close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

పైసలు తగ్గినై..

నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో కోత ●

బడ్జెట్‌లో పరిషత్‌లకు కేటాయింపులు శూన్యం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

 

ఆర్థిక మాంద్యం సర్కారును కుదిపేస్తుండటంతో బడ్జెట్‌లో అభివృద్ధి పనులకు కేటాయింపులు భారీగా తగ్గాయి. అభివృద్ధి పనులకు నిధుల కొరత తలెత్తే ప్రమాదమేర్పడింది. నియోజకవర్గాల ప్రగతి కోసం ఎమ్మెల్యేలకు కేటాయించే మొత్తాన్ని ఏడాదికి రూ.3 కోట్ల నుంచి రూ.కోటికి తగ్గించారు. ఉభయ జిల్లాల్లోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. మిగతా చోట్ల తుది దశలో ఉన్నాయి.

ఉభయ జిల్లాల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. శాసనసభ్యులు, ఉపాధ్యాయులు, నామినేటెడ్‌ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో ఎన్నికైన భూపతిరెడ్డిపై వేటు పడటంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి(సీడీపీ) నిధులను పెంచారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో దీని కింద రూ.1.5 కోట్లు ఇవ్వగా 2016-17 నుంచి ఈ మొత్తాన్ని రూ.3 కోట్లకు పెంచారు. ఈ నేపథ్యంలో ఉభయ జిల్లాలకు ఏటా రూ.36 కోట్ల నిధులు వచ్చేవి. తాజాగా కోత విధించడంతో కేవలం రూ.12 కోట్లు మాత్రమే రానున్నాయి. మరో అయిదు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. మిగిలిన కొద్ది సమయంలో వీలైనన్ని ఎక్కువ పనులు చేపట్టాలని ఆశించిన ఎమ్మెల్యేలకు కోత విషయం మింగుడు పడటం లేదు.

అత్యవసరంలో..

సెగ్మెంట్లలో అత్యవసర పనుల పరిష్కారానికి సీడీపీ మొత్తాన్ని కేటాయించే వెసులుబాటు ఉంటుంది. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు పనులు మంజూరు చేస్తుంటారు. రూ.5 లక్షల లోపు పనులను నామినేషన్‌ పద్ధతిన తమ అనుచరులకు ఇస్తూ త్వరితగతిన పూర్తిచేసేలా చూస్తుంటారు.

వరుస ఎన్నికలు..

గతేడాది నిధులకు సంబంధించిన జీవోను మే నెలలో విడుదల చేశారు. ఆగస్టు చివరి వారంలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులకు అనుమతులు మంజూరయ్యాయి. సెప్టెంబరులో సర్కారు ఎన్నికలకు వెళ్లింది. నియమావళి అమల్లోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. దాదాపు ఎనిమిది నెలల పాటు వరుస ఎన్నికలు రావడంతో పనుల ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది.

వీటి పరిస్థితి అధ్వానం

పంచాయతీలతో సమానంగా మండల, జిల్లా పరిషత్లకు నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయి. తాజా బడ్జెట్‌లో వీటికి మొండిచెయ్యి చూపింది. ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తారని భావించినా..అవీ లేకపోవడంతో కొత్త పాలకవర్గాలు చతికిలబడ్డాయి. ఇక కేవలం సీనరేజీతో పాటు సాధారణ నిధుల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే అయిదేళ్ల నుంచి సీనరేజీ నిధులూ సక్రమంగా రాక ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోతున్నారు.

ప్రగతి పరుగులు పెట్టేదెలా..

*రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు చేస్తుందని ఆశించిన ప్రజాప్రతినిధులకు నిరాశే మిగిలింది.

*● రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సంక్షేమ పథకాలకే నిధులు కేటాయించింది.

*● జలవనరుల నిర్మాణాలకు సైతం అరకొరగా విదిల్చింది.

*● గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం పెంపొందించడానికి ప్రాధాన్యం ఇచ్చింది.

ఈ విన్నపాలు ఎలా..?

*● గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణాలకు నిధుల మంజూరీపై ప్రజాప్రతినిధులకు విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి.

*● కామారెడ్డి జిల్లాలోని 443 ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు.

*● 343 సర్కారీ బడుల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని తొలగించి కొత్తవి నిర్మించాలనే డిమాండు ఉంది.

సీఎం కరుణ చూపితేనే..

సీడీపీకి కేటాయింపులు తగ్గించిన సర్కారు ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.7,400 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని సీఎం ఇచ్చే హామీలను నెరవేర్చేందుకు వెచ్చిస్తుంటారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించుకోవాల్సి ఉంది.

పంచాయతీలకు మెరుగు

తాజా బడ్జెట్‌లో పంచాయతీలకు నెలనెలా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని కోసం 14 ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు సైతం వినియోగిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సగటున ఒక్కో పంచాయతీకి నెలకు రూ.2.65 లక్షలు, అంతకు మించి లబ్ధి జరిగే అవకాశం ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉభయ జిల్లాల్లోని 1,056 పంచాయతీలకు కలిపి నెలకు రూ.31.20 కోట్లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే సెప్టెంబరుకు సంబందించిన నిధులు ఖజానా శాఖకు చేరుకొన్నాయి.

ఏడాది నుంచి విదల్చరే..

సీడీపీ నిధులను ప్రభుత్వం ఏడాదిలో మూడు నెలలకోమారు రూ.75 లక్షల చొప్పున విడుదల చేసేది. ఈ ఏడాది ఇప్పటికే మూడు త్రైమాసికాలు పూర్తి కావొస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి విదల్చలేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.