close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

గోస పెట్టించిన గోదావరి

ప్రమాద ఘటన తెలిసి ఉలిక్కిపడిన భాగ్యనగరి
ఇక్కడినుంచి వెళ్లినవారు ఏమయ్యారోనని ఆందోళన
ప్రమాద ఘటన తెలిసి ఉలిక్కిపడిన భాగ్యనగరి

ఈనాడు, హైదరాబాద్‌

నిత్యం బిజీగా గడిపే నగరవాసులు అలా వారాంతాలు రాగానే పర్యాటక ప్రదేశాలకు క్యూ కడుతుంటారు. ఆహ్లాదకర పరిసరాలతో పాటు, జలంతో పోటెత్తే గోదావరి, కృష్ణమ్మను విహారం ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి కొంగొత్త అనుభూతిని మూటగట్టుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. గత రెండు నెలలుగా పడుతున్న వర్షాలకు నదులు నిండిపోయాయి. వీటిని చూసేందుకు వెళ్లేవారి సంఖ్యా అధికమే. ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర లాంచీ ప్రమాద  ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాపికొండల యాత్రకు వెళ్లినవారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. హైదరాబాద్‌ నుంచి వెళ్లిన సందర్శకులు దాదాపు 22 మంది వరకు ఉండడం... కొందరి ఆచూకీ కానరాక బంధువులు, రక్తసంబంధీకులు తల్లడిల్లిపోతున్నారు.
 

బోటు షికార్‌.. పారా హుషార్‌
ప్రాణాలతో ఆటలొద్దు 
కాసుల వేటను కనిపెట్టి మసలాలి
ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
అప్రమత్తం కాకుంటే ముప్పు తప్పదంతే!
ఈనాడు, హైదరాబాద్‌ 

పలుచోట్ల జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఆ ప్రదేశాల్లో పర్యాటకుల సందడి పెరిగింది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో, వారాంతంలో ఎక్కువమంది అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. చూసేందుకు వెళ్లినవారు తీరా నీళ్లు కనపడగానే నదులు, చెరువులు, కాలువల్లోకి దిగుతున్నారు. బోటింగ్‌ సదుపాయం ఉంటే, ఎంచక్కా అందులో తిరుగుతున్నారు. కొన్నిచోట్ల బోటు నిర్వాహకులు నిబంధనల మేరకు వ్యవహరించకపోవడమే ప్రమాదాలకు దారితీస్తోంది. పర్యాటకుల భద్రతను పణంగా పెట్టి కాసుల వేట కొనసాగిస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో సందర్శకులు మరింత అప్రమత్తంగా ఉండాలి. సురక్షితం అనుకుంటేనే బోటు షికారు చేయాలి. వర్షాకాలంలో విహారమంటే అన్ని ముందుజాగ్రత్తలూ తీసుకోవాలి. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఉన్నపళంగా భారీ వర్షం పడితే వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే.. వెళ్లే ముందే ఆయా ప్రాంతాలకు సంబంధించిన వర్ష సూచనలు తెలుసుకోవడం ఎంతో అవసరం.అంతే కాకుండా..

పడవ ప్రయాణం చేసేవారి పేర్లు, వయసు వివరాలను విధిగా నమోదు చేసుకునే బాధ్యత నిర్వాహకులదే. అంతేతప్ప కుటుంబ పెద్ద పేరు రాసి, ఆయన వెంట ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్య మాత్రమే రాసి వదిలేయడం తప్పు. నిబంధనలు పాటించని చోట జలవిహారం ప్రాణాంతకం.
సెల్ఫీలే కొంపముంచుతున్నాయ్‌
పడవల్లో షికారు చేసేటప్పుడు, సెల్ఫీల కోసం అందరూ ఒకవైపు జరగడం అత్యంత ప్రమాదకరం. నిర్వాహకులు చెప్పినట్లు, ఎక్కడివారు అక్కడే కూర్చోవాలి. ఏం కాదని ఒకపక్కకు జరిగితే బోటు నీట మునిగే ప్రమాదముంది.
నీరు కనిపించగానే, ఈత రాకపోయినా కొందరు పిల్లలు దూకేస్తుంటారు. తోటి పిల్లలు ‘ఏం కాదులే.. మేం ఉన్నాం’ అంటూ బలవంతంగా నీళ్లలోకి దింపుతుంటారు. ఇది ప్రాణాంతకం. జలశయాల వద్దకు బాలలను ఒంటరిగా పంపకూడదు. పెద్దల నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి.
వరద తాకిడి ఎక్కువగా ఉండే జలపాతాల సమీపంలోకి పర్యాటకులను అనుమతించరు. దూరం నుంచే చూడాలి. దగ్గర నుంచి చూడాలనే ఉత్సుకతతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. అక్కడి అధికారులు, గైడ్‌ల సూచనల మేరకే ప్రతి ఒక్కరూ నడుచుకోవడం మేలు. 
చీకటి పడే లోపే విహార యాత్ర ముగించుకుని- గమ్యస్థానానికి బయలుదేరడమో, బస ప్రాంతానికి చేరుకోవడమో చేయాలి. 
కచ్చితంగా లైఫ్‌ జాకెట్లు ధరించాలి.
పరిమితికి మించి లాంచీలో ఎక్కించుకుంటే, అప్పటికే అందులో ఉన్నవారు అభ్యంతరం చెప్పి
తీరాలి. యాత్రికులు సైతం పరిస్థితి గ్రహించి అందులో ఎక్కకుండా తర్వాతి బోటులో రావాలి.
ఆ బోటు పర్యాటక శాఖదైనా, ప్రైవేటుదైనా..అనుమతి ఉన్నవాటిలోనే ప్రయాణించాలి. వీటిని వరద సమయంలో తిప్పరు. ట్రిప్పులను రద్దు చేస్తారు. 
తగిన సామర్థ్యం లేని లాంచీలో అడుగుపెట్టొద్దు. ఏ సందేహాలు ఉన్నా యాత్ర కూడదు.
నిత్యం బోటు షికారు ఉన్న చోటే పర్యాటకులు ప్రాధాన్యం ఇవ్వాలి. నాటు పడవలు, పుట్టీలు పుట్టి ముంచుతాయి.  ః  ప్రయాణంలో అంతా ఒకవైపు వెళ్లిపోయి సెల్ఫీలు, ఫొటోలు తీసుకోకూడదు.


 
 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.