close

శనివారం, అక్టోబర్ 19, 2019

ప్రధానాంశాలు

డెంగీ బూచి.. డబ్బులు దోచి!

రక్త కణాలు తగ్గుతున్నాయని భయాందోళన
ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ
మొక్కుబడిగా వైద్యారోగ్యశాఖ సేవలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

చిగురుమామిడి మండలానికి చెందిన రాజేశ్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఒక్కసారిగా జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న గ్రామీణ వైద్యుడిని ఆశ్రయించి చికిత్స పొందగా తగ్గలేదు. దీంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. రక్త కణాలు తగ్గాయని, డెంగీ జ్వరంగా చెప్పి 5 రోజుల పాటు చికిత్స అందించారు. ఇందుకుగాను రూ.40వేలకు పైగా బిల్లు వసూలు చేశారు. ఇది ఈ ఒక్కరి పరిస్థితే కాదు... ఎంతో మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు కుమ్మరించి చికిత్స పొందుతున్నారు.

ప్రైవేటు ఆసుపత్రులు డెంగీని ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా నిర్ధారించకూడదని ఇటీవల సమీక్షలో ఆదేశించినా ఫలితం ఉండటం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు చికిత్స పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ పరంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్యారోగ్యశాఖ విఫలమైంది. వైద్యులు ఎవరికీ సెలవులు ఇవ్వకూడదని ప్రకటించినా ఆశించిన ఫలితాలు లేవు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో తప్ప మిగతా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తకణాలు తగ్గిన వారికి  వైద్యం అందించే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలో మంథని, చొప్పదండి నియోజకవర్గాల్లో ముగ్గురికిపైగా జ్వరాలతో మరణించారు. ఇకనైనా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమై తగు చర్యలు చేపట్టకపోతే గ్రామాలకు గ్రామాలు జ్వరాలతో మంచం పట్టే పరిస్థితి ఏర్పడుతుంది..

రక్తకణాలు తగ్గిన జ్వరాలే ఎక్కువ
వాతావరణ మార్పులు, వర్షాకాలం మూలంగా దోమల తీవ్రత పెరగడంతో డెంగీ జ్వరాల నిర్ధారణ తగ్గినప్పటికీ రక్తకణాలు తగ్గిన జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వైరల్‌ ప్రభావంతో కుటుంబంలో అందరినీ జ్వరాలు చుట్టుముడుతున్నాయి.
రక్తకణాలు తగ్గడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నాయి. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయిస్తే ఆరోగ్యకేంద్రాల్లో అవసరమైన వైద్యం అందడం లేదు. దీనికితోడు సంబంధిత వైద్యాధికారులు కూడా జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడ కూడా జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా ఉండటమే కాకుండా సరైన వైద్యం అందక ప్రైవేటును ఆశ్రయించాల్సి వస్తోంది. కనీసం నియోజకవర్గ కేంద్ర ఆస్పత్రుల్లోనైనా రక్తకణాలు తగ్గిన వారికి తగిన వైద్యం అందేలా చూడాల్సిన అవసరం ఉంది.

పెరుగుతున్న మరణాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జ్వర పీడితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏ కుటుంబాన్ని కదిలించినా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌గున్యా వంటి జ్వరాలతో బాధపడుతున్న వారు ఉంటున్నారు. వీరిలో రక్తకణాలు తగ్గిన వారే ఎక్కువగా ఉన్నారు. చొప్పదండి, మంథని నియోజకవర్గాల పరిధిలో జ్వరాల బారినపడి పలువురు మృతి చెందారు. ఈ సంఖ్య పెరగకముందే ప్రభుత్వం అప్రమత్తం కావాల్సి ఉంది. రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ మంత్రి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ వైద్యులు అందుబాటులో ఉండాలని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదు. కొన్నిచోట్ల వైద్యులు స్థానికంగా నివాసం ఉండకుండా పట్టణాల నుంచి వచ్చి వెళ్తున్నారు. దీంతో సమయానికి వైద్యం అందడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అప్రమత్తం అవసరం
దోమల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఫలితంగా జ్వరాలు ముసురుకున్నాయి. వర్షాల మూలంగా గ్రామాల్లో నీరు నిలువడం, పారిశుద్ధ్యలోపంతో జ్వర పీడితుల సంఖ్య పెరగుతోంది. పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా, వైద్యారోగ్యశాఖ ఇతర శాఖల మధ్య సమన్వయం లోపించడంతో గ్రామాల్లో పనులు జరగడం లేదు. ప్రతి గ్రామానికి పారిశుద్ధ్య పనులకు జాతీయ ఆరోగ్యమిషన్‌ ద్వారా రూ.10వేలు కేటాయించినప్పటికీ వాటిని సరిగా వినియోగించడం లేదు. అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపడితేనే దోమలను నియంత్రించవచ్చు. వైద్యారోగ్యశాఖ పరంగా కూడా ఉపకేంద్రాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు, పర్యవేక్షకులు, వైద్యులు గ్రామాల వారీగా విభజించుకుని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే జ్వరాలతో ప్రజలు అల్లాడే అవకాశం ఉంది.

ప్రైవేటు వైద్య సేవలపై వివరాలు సేకరిస్తాం..
-డాక్టర్‌ రాంమనోహర్‌రావు, జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి
జ్వరాలు సోకినట్లు సమాచారం అందగానే ఆయా గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. వైద్యులకు సెలవులు రద్దు చేయడం జరిగింది. నిర్లక్ష్యం చేసే వారిని ఉపేక్షించేది లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సౌకర్యాలు డెంగీ పేరుతో జరుగుతున్న వైద్యసేవల సమస్యపై 10 ఆస్పత్రులకు ఒకరిచొప్పున వైద్యుడిని నియమించి వివరాలు సేకరిస్తాం. ఈనెల 16వ తేదీ నుంచి అమలు చేస్తాం.డెంగీ పేరుతో ప్రజలను భయపెడితే చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.