close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

సంస్కృతిని చాటేలా ‘తెలంగాణ వైభవం’

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : మన సంస్కృతి, సంప్రదాయాలు చాటేలా కరీంనగర్‌లో మూడు రోజుల పాటు తెలంగాణ వైభవం పేరుతో కార్యశాల నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎల్‌.రాజభాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు రోజుల పాటు కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తొలి కంద పద్యం ఇక్కడి నుంచే ప్రపంచానికి తెలిసిందన్నారు. కరీంనగర్‌ సమీపంలోని బొమ్మలమ్మ గుట్ట, శాతవాహనులు ఏలిన కోటిలింగాల, వరంగల్‌లో కాకతీయుల పాలన, ఇక్కడి పండగలు, సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబొట్టు ఇవన్నీ ప్రస్తుత సమాజానికి తెలియజెప్పాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ జిల్లాల్లోని చరిత్రకారులు, మేధావుల పత్ర సమర్పణ, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మన వాస్తుశిల్పం, చారిత్రక వైభవం, ఇతిహాసాలు, శాస్త్ర సాహిత్య గ్రంథాలు, విమోచనోద్యమం లాంటి అంశాలపై చర్చలు, ఉపన్యాసాలు ఉంటాయని వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు కళా ప్రదర్శనలు, పేరిణీ నృత్యం, లాస్యం, ఒగ్గుకథ, జానపద గేయాలు, కవి సమ్మేళనాలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ వృత్తి నైపుణ్యాలు తెలియజేయడానికి చేనేత వస్త్రాలు, నిర్మల్‌ బొమ్మలు, పుస్తకాలు, తెలంగాణ వంటకాల ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 19న వైశ్యభవన్‌ నుంచి సర్కస్‌ గ్రౌండ్‌ వరకు కళా ప్రదర్శనలతో శోభాయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ప్రజ్ఞాభారతి జిల్లా అధ్యక్షుడు నిరంజనాచారి, ప్రధాన కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, సత్యనారాయణరెడ్డి, నగేశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌, బుస్స శ్రీనివాస్‌, దారం వినోద్‌, తుమ్మల రమేష్‌రెడ్డి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.