close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

బాల ఆలోచన.. భలే ఆవిష్కరణ

మెదళ్లకు పదును పెట్టిన చిన్నారులు
సామాజిక సమస్యలకు మార్గాలు
అబ్బురపడిన న్యాయనిర్ణేతలు
బాల శాస్త్రవేత్తల అభిప్రాయాలు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే

విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో తమ మెదళ్లకు పదును పెడుతున్నారు. తమ చుట్టూ ఉన్న అనేక సామాజిక అంశాలను ఎంచుకుంటున్నారు. వాటికి అవసరమైన పరిష్కార మార్గాలను సైతం చూపుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎంత పెద్ద సమస్యనైనా ఎలా పరిష్కరించుకోవచ్చో వివరిస్తున్నారు. ఖమ్మంలో జరుగుతున్న జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అనేక మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు ఇక్కడకు వచ్చారు. నగరంలోని హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతల ఎదుట తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. ఆదివారం బాలశాస్త్రవేత్తలు ప్రదర్శించిన అనేక ప్రాజెక్టులను చూసి వారు అబ్బురపడ్డారు. నేటి సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైనే వారు ప్రధానంగా ఆలోచించి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. చిన్నారులను ‘న్యూస్‌టుడే’ పలకరించగా వారు తమ ప్రాజెక్టుల గురించి చెప్పి అభిప్రాయాలు ఇలా వెల్లడించారు.
వ్యర్థాల నుంచి ఉత్పత్తులు

-కె.శ్రీకృతి, పదో తరగతి ఖమ్మం జిల్లా
వ్యర్థాల నుంచి మరోలా ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసి పరిశ్రమను స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించటం లక్ష్యం. అందుబాటులో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలు నేడు పెద్ద ఎత్తున సూక్ష్మజీవులను కలుగజేస్తున్నాయి. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే పరిశ్రమకు నేడు అధిక అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల పర్యావరణంపై చెడుప్రభావాన్ని తగ్గించవచ్చు. ఆదాయ అవకాశాలను, ఉపాధి అవకాశాలను ఆర్థిక కార్యకలాపాలుగా చేయవచ్చు. నాణ్యమైన జీవనానికి అవకాశాలను మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ వేస్తున్న వ్యర్థాల వల్ల నష్టాల గురించి నూతనంగా ఆలోచించాను. ఇలాంటి వ్యర్థపదార్థాలను కొత్త రకంగా తయారు చేసి ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టాను.
సౌరశక్తితో జలకాలుష్యం తొలగింపు

కె.క్రౌన్‌రెడ్డి, 9వ తరగతి, నిర్మల్‌
చెరువులు, కుంటలు, సముద్రాలు ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని శుభ్రం చేయటం ఎవరికీ సాధ్యం కాని పని. ప్రపంచంలో ఇప్పటి వరకు చెరువులు, లేదా సముద్రంపైన ఉన్న కాలుష్యాన్ని శుభ్రం చేసే విధానం మాత్రమే తెలుసుకున్నారు. ఇప్పుడు నా ప్రాజెక్టు ద్వారా పైన, లోపల, అగాధంలో ఉన్న కాలుష్యాన్ని సైతం శాస్త్రీయంగా శుభ్రం చేసే విధానం తెలుసుకున్నాను. ఐదు సాంకేతిక విధానాల ద్వారా దీన్ని అమలు చేయవచ్చు. ఒక పడవలో దీనికి సంబంధించిన ఐదు రకాల యంత్రాలను అమర్చి చెరువు లేదా సముద్రంలోకి పంపటం వల్ల ఆ పడవ పైన ఉన్న కాలుష్యంతో పాటు మధ్యలో, అడుగుభాగంలో ఉన్న కాలుష్యాన్ని సైతం తొలగిస్తుంది. సౌరశక్తి ద్వారా విద్యుత్తును తీసుకుని ఈ విధానం అమలు చేయవచ్చు.
సహజ సిద్ధంగా పండ్లను మాగించటం

వి. శ్రుతి, 9వ తరగతి, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు జిల్లా
మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టటం వల్ల ప్రజలు క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులతో మృతి చెందుతున్నారు. ఇలా కాకుండా ఎలాంటి ఖర్చు లేకుండా సహజ పద్ధతిలో సైతం పండ్లను మాగబెట్టవచ్చు. కొబ్బరి పీచు, బొగ్గుపొడి, మొక్కల ఆకులను పొడిచేసి ఈ మిశ్రమంలో పండ్లను మాగించే అవకాశం ఉంటుంది. పండ్లను మాగించటంతో పాటు కూరగాయలు కూడా పాడైపోకుండా నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా చేయటం వల్ల ప్రజలకు క్యాన్సర్‌ లాంటి రుగ్మతల బారి నుంచి ఇతర వ్యాధుల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఎలాంటి ఖర్చు ఉండదు. సహజ సిద్ధంగా చేయటం వల్ల పండ్లు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
మొక్కల అవశేషాలే కీటక నాశనులు
కొంగరి బాలు, 8వ తరగతి, రఘునాథపురం, యాదాద్రి జిల్లా

