close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

ఆత్మీయ వేదిక

పాఠశాలల్లో గర్ల్‌ చైల్డ్‌ ఎంపవర్‌మెంట్‌ క్లబ్స్‌

బాలికల సమస్యలు చెప్పుకొనే అవకాశం

పరిష్కారానికి ఉపాధ్యాయుల కృషి


నవాబుపేట : ఎన్మన్‌గండ్ల పాఠశాలలో చర్చించుకుంటున్న విద్యార్థినులు

విద్యార్థినులు ఎదిగే సమయంలో వచ్చే అనారోగ్య సమస్యలను గురించి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడేవారు. క్లబ్‌ సమావేశాలు ఏర్పాటు చేసిన సమయంలో వారితో స్నేహపూర్వకంగా ఉండే ఉపాధ్యాయులతో చెప్పుకొంటున్నారు. దీంతో ఉపాధ్యాయులు సమీపంలోని వైద్యులను పిలిచి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడటంతోపాటు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.

పాఠశాలకు వచ్చే విద్యార్థినుల వెంట ఆకతాయిలు పడేవారు. కొన్ని నెలలుగా ఇలా చేస్తున్నా విద్యార్థినులు ఎవరికి చెప్పాలో తెలియక మిన్నకుండి పోయేవారు. క్లబ్‌ ఏర్పాటు చేసిన తరవాత సమావేశాలు నిర్వహించడంతో విద్యార్థినులు తమ సమస్య చెప్పారు. ఉపాధ్యాయులు స్పందించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆకతాయిలను పట్టుకొని కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో విద్యార్థినులకు బెడద తప్పింది.

పాఠశాలలో చదివే విద్యార్థిని ఆటో డ్రైవర్‌తో ప్రేమలో పడింది. ఈ విషయంలో క్లబ్‌ సమావేశంలో సహచర విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధ్యాయులు స్పందించి సదరు విద్యార్థినిని పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. చదువుకునే సమయంలో ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వవద్దని సూచించారు. విద్యార్థినిలో మార్పు కనిపించింది. ఆటో డ్రైవర్‌ను కూడా పిలిచి మాట్లాడాలని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

షీ టీం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మరికల్‌ విద్యార్థినులు

న్యూస్‌టుడే, వీరన్నపేట (మహబూబ్‌నగర్‌)

కొద్దిరోజులుగా సమస్యలతో ఇబ్బంది పడ్డా చెప్పుకోని విద్యార్థినుల సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది.. అనారోగ్య సమస్యలు.. ఆకతాయిల వేధింపులను అధిగమించడంతోపాటు ప్రణాళిక ప్రకారం చదువు సాగించేందుకు అవకాశం లభిస్తోంది.. పారిశుద్ధ్య నిర్వహణలోనూ చేయి కలిపేలా చేస్తోంది.. ప్రభుత్వ పాఠశాలల్లో గర్ల్‌ చైల్డ్‌ ఎంపవర్‌మెంట్‌ క్లబ్స్‌ ఏర్పాటుతో చాలా ప్రయోజనాలు కలిగాయి.. ఉపాధ్యాయులు.. విద్యార్థులు.. పోలీసు అధికారులు సభ్యులుగా ఉండే బృందాలతో మంచి ఫలితాలు కనిపించాయి.. ప్రయోగాత్మకంగా మొదట మూడు పాఠశాలల్లో అమలు చేసిన ఈ విధానం మంచి ఫలితాలు సాధించడంతో ఇతర పాఠశాలల్లో అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.. ఫలితంగా ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యం.. భద్రత వంటి విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో జిల్లాలో అమలు చేసిన తీరు.. క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థినులు ఆకతాయిలతో ఇబ్బందులు పడుతుంటారు. ఎదుగుదల సమయంలో వచ్చే మార్పులు, ఆరోగ్యపరమైన సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సిగ్గు పడుతుంటారు. పాఠశాలల్లో క్లబ్‌ సమావేశాలు ఏర్పాటు చేసిన సమయంలో ఇలాంటి వారు ఇతర విద్యార్థినులతోనో, స్నేహపూర్వకంగా ఉండే ఉపాధ్యాయులతో చెబుతున్నారు. ఫలితంగా ప్రతి విద్యార్థిని సమస్య క్లబ్‌ దృష్టికి వస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. ఆకతాయిల విషయంలో పోలీసులకు చెప్పి గస్తీ నిర్వహించే విధంగా చేస్తున్నారు. ఇక ఇతర చిన్న చిన్న సమస్యలకు ఉపాధ్యాయులే పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు తమ దృష్టికి వస్తే ఇద్దరితో మాట్లాడుతున్నారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే ఉపాధ్యాయుల స్థాయిలో ఉంటే వాటికి అవగాహన కల్పించడంతోపాటు పరిష్కారాలు చూపిస్తున్నారు. వైద్యం అవసరం ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను పిలిచి అవసరమైన వైద్య సేవలు అందేలా చూస్తున్నారు.

