close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

నల్లా పైపులకు ఇంటిదొంగల చిల్లులు!

200కు పైగా అనుమతి లేని కనెక్షన్లు గుర్తింపు
ఓ మేనేజరుపై చర్యలకు రంగం సిద్ధం?

జలమండలి ఆదాయాన్ని పీల్చేస్తున్న అక్రమ నల్లా కనెక్షన్లపై ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపుతున్నా... స్థానిక ఉద్యోగులు, అధికారుల నుంచి సహకారం కొరవడుతోంది. విజిలెన్సుకు సహకరించకపోగా.... కొందరు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్లు తాజాగా అధికారులు గుర్తించారు.

ఈనాడు, హైదరాబాద్‌

అక్రమాలకు కారణం వారే!
యాఖుత్‌పురా పరిధిలోని ఓ భారీ భవంతికి అక్రమ నల్లా ఉన్నట్లు గుర్తించి, వెంటనే తొలగించారు. దాదాపు రూ.2 లక్షల వరకు జరిమానా విధించారు. ఈ విషయంలో స్థానిక మేనేజరు ఒకరు అక్రమ నల్లా తీసుకున్నవారికి కొమ్ము కాస్తున్నట్లు తెలిసింది. జరిమానా వసూలు, చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. మేనేజరు తీరుతో విస్తుపోయిన విజిలెన్సు అధికారులు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా అతనిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

రోజూ తనిఖీలు..
గ్రేటర్‌ వ్యాప్తంగా అక్రమ నల్లా కనెక్షన్లపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. విజిలెన్సు బృందాలను రంగంలోకి దింపి జల్లెడ పడుతోంది. గత ఆరు నెలల్లో దాదాపు 200 అక్రమ కనెక్షన్లు గుర్తించింది. వీటిని తొలగించి క్రిమినల్‌ కేసులతోపాటు దాదాపు రూ.2.5 కోట్ల వరకు జరిమానాలు విధించింది. తొలుత భారీ భవంతులు, అపార్ట్‌మెంట్‌లు, వాణిజ్య భవనాలపై దృష్టి పెట్టింది. నిత్యం ఏదో ప్రాంతంలో ఇంటింటా తనిఖీలు చేస్తూ సుమారుగా 2 నుంచి 3 అక్రమాలు గుర్తించి, చర్యలు తీసుకుంటోంది.

సిబ్బందే మోకాలడ్డుతున్నారు!
సహకరించాల్సిన కింది స్థాయి అధికారులు, సిబ్బందిలో వణుకు మొదలవుతోంది. ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనని తనిఖీలకు మోకాలడ్డుతున్నారు. విజిలెన్సు అధికారులు వస్తున్న సంగతి ముందే అక్రమ కనెక్షన్లు ఉన్న వారికి చెప్పి అప్రమత్తం చేస్తున్నారు. ఇంకొందరు అధికారులు ఆ వైపు పోకుండా తప్పుదారి పట్టిస్తున్నారు. కొందరైతే స్థానిక ప్రజాప్రతినిధులతో ఉన్నతాధికారులకు ఫోన్లు చేయాలని సలహాలు ఇస్తున్నారు. ఇటీవల పాతబస్తీ, కూకట్‌పల్లి ప్రాంతంలో భారీఎత్తున అక్రమ నల్లాలు గుర్తించి, జరిమానా విధించగా.. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు జలమండలి ఉన్నతాధికారులకు ఫోన్లు చేసినట్లు సమాచారం. చివరికి అసలు పరిస్థితిని ప్రజాప్రతినిధులకు వివరించడంతో మిన్నకుండిపోయారు.

కనెక్షన్లు ఇచ్చే వారిపై చర్యలేవి?
సక్రమంగా నల్లా తీసుకుంటే ఛార్జీలు, నెలానెలా బిల్లులు కట్టాలని చెబుతూ పైపుల సైజును బట్టి రూ.10 వేల నుంచి కొన్ని సార్లు 2-3 లక్షలు వరకు స్థానిక ఇబ్బందే వసూలు చేస్తున్నారు. ఇందులో అందరికీ వాటాలు ఉంటున్నాయి. కొందరు డబ్బులు తీసుకొని ఏకంగా కేటగిరి మార్చేస్తున్నారు. వాణిజ్య కేటగిరిలో ఉండే భవనానికి సాధారణ గృహ నల్లా ఇస్తున్నారు. తాజాగా విజిలెన్సు గుర్తిస్తున్న నల్లాల్లో అక్రమ నల్లాలతోపాటు కేటగిరి మార్చేసినవే కనిపిస్తున్నాయి. ఇంత చేసినా ఇంటి యజమానులపై కేసులు, జరిమానాలంటూ హడావుడి చేస్తున్న అధికారులు అసలు దొంగ కనెక్షన్లకు కారణమైన సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. మరో వైపు జలమండలి సేవలు అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు పెరిగినా ఆదాయం మాత్రం నెలకు రూ.90 కోట్లకు మించి రావడం లేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.