మొక్కల వ్యర్థాలతో కీటకాలను నాశనం చేయవచ్చు. బొద్దింకలు, బియ్యం పురుగులు, ఇతర కీటకాలను నివారించవచ్చు. నిమ్మతొక్కలు, వేపాకులు, మెంతులు, లవంగాలు కలిపి గుజ్జు తయారు చేసి పనికిరాని కాగితంపై అంటించాలి. ఎండిన తర్వాత దీన్ని వంట గదిలో, బియ్యం నిల్వల్లో, కీటకీలు ఉన్నచోట పెట్టటం ద్వారా కీటకాలు దరిచేరవు. ఈ విధానం రైతులు విత్తనాలు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాంటి విధానం అమలు చేసుకోవచ్చు.
చెత్తకుండీకే సెన్సార్‌
ఓ.లోకేశ్‌, 7వ తరగతి, నర్సంపేట, వరంగల్‌ గ్రామీణ జిల్లా

నగరాలు, పట్టణాల్లో ఉన్న చెత్తకుండీలు నిండిపోయినా వాటిని సకాలంలో తొలగించటంలో నగర, పురపాలకాలు నిర్లక్ష్యం చేస్తుంటాయి. వీటి నుంచి వెలువడే దుర్వాసన వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజలు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించరు. అందువల్ల చెత్తకుండీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెన్సార్‌ ద్వారా దీనికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అధికారుల చరవాణికి చేరుతుంది. చెత్త కుండీలో ఉన్న చెత్త ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. పూర్తిగా నిండిన తర్వాత సంక్షిప్త సమాచారం అధికారికి చేరుతుంది. అప్పటికీ అధికారి స్పందించకుంటే అతని చరవాణిని ప్రత్యేక సిగ్నల్స్‌ ద్వారా పనికిరాకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి విధానం వల్ల అధికారులు, ఉద్యోగులు, కార్మికులు అప్రమత్తం అవుతారు. ప్రజలను విషజ్వరాల బారి నుంచి కాపాడినట్లవుతుంది.
సహజసిద్ధంగా కాలుష్య నివారణ
ఎన్‌.హిమజ, పదో తరగతి, నిజామాబాద్‌ జిల్లా

జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ నేపథ్యంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీని వల్ల ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. నగరాల్లో, పట్టణాల్లో చెత్తా చెదారం పేరుకుపోతోంది. మురికి కాల్వలు దారుణంగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను కాలుష్య బారి నుంచి కాపాడేందుకు కొబ్బరి పీచు, నాచుతో బంతులను తయారు చేశాను. ఎలాంటి ఖర్చు లేకుండా తయారు చేసిన ఇలాంటి బంతులు కాలుష్య ప్రాంతాల్లో ఉంచటం వల్ల కాలుష్యాన్ని పీలుస్తాయి. కొబ్బరిపీచు, నాచుకు ఆ గుణం ఉంటుంది. వాతావరణ అసమతుల్యం వల్ల జరిగే కాలుష్యాన్ని సైతం ఇవి నివారిస్తాయి.

సామాజిక అంశాలపై శాస్త్రీయ అవగాహన
డాక్టర్‌ గీతా స్వామినాథన్‌, జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ అకడమిక్‌ కమిటీ కేంద్ర పరిశీలకురాలు
విద్యార్థులకు సామాజిక అంశాలపై శాస్త్రీయ అవగాహన కల్పించటం కోసం సంస్థ కృషి చేస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఒక్కో రాష్ట్రం నుంచి సుమారు 2వేల మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీని వల్ల ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. తరగతి గదిలో విద్యార్థి అభ్యసించింది తన నిత్య జీవితానికి అన్వయించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు బాలశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు వీలు కలుగుతుంది. గతంలో జరిగిన జాతీయ స్థాయిలో అనేక మంది విద్యార్థులు రాణించి నేడు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కోఆర్డినేటర్లుగా, అకడమిక్‌ కోఆర్డినేటర్లుగా, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో బాలశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు పథకం ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఏదేని సామాజిక సమస్యలను గురించి ఆలోచించాల్సిందిగా బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తుంది. ఇందుకు కారణాలను వాటి పరిష్కారాలను శాస్త్రీయ ప్రక్రియ ద్వారా కనుగొనటానికి ప్రయత్నించాలని అభిలషిస్తోంది. బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ద్వారా నిర్వహిస్తున్న అన్వేషణాత్మక ఆవిష్కరణ కారక విద్య దేశం మొత్తంగానే కాకుండా తూర్పు ఆసియా దేశాలకు సామాజిక ఉద్యమంగా విస్తరిస్తోంది. బాలలు నిర్వహిస్తున్న ప్రాజెక్టు అధ్యయనం స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించి, శాస్త్ర పరిజ్ఞానం వారిలో చైతన్య తీసుకొస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. సైన్స్‌ కాంగ్రెస్‌ విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో విజ్ఞానశాస్త్ర చైతన్యం కలిగించి శాస్త్ర పరిజ్ఞానాన్ని సమాజంలోని వివిధ వర్గాల వారికి పంచటానికి ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ స్థాయికి ఎంపికైన వారు అంతా సమానమే. సమాజానికి మేలు జరిగే ప్రాజెక్టులకు జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రాధాన్యత ఇస్తుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.