close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

బిల్లు ఎక్కువైనా ఫర్వాలేదు రోజులు తక్కువ కాకుండా చూస్కో!

26 రోజులకు రీడింగ్‌ తీసినా నెలకు సర్దుబాటు చేస్తున్న డిస్కం
భారం పడుతోందని వినియోగదారుల ఆందోళన

విద్యుత్తు బిల్లులు వేయడంలో డిస్కం తనకు ఎక్కడా నష్టం రాకుండా చాలా జాగ్రత్తపడుతోంది. ఇన్నాళ్లు.. నెల రోజుల తర్వాత బిల్లు తీస్తే ఆ మొత్తాన్ని ఆ నెలలో ఎన్ని రోజులున్నాయో వాటికి సర్దుబాటు చేసేవారు. ఒక వేళ 30 రోజులకు ముందే బిల్లు తీస్తే..!? అదే సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తోంది. అంటే.. 26 రోజులకు మీటర్‌ రీడింగ్‌ తీసినా డిస్కం నెలరోజులకు సర్దుబాటు చేస్తోంది. పద్ధతి అవలంబించడం వల్ల వినియోగదారుల మీద భారం మోపినట్లవుతోంది. ఒకనెలలో సర్దుబాటు చేసినట్లే చేసి మరుసటి నెలలో ఆ మొత్తాన్ని పిండేస్తోంది.

ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌లో ప్రతినెల విద్యుత్తు బిల్లుల రీడింగ్‌ నమోదు పెద్ద ప్రహాసనం. భారీ సంఖ్యలో ఉన్న కనెక్షన్లు.. పరిమితంగా ఉన్న సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ప్రతినెలా ఒకే తేదీనా బిల్లింగ్‌ తీయడం అసాధ్యం. దీంతో ఇటీవల ఎప్పుడు బిల్లు తీసినా నెలరోజులకు సర్దుబాటు చేసేందుకు ‘ప్రొపర్షనేట్‌ డేస్‌ బిల్లింగ్‌’లో బిల్లులను జారీ చేస్తున్నారు. నెలకు ఇవ్వాల్సిన బిల్లును 35 రోజులకు జారీ చేస్తే.. ఆ మేరకు 30 రోజులకు హేతుబద్ధీకరిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మరుసటి నెలలో 26 రోజులకు బిల్లులు తీయాల్సి వస్తే వీటిని కూడా 30రోజులకు సర్దుబాటు చేస్తున్నారు. దీంతో తాము తక్కువ విద్యుత్తు కాల్చినా కొన్నిసార్లు ఎక్కువ బిల్లులు వస్తున్నాయని సిబ్బందిని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

డిస్కం నష్టపోకూడదని..
ఆలస్యంగా తీస్తే ఎలాగైతే నెలరోజులకు సర్దుబాటు చేస్తున్నామో.. ముందు తీసినా నెలరోజులకే సర్దుబాటు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. ఈఆర్‌సీ అనుమతితోనే కొత్త బిల్లింగ్‌ విధానం అందుబాటులోకి తీసుకోచ్చామని చెబుతున్నారు. ముందు తీసినప్పుడు సర్దుబాటు చేయడం ఎందుకని అధికారులను అడిగితే.. అలా చేయకపోతే డిస్కం నష్టపోతుంది కదా అంటున్నారు. ఆలస్యంగా తీయడం, ముందు తీయడం డిస్కం సమస్య అని.. అందుకు తమపై ఎందుకు భారం మోపుతున్నారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

నెలకాకముందే తీస్తే(పాత పద్ధతిలో..)
ఒక వినియోగదారుడికి ఆగస్టులో 26 రోజులకే బిల్లు తీశారు. అతను కాల్చింది 90 యూనిట్లు. పాత పద్ధతిలో బిల్లు చూస్తే..
0-100 యూనిట్ల శ్లాబు ధరలు వర్తిస్తాయి.
ఆ ప్రకారం యూనిట్‌ 1 నుంచి 50 వరకు రూ.1.45, ఆపై మిగతా 40 యూనిట్లకు రూ.2.60 లెక్కించేవారు.
దీంతో బిల్లు రూ.176.50 అయ్యేది. దీనికి కస్టమర్‌ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రుసుములు అదనం.

కొత్త బిల్లింగ్‌ ప్రకారం..
26 రోజులకే బిల్లింగ్‌ తీశారు. కాల్చిన యూనిట్లేమో 90. ఆగస్టు నెలలో 31 రోజులు ఆ మేరకు సర్దుబాటు చేస్తున్నారు.
వాడిన యూనిట్లను బిల్లు తీసిన రోజులతో భాగించి ఆ నెలలోని మొత్తం రోజులతో గుణిస్తారు.
ఆ ప్రకారం 90/26 శ్రీ 31 చేస్తే 107 యూనిట్లు అయ్యింది.
107 యూనిట్లుగా తేల్చారు. దీన్ని కేవలం శ్లాబుల విభజనకే పరిగణనలోకి తీసుకుంటారు. ఇక్కడ 107 యూనిట్లకు రెండు (0-100, 101-200) శ్లాబులు ఉంటాయి.
కాని వినియోగదారుడు అసలు కాల్చింది 90 యూనిట్లే. ఎన్ని యూనిట్లు ఏ శ్లాబులోకి తీసుకోవాలనే విషయంలో మరో లెక్క ఉంది.
ఎందుకంటే మొత్తానికి కాల్చింది 90 యూనిట్లు. ఇందులో ఎన్ని యూనిట్లు ఏ శ్లాబులో ఉన్నాయో తేల్చాల్సి ఉంది.

శ్లాబుల విభజన ఇలా..: ఆ రెండు శ్లాబ్‌ల్లోని గరిష్ఠ యూనిట్లను ఆ నెలలోని రోజులతో భాగించి రీడింగ్‌ తీసిన రోజులతో గుణిస్తారు. అప్పుడు 100/31 శ్రీ 26 లెక్కిస్తే దాదాపు 84 యూనిట్లు వచ్చింది.
1 నుంచి 100 వరకు మారిన శ్లాబు ప్రకారం రూ.3.30 వర్తించే రేటును 84 యూనిట్లను లెక్కిస్తే రూ.277.20 అవుతుంది. మిగిలిన (90-84) 6 యూనిట్లకు రూ.4.30 లెక్కిస్తే రూ.25.80 అవుతుంది. మొత్తం బిల్లు 90 యూనిట్లకు రూ.303 రూపాయలు అవుతుంది. దీనికి రుసుములు అదనం.
ముందే తీయడంతో బిల్లు రూ.126.50 పెరిగింది. ఈ మేరకు వినియోగదారుడికి భారమే.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.