close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

ఆలోచనలకు.. పదును పెడదాం

విద్యార్థుల ఆలోచనలకు పదునుపెట్టి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వాలతోపాటు అనేక సంస్థలు పోటీలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్‌(ఎన్‌సీఎస్‌సీ) పోటీలు ముగియగా, తాజాగా జాతీయ సైన్స్‌ సెమినార్‌ పోటీలకు ప్రకటన వెలువడింది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్‌ మ్యూజియం జాతీయ మండలి(ఎన్‌సీఎస్‌ఎం) ఏటా ఒక అంశంపై సైన్స్‌ సెమినార్‌ పోటీలు నిర్వహిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

న్యూస్‌టుడే, అలంపూర్‌ చౌరస్తా

బెంగళూరులోని విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో 8 నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం ఉంది. జిల్లాలోని 145 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా, గురుకుల పాఠశాలల్లో అర్హులైన విద్యార్థులు 25వేల మందికి ఉన్నారు. ఇందులోని ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఈ ఏడాది సైన్స్‌ సెమినార్‌కు ‘రసాయన మూలకాల ఆవర్తన పట్టిక, మానవ సంక్షేమంపై ప్రభావం’ అనే అంశంపై విద్యార్థులు పోటీ పడాల్సి ఉంటుంది.

గద్వాలలో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి జాతీయ బాలల

సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రాజెక్టు గురించి వివరిస్తున్న విద్యార్థినులు

పోటీల నిర్వహణ ఇలా.. :  సైన్స్‌ సెమినార్‌ పోటీలను ఆంగ్లం, హిందీ, తెలుగు, గుర్తింపు పొందిన ఏదైనా జాతీయ భాషల్లో నిర్వహిస్తారు. మండల స్థాయిలో ఈనెల 19న నిర్వహించనున్నారు. అయిజ, అలంపూర్‌ చౌరస్తా, ఎర్రవల్లి, ధరూర్‌, గద్వాల, మల్దకల్‌ మండలాల్లో ఆయా మండలాల వారితో పోటీలు నిర్వహిస్తారు. తర్వాత 21న గద్వాల పట్టణంలోని బాలభవన్‌లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. నిర్వహణ కోసం ఇప్పటికే బృందాలను ఏర్పాటుచేశారు. ఇదే నెలలో రాష్ట్రస్థాయి పోటీలు, నవంబర్‌ 6న అస్సోంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు.

ప్రదర్శన ఇవ్వాల్సిన తీరు : నిర్దేశించిన అంశంపై ఆరు నిమిషాల వ్యవధిలో విద్యార్థులు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు న్యాయనిర్ణేతలతో అదే అంశంపై ప్రశ్నలు - జవాబుల కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంలో మూడు ప్రశ్నలను అడుగుతారు. రెండు నిమిషాల్లో ఏవైనా రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. విద్యార్థులు తమ ప్రదర్శనలో భాగంగా విజువల్‌ స్లైడ్లు, చార్టులను అయిదుకు మించకుండా ఉపయోగించవచ్చు.

ప్రతిభను వెలికితీసేందుకు : విద్యార్థుల్లో ఆలోచనలకు పదును పెట్టేలా.. ఒక అంశంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేలా సైన్స్‌ సెమినార్‌ ఉంటుంది. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థులు తమ ప్రతిభ చాటేందుకు అవకాశం ఉంటుంది. దీనిపై ఇప్పటికే అన్ని పాఠశాలలకు సమాచారం ఇచ్చాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.
- భాస్కర్‌ పాపన్న, జిల్లా సైన్సు అధికారి, జోగులాంబ గద్వాల

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.