close

గురువారం, అక్టోబర్ 17, 2019

ప్రధానాంశాలు

పాలన విసిగెత్తిస్తోంది!

పాలకమండలి లేదు

ఎస్‌కేయూలో అస్తవ్యస్తం

కొరవడిన పర్యవేక్షణ

1. ఎస్కేయూకు కేటాయించిన రూ.72 కోట్ల బ్లాక్‌గ్రాంట్‌ను ప్రభుత్వం రూ.50 కోట్లకు తగ్గించింది. నెలకు ఉద్యోగులు, పెన్షనర్లకు కనీసం రూ.5.50 కోట్ల నుంచి రూ.6 కోట్లు అవుతుంది. ఈ లెక్కన గ్రాంటు 10 నెలలకు కూడా సరిపోదు. రెగ్యులర్‌ ఉపకులపతి ఉంటే.. బ్లాక్‌ గ్రాంటును తెప్పించేవారు.’

2. వర్సిటీకి ఉపకులపతి, పాలకమండలి కీలకం. ప్రస్తుతం వీసీ అందుబాటులో లేరు. పాలకమండలి లేదు. రిజిస్ట్రార్‌, రెక్టార్‌ అత్యంత ప్రధానం. ఈ రెండు పోస్టులకు గత మే 27న ఇన్‌ఛార్జిలను నియమించారు. దీన్నిబట్టి పాలన ఏ తీరుగా ఉంటుందో ఊహించవచ్ఛు

3. మూడేళ్ల తర్వాత దూరవిద్య కోర్సులకు అనుమతి వచ్చింది. దీనికి సంబంధించి ప్రకటన ఇచ్చినా.. అప్పటికే పుణ్యకాలం పూర్తయింది. విద్యార్థులు పెద్దగా చేరలేదు. అలాగే గతంలో చేరిన 32 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.

4. విద్యాసంవత్సరం ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు అవుతోంది. ఇంకా పలు విభాగాల్లో తరగతులు ప్రారంభం కాలేదు. ఆర్ట్స్‌ విభాగాల్లో పరిస్థితి మరింత దయనీయం. సైన్సు కళాశాల ప్రధానాచార్యుడికి రెక్టార్‌గా అవకాశం కల్పించారు. ఆయన ఆ పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. బీఈడీ కళాశాలకు ప్రధానాచార్యుల్ని పూర్తి స్థాయిలో నియమించలేదు.

‘ఇటీవల ఎస్కేయూ, జేఎన్‌టీయూ అధికార యంత్రాంగంతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను కంట్రోల్‌ చేయలేరా.. ప్లేట్లు లేకుంటే మూడుగంటల పాటు రోడ్డును బంద్‌ చేస్తే ఎవరూ పట్టించుకోకుంటే ఎలా?. వర్సిటీకి పలు సమస్యలపై విద్యార్థులు వస్తారు. విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి గేటు ముందు నిలబడితే ఎలా.. ఎవరూ పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు.

న్యూస్‌టుడే, ఎస్‌.కె.విశ్వవిద్యాలయం

రాయలసీమలోనే ఘన చరిత్ర కలిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. వర్సిటీని గాడిన పెట్టాల్సిన ఉపకులపతి అందుబాటులో లేరు. పాలక మండలి నియామకం జరగలేదు. ఇతర అధికారులు దృష్టి సారించడం లేదు. గత ఉపకులపతి రహ్మతుల్లా రాజీనామా చేశారు. సాధారణంగా ఉపకులపతి పదవీకాలం పూర్తయినా, రాజీనామా చేసినా సమీపంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల్లో ఒకరిని ఇన్‌ఛార్జిగా నియమించడం ఆనవాయితీ. కానీ అమరావతిలో ఉన్న ఐఏఎస్‌ అధికారికి ఇన్‌ఛార్జి ఇవ్వడం ప్రతిబంధకంగా మారింది. ఎస్‌కేయూ ఇన్‌ఛార్జి ఉపకులపతిగా ఐఏఎస్‌ అధికారి బాబు.ఎను నియమించారు. ఆయన ఆగస్టు 8వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత వర్సిటీకి రాలేదు. అలాగే రెక్టార్‌, రిజిస్ట్రార్‌ ఇన్‌ఛార్జిలే. కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. మరోవైపు సమస్యలు పేరుకుపోయాయి. అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇటీవల ఓ ఉద్యోగి కంప్యూటర్‌ ఇతర సామగ్రి అపహరించి, తీసుకెళుతుండగా పట్టుబడ్డాడు. వసతి గృహంలో భోజనం ప్లేట్లు తక్కువగా ఉన్నాయని విద్యార్థులు ఏకంగా వర్సిటీ ముఖద్వారం వద్ద బైఠాయించారు. విద్యార్థుల నిరసనతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వర్సిటీపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పర్యవేక్షణ వదిలేశారు..

