close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

దగ్గరి దారి.. ప్రమాదకారి

నందికొట్కూరు, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయం వెనుక జలాల పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గంలో రెండు మండలాలు వస్తాయి. అటువైపు తెలంగాణాలోని నాగర్‌కర్నూలు గ్రామాలు ఉంటే ఇటు వైపు కర్నూలు జిల్లా గ్రామాలు వస్తాయి. రెండు వైపులా బంధుత్వాలు, జీవన సంబంధాలు ఉండడంతో అటుఇటూ రాకపోకలకు వీరికి బోటు ప్రయాణం తప్పనిసరి. నదిలో నీరు ఉన్నప్పుడు జిల్లాలోని పగిడ్యాల, కొత్తపల్లి మండలాల నుంచి తెలంగాణ గ్రామాలకు బోట్లు నడుపుతున్నారు.

తెలంగాణలో జరిగే సింగోటం జాతరకు వేలాది మంది భక్తులు వస్తారు. ఈ సమయంలో బోట్ల నిర్వాహకులు నిబంధనలను గాలికొదిలేస్తుంటారు. సామర్థ్యానికి మించి రెట్టింపు జనాన్ని తరలిస్తున్నా పట్టించుకునే దిక్కు ఉండదు. ఇదే ప్రాణాంతకమవుతోంది.

●కొత్తపల్లి మండలం కపిలేశ్వరం, సంగమేశ్వరం నుంచి బోటులో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, కొల్లాపురం, సోమశిల ప్రాంతాలకు కొత్తపల్లి, ఆత్మకూరు, వెలుగోడు ప్రాంతాలకు చెందిన వారు బోటు ప్రయాణం సాగిస్తుంటారు. శివరాత్రికి శివ స్వాములు పాదయాత్రగా వెళ్లేందుకు ఆయా ప్రాంతాల నుంచి సంగమేశ్వరం వరకు బోటులో వచ్చి అక్కడి నుంచి కాలినడకన శ్రీశైలం వెళ్తుంటారు.

● పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌ సమీపం నుంచి నందికొట్కూరు, జూపాడుబంగ్లా, మిడుతూరు, కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పగిడ్యాల మండలాల ప్రజలు బోటులో సింగోటం జాతరకు, పెంట్లవెల్లి, కొల్లాపురం, మంచాలకట్ట ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు.

తప్పనిసరి బోటు ప్రయాణం

నందికొట్కూరు నుంచి సింగోటంకు బస్సులో వెళ్లాలంటే కర్నూలుకు 30 కి.మీ, అక్కడి నుంచి పెబ్బేరుకు 58 కి.మీ, పెబ్బేరు నుంచి సింగోటంకు 38 కి.మీ, దాదాపు 126 కి.మీ, కొల్లాపురానికి వెళ్లాలంటే 140 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి పోవడానికి రూ.80 నుంచి రూ.120 టికెట్‌ వ్యయమవుతుంది. అదే నందికొట్కూరు నుంచి మంచాలకు 5 కి.మీ ప్రయాణించి బోటులో నది దాటి ఆటోలో 10 కి.మీ ప్రయాణిస్తే సరిపోతుంది. దీనికి ఒక్కొక్కరికి రూ.40 ఖర్చవుతుంది. గ్రామస్థులు సమయం,డబ్బు కలిసి వస్తుందని బోటు ప్రయాణం చేస్తుంటారు.

* ● నందికొట్కూరు మండలం అల్లూరు నుంచి తెలంగాణలోని అలంపూర్‌కు కృష్ణా నదిపై వంతెన నిర్మించారు. అధికారికంగా ప్రారంభం కాకపోవడంతో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. ప్రైవేటు వాహనాలు తిరుగుతున్నాయి.

*  నందికొట్కూరు నియోజకవర్గంలో మత్స్యకారుల బోటులు తప్ప శాఖాపరమైన బోట్లు లేవు. చేపలు పట్టేందుకు నదిలోకి వలలతో వెళ్లే బోట్లలో ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ బోట్లకు లైఫ్‌ జాకెట్లు ఉండవు. నడిపే వ్యక్తికి ఎలాంటి అనుమతి ఉండదు. పగిడ్యాల నెహ్రూనగర్‌ వద్ద చేపల బోట్లు సుమారు 10 వరకు ఉన్నాయి. కొత్తపల్లి మండలంలో 15 ఉన్నాయి.

* ● ప్రతి ఏడాది జనవరి నెలలో జరిగే సింగోటం జాతరకు స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా భక్తులను, ప్రయాణికులను చేరవేసేందుకు మత్స్యకారుల బోట్లకు అనుమతులిస్తారు. ప్రయాణికులు, భక్తుల ప్రాణాలకు ఎలాంటి భరోసా ఉండదు. ఇలాంటి సమయాల్లో జరిగే ప్రమాదాలకు బాధ్యత ఎవరిది అన్నది ప్రశ్నగా ఉంది.

* గత ఏడాది తెలంగాణకు చెందిన శివదీక్షా స్వాములు శ్రీశైలం పాదయాత్రకు వెళ్లేందుకు బోటులో కొత్తపల్లి మండలం సంగమేశ్వరానికి బయలు దేరారు. మధ్యలో బోటు ఇంజిన్‌ ఆగిపోయింది. భయాందోళనలకు గురయిన స్వాములు తెలంగాణ ప్రాంత పోలీసులకు ఫోన్‌ చేయడంతో వారు అప్రమత్తమై ఇతర పడవలను తీసుకువచ్చి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

పుట్టీ.. ప్రాణాలు బిగబట్టి..

కుంబళనూరు (కౌతాళం గ్రామీణ), న్యూస్‌టుడే: తుంగభద్ర నది దాటేందుకు పుట్టీల ప్రయాణం ప్రమాదంగా మారుతోంది. నది ఆవల ఒడ్డున ఉన్న జనం ఇటు వచ్చేందుకు పుట్టీలను ఉపయోగిస్తున్నారు. ఒక్కో పుట్టీలో పది నుంచి 15 మందికి పైగా ఎక్కించుకుంటున్నారు. ఆదివారం గోదావరిలో లాంచీ మునక ప్రమాదం నేపథ్యం నుంచి వీరు పాఠాలు నేర్వాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం పుట్టీ అదుపు తప్పినా నదిలో మునక తప్పదు. ప్రవాహం ఎక్కువగా ఉంటే కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవాల్సిందే. కౌతాళం మండలం కుంభళనూరు వద్ద ఎక్కువమంది ఆంధ్ర, కర్ణాటక వాసులు పుట్టీలలో ప్రయాణం చేస్తున్నారు. రహదారి మార్గాల ద్వారా వెళ్లాలంటే వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో తక్కువ ఖర్చు, నది దాటే సమయం తక్కువగా ఉండడంతో ఎక్కువమంది పుట్టీలను ఆశ్రయిస్తున్నారు. నిత్యం 300 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని అంచనా.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.