంతో తన భార్యను బాగా చూసుకుంటానని రవి నమ్మబలికాడు. పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటానని అక్కడ్నుంచి కీర్తిని ఇంటికి తీసుకొచ్చాడు.  
మద్యం మత్తులో..
నివారం రాత్రి 10 గంటల సమయంలో కీర్తితో రవి ఘర్షణ పడ్డాడు. ఆ కోపంతో.. మద్యం మత్తులో.. ఆదివారం తెల్లవారుజామున తన భార్య తలపై రోకలి బండతో మోది పాశవికంగా హత్య చేశాడు. కీర్తి చనిపోయిందని భావించాకే రవి అక్కడ్నుంచి పరారయ్యాడు. ఉదయం పొద్దెక్కినా కీర్తి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్థానికులు, పుట్టింటి వారు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. క్లూస్‌ టీం, జాగిలాలతో సాక్ష్యాలను సేకరించారు. ‘డాడీ మమ్మీని బాగా కొట్టాడు..’ అని నాలుగేళ్ల లోకేశ్‌ వరుణ్‌ తేజ్‌ పోలీసులకు చెప్పాడు దీంతో హత్యకు పాల్పడింది రవేనని నిర్ధారణకు వచ్చారు. అనంతరం శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని పాల్వంచ సామాజిక ఆస్పత్రికి తరలించారు.
దూకేశాడా.. పారిపోయాడా?.. భార్యను హత్యచేసి పరారైన రవి తన ద్విచక్రవాహనంపై భద్రాచలం వైపుగా పరారయ్యాడు. భద్రాచలం వంతెనపై రవి ద్విచక్రవాహనం, పర్సు, ఆధార్‌కార్డు కనిపించడం కలకలం రేపింది. భయంతో గోదావరి నదిలో దూకాడా? పోలీసులను తప్పుదారి మళ్లించేందుకు ఆధారాలు అక్కడ వదిలేసి పారిపోయాడా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.