వర్సిటీ వసతి గృహాల పర్యవేక్షణ పూర్తిగా వదిలేశారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. మెస్‌లో శుభ్రం చేసే వారు, వడ్డించే వారు కరవయ్యారు. విద్యార్థులకు ప్లేట్లు కొనుగోలు చేసి ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ప్లేట్ల కొరతపై విద్యార్థులు ఏకంగా ప్రధాన భవనాన్ని మూసేశారు. వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డులో నిలబడాల్సి వచ్చింది. మహిళా, ఇంజినీరింగ్‌ విద్యార్థుల వసతి గృహాల్లో ఒక్కో గదిలో ముగ్గురు ఉండాల్సి ఉండగా.. 6 నుంచి 8 మంది ఉంటున్నారు. నాన్‌బోర్డర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు చెల్లించాల్సిన బకాయిలు రూ.1.50 కోట్ల వరకు ఉన్నా.. పట్టింపు లేదు.

* ఉపకులపతిగా ఐఏఎస్‌ను నియమించడం, రెక్టార్‌, రిజిస్ట్రార్‌ నియామకానికి పాలకమండలి ఆమోదం లేకపోవడం, గత నెలలో నిర్వహించిన పాలకమండలికి కోరమ్‌ లేదనే అంశాలపై ఏకంగా హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో నోటీసులు ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ఉపకులపతి, ఇతర అధికారులకు నోటీసులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అధ్యాపకుల కొరత

ఎస్కేయూలోని పాలిమర్‌సైన్సు, హిందీ, మైక్రోబయాలజీలో ఒక్క అధ్యాపకులు లేరు. మరికొన్ని విభాగాల్లో ఒకరు మాత్రమే ఉన్నారు. గతంలో 118 పోస్టులకు ప్రకటన ఇచ్చారు. ఇందులో సహాయ ఆచార్యులు, ఆచార్యులు ఉన్నారు. వాటికి సంబంధించి ఇంటర్వ్యూలకు కాల్‌ లెటర్లు సైతం సిద్ధం చేశారు. అంతటితో ప్రక్రియ ఆగిపోయింది. ఏవిధమైన అభ్యంతరాలు లేని బ్యాక్‌లాగ్‌ బోధన, బోధనేతర పోస్టులకు సంబంధించి ప్రకటన ఇచ్చినా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

ఉపకులపతి రావాలంటూ విద్యార్థుల నిరసన (పాతచిత్రం)

సమావేశం నిర్వహించినా..

ఎస్కేయూ పాలకమండలి సమావేశం గత నెల 16న నిర్వహించారు. మొత్తం 52 సమస్యలకు సంబంధించి అజెండాలో పొందుపరిచారు. సాధారణంగా సమావేశం నిర్వహించిన అనంతరం 10 రోజుల్లోపు ఈసీ రెజల్యూషన్స్‌ బయటకు వస్తేనే పనులు ఆరంభం అవుతాయి. సమావేశం నిర్వహించి 30 రోజులవుతున్నా ఇప్పటికీ అవి పరిష్కారం కాలేదు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదు.

పదోన్నతులు లేవు..

కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం ద్వారా సంయుక్త ఆచార్యులకు ఆచార్యులుగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. కానీ పదోన్నతులు లేక వారికి పలు సౌకర్యాలు దక్కలేదు. బోధనేతర ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సి ఉండగా జాప్యం అవుతోంది.

