close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

కత్తులతో నరికి..కడతేర్చి..

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య
తూరంగిలో కలకలం

పట్నాల వెంకట్రావు మృతదేహం

కాకినాడ గ్రామీణం(సర్పవరం జంక్షన్‌), న్యూస్‌టుడే: ఇంట్లో నిద్రిస్తున్న ప్రధానోపాధ్యాయుడిని తలుపులు తెరిచి కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపిన సంఘటన కాకినాడ గ్రామీణ మండలంలోని తూరంగిలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రేవూరు    ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పట్నాల వెంకట్రావు(57) ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు కిటికీ తలుపు పగులగొట్టి దాని ద్వారా పొడవాటి కర్రతో ప్రధాన ద్వారం తెరిచి హతమార్చిన సంఘటన ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. వెంకట్రావుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెలిద్దరికీ వివాహాలయ్యాయి. పెద్ద కూతురు దీపిక రామచంద్రాపురం మండలంలోని చోడవరంలో నివసిస్తుండగా చిన్న కూతురు రాధిక హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి సుమారు 8.30 గంటలకు చిన్న కూతురు వద్దకు వెళ్లడానికి భార్య వెంకటరమణను హైదరాబాద్‌ బస్సు ఎక్కించి ఇంటికి వచ్చి తలుపులు వేసి నిద్రపోయాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్న భార్య తన భర్త వెంకట్రావుకు సమాచారం అందించేందుకు చరవాణికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ చేసి ఉండడంతో అదే ప్రాంతంలో ఉంటున్న వియ్యంకుడికి ఫోను చేసి సమాచారం అందించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మేనల్లుడు భద్రి, అన్న కుమారుడు ప్రదీప్‌లు వచ్చి వెంకట్రావు ఇంటి వద్ద పరిశీలించగా, తాళాలు వేసి ఉన్నాయి. అనుమానంతో వెనుక వైపు నుంచి పరిశీలించగా తలుపులు తెరిచి ఉండడం చూసి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో మృతి చెంది ఉన్న వెంకట్రావును చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడ డీఎస్పీ కరణం కుమార్, సీఐ ఆకుల మురళీకృష్ణ, ఇతర పోలీసు అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్‌ టీం, పోలీసు జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇంటి చుట్టూ తిరిగి ఇంటి వెనుక వైపు రహదారిలోకి కొంతవరకు వెళ్లి జాగిలాలు ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న బంధువులు, ఉపాధ్యాయులు పెద్ద    సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని వెంకట్రావుతో ఉన్న సాన్నిహిత్యాన్ని తలచుకుని బోరున విలపించారు. మృతుడి తల్లి సత్యవతి, కూతురు దీపిక సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలిచి వేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించారు. భార్య వెంకటరమణ, చిన్న కూతురు రాధిక ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్‌ నుంచి కాకినాడకు చేరుకున్నారు. హత్యకు గురైన వెంకట్రావు వివాద రహితుడని, అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కలుపుగోలుగా ఉండే వ్యక్తి అని విద్యాశాఖ అధికారులు గణేష్‌బాబు, విజయలక్ష్మిదేవి, పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

రోదిస్తున్న కుమార్తె దీపిక

కక్ష పూరితంగానే హత్య: డీఎస్పీ
ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు ఇంటిలో నిద్రిస్తుండగా గడియ పెట్టిన తలుపును తెరిచి సుమారు రాత్రి 10.30 గంటల తర్వాత దుండగులు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసినట్టుగా భావిస్తున్నామని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్‌ తెలిపారు. హత్య జరిగిన తీరును పరిశీలించగా ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు ఇందులో పాల్గొన్నారన్నారు. మృతుడికి, నిందితులకు మధ్య పెనుగులాట జరిగినట్లుగా మృతుడి ఛాతీ, భుజం, పొట్ట తదితర ప్రాంతాల్లో కత్తి గాయాలతో పాటు మెడ ప్రాంతంలో కత్తితో వేటు ఉందన్నారు. ఇంట్లోని బంగారం, నగదు వంటివి చోరీకి గురికాలేదని, కక్షపూరితంగానే హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. మృతుడు వెంకట్రావు ఉపాధ్యాయ వృత్తితో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటాడని, అదేవిధంగా భూమి సరిహద్దు తగాదాలు కూడా ఉండడంతో పాటు ఇంకా ఏదైనా కారణం ఉంటుందేమోనని భావించి ఆ దిశగానూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ పట్టణ సీఐలు పి.శ్రీనివాసరావు, పి.ఈశ్వరుడు, గోవిందరావు, రామకోటేశ్వరరావు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

 


సంఘటన స్థలం వద్ద రోదిస్తున్న మృతుడి తల్లి సత్యవతి 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.