close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

లైఫ్‌ జాకెట్‌తోనే బోటులోకి ప్రవేశం

హుస్సేన్‌సాగర్‌లో విహారానికి జాగ్రత్తలు తప్పనిసరి
ఈనాడు-హైదరాబాద్‌

జాగ్రత్తలు తీసుకుంటే బోటు షికారు యమ హుషారుగా సాగుతుంది. ఏమాత్రం శృతి మించినా గతి తప్పుతుంది. హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారంటే పర్యాటకులే కాదు..నగరవాసులు ఉత్సాహం చూపిస్తారు. హుస్సేన్‌సాగర్‌లోని భగీరథి, ఖైరున్నీసా, భాగమతి బోట్లలో వందమంది చొప్పున ప్రయాణించవచ్చు. వీటినే పార్టీలకు కూడా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ సమకూరుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ..రాత్రి 8 గంటల తర్వాత అర్థరాత్రి వరకూ వీటిలో పార్టీలు చేసుకోవచ్చు. పార్టీ అయినా..పర్యాటకమైనా లైఫ్‌ జాకెట్లు వేసుకోవాల్సిందే అని పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగులు తెలిపారు. గతేడాది కృష్ణా జిల్లాలో పడవ మునక తర్వాత ఏమాత్రం అజాగ్రత్తగా లేకుండా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఆదివారం పాపికొండల యాత్రలో పడవ మునిగిన ఘటన దురదృష్టకరమన్నారు.

గతంలో ప్రమాదాలే గుణపాఠాలు.. స్పీడ్‌ బోటులో ప్రయాణిస్తుండగా..ఐటీ ఉద్యోగిని మెడకు మెకనైజ్డ్‌ బోటు తగలడంతో పీక తెగి ప్రాణాలు పోగొట్టుకుంది. ఇలా బోటు షికారును కొన్నాళ్లపాటు రద్దు చేశారు. పర్యాటకులున్నా..సామర్థ్యానికి మించి ఎక్కించబోమని చెబుతున్నారు. వందమంది సామర్థ్యం ఉన్నా..80 నుంచి 90 మంది వరకే పరిమితమౌతామని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌లో వంద మంది ప్రయణించేందుకు వీలుగా మూడు పెద్ద బోట్లున్నాయి. 50 మంది ప్రయాణించే మెకనైజ్డ్‌ బోట్లు ఆరు నడుస్తున్నాయి. స్పీడ్‌ బోట్లు అయిదు, అమెరికా నుంచి వచ్చిన ఫాంటూన్‌ బోట్లు మూడు ఉన్నాయి. సందర్శకులు వీటి ద్వారా హుస్సేన్‌సాగర్‌ మధ్యన ఉన్న బుద్ధుడి విగ్రహం వరకూ వెళ్లి.. అక్కడ కొంత సమయం వెచ్చించి.. తిరిగి లుంబినీ బోటు షికారు కేంద్రానికి చేరుకుంటారు. వారాంతాల్లో అయిదు వేల నుంచి ఆరు వేల మంది వరకూ బోటుల్లో షికారు చేసి హుషారుగా గడుపుతారు.

ప్రైవేటు ఆపరేటర్లకు లేదు అనుమతి..
హుస్సేన్‌సాగర్‌తో పాటు.. రాష్ట్రంలో ఎక్కడా ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ సిబ్బంది తెలిపారు. పాకాల చెరువులో రెండు పురాతన బోట్లు ప్రైవేటు వాళ్లు నడుపుతున్నా.. వాటి సామర్థ్యంపై నిఘా ఉంచామన్నారు. కరీంనగర్‌ ఎల్‌ఎండీ, నాగార్జునసాగర్‌, శ్రీశైలం, సోమశిల నుంచి బోట్లు నడుపుతున్నా.. కృష్ణా నది ప్రవాహ జోరును పరిశీలిస్తాం. ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా.. అస్సలు బోట్లు తీయం. వీటికి తోడు సుశిక్షుతులైన బోటు డ్రైవర్లకే అనుమతిస్తాం. హుస్సేన్‌సాగర్‌లో బోటు నడిపేవారికి జాతీయ జల క్రీడల శిక్షణ సంస్థలో శిక్షణ ఇప్పించినట్లు అధికారులు తెలిపారు.

బోటు షికార్లు రద్దు..
సరూర్‌నగర్‌, దుర్గం చెరువు, సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్‌, పబ్లిక్‌గార్డెన్స్‌, మీరాలం చెరువు, ప్రగతినగర్‌, ఐడీఎల్‌ చెరువుల్లో గతంలో బోటు షికార్లు నడిచినా.. ప్రస్తుతం భద్రతా ప్రమాణాల దృష్ట్యా రద్దు చేశారు. చెరువుల్లో నీరున్నా.. తగిన సిబ్బంది లేక ఎక్కడా బోట్లు నడపలేకపోతున్నామని..అలా అని ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతించడంలేదని పర్యాటక అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.