యూజీసీ నుంచి మంజూరైన పరిశోధక ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా అయింది. గత ఉపకులపతి మూడు అధ్యయన కేంద్రాలను మూసేసి, మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేసి యూజీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. మహిళా అధ్యయన కేంద్రం, సోషియల్‌ ఎక్స్‌క్లూజివ్‌ల పరిస్థితి దారుణంగా ఉంది. జీతం రాలేదు.. శోధన లేదు అనే పరిస్థితి తలెత్తింది. సిబ్బందికి ఏళ్లుగా వేతనాలు ఇవ్వలేదు.

పీజీ.. పీహెచ్‌డీ కష్టాలు

విద్యార్థులకు అత్యున్నత డిగ్రీ పీహెచ్‌డీ. ఏళ్ల తరబడి కష్టించిన పీహెచ్‌డీ గ్రంథం సమర్పించి వైవా నిర్వహించాల్సి ఉంటుంది. వైవా నిర్వహించాలంటే ఇతర ప్రాంతాలకు సంబంధించిన విశ్వవిద్యాలయంలోని ఆచార్యుల జాబితా ఉంచితే.. అందులో కొందరిని ఉపకులపతి ఆమోదిస్తారు. వారికి వివరాలు పంపి ఆహ్వానించి వైవా నిర్వహిస్తారు. వర్సిటీలోని చరిత్రశాఖ, బయోకెమిస్ట్రీ ఇలా పలు విభాగాల్లో వైవా నిర్వహించకపోవడంతో పీహెచ్‌డీలు అందడం లేదు. ఏదైనా ఉద్యోగ ప్రకటన ఇచ్చే సమయానికి పీహెచ్‌డీ ఉండాలి. లేదంటే నష్టపోతారు. పీజీ విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాల పంపిణీలో జాప్యం జరుగుతోంది.

సమస్యలు పరిష్కరిస్తున్నాం

మల్లికార్జునరెడ్డి, ఎస్కేయూ రిజిస్ట్రార్‌

అత్యవసరమైన దస్త్రాలు ఉపకులపతి వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించుకుని వచ్చాం. ఉపకులపతి ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ పరిధిలోనిది. పాలకమండలి సమావేశంలో జరిగిన అంశాలపై తర్వలోనే మినిట్స్‌ అందజేస్తాం. సెర్చి కమిటీకి సంబంధించి యూజీసీ నామిని ఎంపిక చేయాల్సి ఉంది. విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. కొన్ని అంశాలు తమ చేతుల్లో లేకపోవడంతో ఆ ప్రక్రియ సాగడం లేదు. బ్లాక్‌గ్రాంట్‌ ప్రభుత్వమే తగ్గించింది. తప్పు చేసిన ఉద్యోగిపై చర్య తీసుకున్నాం.

రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకానికి అన్వేషణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్కేయూకు వర్సిటీ నామిని, యూజీసీ నామిని ఎంపికలో జాప్యం కావడంతో అన్వేషణ కమిటీ వేయలేదు. అధికారులు సైతం పట్టించుకోలేదు.

‘ఎస్‌కేయూకు ఆగస్టు 6న ఐఏఎస్‌ అధికారి బాబు.ఎను ఇన్‌ఛార్జి ఉపకులపతిగా నియమించారు. అదేనెల 8న ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడు గంటలు మాత్రమే వర్సిటీలో ఉన్నారు. ఆ సమయంలోనే అందరినీ పరుగులు పెట్టించారు. వర్సిటీని గాడిలో పెడతారని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఆయన వర్సిటీకి రాలేదు. ఉపకులపతి ఉంటేనే పాలన అంతంత మాత్రమే. నెలరోజులకు పైగా కనిపించడం లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉపకులపతి వెంటనే వర్సిటీకి రావాలని ఇటీవల విద్యార్థులు రోడ్డెక్కారు.’

 

విశ్వవిద్యాలయం ఏర్పాటు: 1981

మొత్తం పీజీ కోర్సులు: 39

విభాగాలు: 29

వర్సిటీ విద్యార్థులు: 6 వేలు

ఉద్యోగులు:1231

అనుబంధ కళాశాలలు: 120

విద్యార్థుల సంఖ్య: 60 వేలు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.