మరికల్‌ పాఠశాలలో పరిసరాలను శుభ్రం చేస్తూ..

మంచి ఫలితాలతో.. : మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మరికల్‌, మక్తల్‌, నవాబుపేట మండలం ఎన్మన్‌గండ్ల పాఠశాలల్లో ఈ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మంచి ఫలితాలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో దీనిని అమలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మరో పది పాఠశాలల్లో క్లబ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించిన అధికారులు రానున్న రోజుల్లో అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని యోచిస్తున్నారు.

మక్తల్‌ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న వైద్యులు, పోలీసులు

కమిటీ చైర్మన్‌ : పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

కన్వీనర్‌ : విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండే ఉపాధ్యాయుడు

సభ్యులు : ప్రతి సెక్షన్‌ నుంచి 10-12 సంవత్సరాలలోపు చురుగ్గా ఉన్న ఇద్దరు విద్యార్థినులు

ఇతర సభ్యులు : మహిళా కానిస్టేబుల్‌, షి బృందం సభ్యులు

ఎప్పుడు సమావేశమవ్వాలి ? : ప్రతి నెల మొదటి శుక్రవారం కమిటీ సమావేశమై పాఠశాల, విద్యార్థుల సమస్యలు చర్చించాలి.

కమిటీల లక్ష్యం

* ఎదుగుదల సమయంలో వచ్చే మార్పులు తెలియజేయడం

* ఆరోగ్య అంశాలపై అవగాహన

* బాలికల రక్షణకు ఉన్న చట్టాలు, వాటిని వినియోగించుకునే తీరు.

* విద్యార్థినుల సమస్యలు వాటిని తెలుసుకొని కౌన్సెలింగ్‌

* విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే విధంగా కార్యక్రమాలు

సమస్యలు మా దృష్టికి

ఇదివరకు విద్యార్థినులు సమస్యలు మా వరకు తెచ్చేవారు కాదు. ప్రస్తుతం క్లబ్‌ ఏర్పాటుతో విద్యార్థినులు తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కార చర్యలు చేపడుతున్నాం. విద్యార్థినులను ఇబ్బంది పెడుతున్న ఆకతాయిల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం.

- వెంకట వరలక్ష్మి, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయురాలు, మక్తల్‌

పరిష్కరిస్తున్నాం

విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారాలు చూపిస్తున్నాం. పాఠశాలకు వచ్చే విద్యార్థినులు ఆకతాయిలతో ఇబ్బంది పడేవారు. పోలీసులకు చెప్పడంతో ప్రస్తుతం ఆ సమస్య లేదు. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నాం. వైద్యులు, పోలీసుల సహకారం తీసుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థినులు ఎలాంటి సమస్యలు లేకుండా చదువుకునేందుకు అవకాశం లభించింది.

- శ్రావణి, స్కూల్‌ అసిస్టెంట్‌, ఎన్మన్‌గండ్ల

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.